నల్లగా ఉందని ఆమెను పట్టించుకోలేదట..!
బెంగళూరు: నల్లగా ఉందన్ని టీచర్లు పక్షపాతం చూపటంతో ఓ బాలిక కసితో జిమ్నాస్టిక్స్‌లో కఠోర సాధన చేసింది. అసాధారణ ప్రతిభ చూపి దేశంలోనే ప్రప్రథమంగా జిమ్నాస్టిక్స్‌లో గిన్నిస్ రికార్డు సృష్టించింది. బెంటళూరు నగరానికి చెందిన గిరిశ్, మంజుల దంపతుల కుమార్తె దీక్ష(8) గంట సమయంలోనే 2,776 ఫార్వర్డ్ రోలింగ్‌తో 4.5 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించింది. గతంలో అమెరికాకు చెందిన అశ్రితా ఫర్మాన్ చేసిన 1,330 ఫార్వర్డ్ రోలింగ్, 3.5 కిలోమీటర్ల రికార్డును బద్దలు కొట్టింది.
శుక్రవారం నగర ప్రెస్‌క్లబ్‌లో మీడియా ముందు జిమ్నాస్టిక్స్ లో తనకు అందిన గిన్నిస్ రికార్డు పత్రాన్ని దీక్ష ప్రదర్శించింది. తల్లిదండ్రుల, వివిధ జాతీయ, అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్ల సమక్షంలో దీక్షా జిమ్సాస్టిక్స్‌లో ఫార్వర్డ్ రోలింగ్‌ను ప్రదర్శించింది. తండ్రి గిరీశ్ మాట్లాడుతూ.. తన కుమార్తె ఈ రికార్డు సృష్టించేందుకు ప్రధానమైన కారణం పట్టుదలే అన్నారు. అందరితో పాటు చక్కగా జిమ్నాస్టిక్ చేయగలిగిన దీక్షా నల్లగా ఉందన్న కారణంతో ఆమె తరగతిలోనే అందంగా ఉన్న మరో విద్యార్థిని ఎంపిక చేశారు.
ప్రతిభను పట్టించుకోకుండా తన కూతురును అవమానపరిచారని విచారం వ్యక్తం చేశారు. దీంతో దీక్షాను ఉన్నత స్థాయిలో ఉన్న రికార్డును చేధించాలని సుమారు ఏడాది పాటు కఠిన శిక్షణ ఇప్పించానని ఆయన తెలిపారు. తన కూతురు కూడా పట్టుదలతో శిక్షణ తీసుకుని గిన్నిస్ రికార్డు సృష్టించి కర్ణాటకకు గౌరవం తెచ్చిందని చెప్పారు. ఈ సందర్భగా దీక్షా గిరీశ్‌ను వివిధ జాతీయ, అంతర్జాతీయ ఆటగాళ్లు అభినందించారు.