
సాక్షి, టీ. నగర్: సినిమాల్లో జరిగినట్లు ఎవరూ ఒక్క రోజులో ముఖ్యమంత్రి కాలేరని పేరవై ప్రధాన కార్యదర్శి జె.దీప అన్నారు. తనపై రూ. 1.12 కోట్లు మోసగించినట్లు ఆరోపణలు రావడం శశికళ కుటుంబీకులు చేసిన కుట్రగా జె. దీప పేర్కొన్నారు. కడలూరులో ఎంజీఆర్ అమ్మ దీప పేరవై తూర్పు జిల్లా ఆధ్వర్యంలో ఎంజీఆర్, జయలలిత బహిరంగ సభ, సంక్షేమ సహాయకాల పంపిణీ కార్యక్రమం తేరడి మైదానంలో సోమవారం రాత్రి జరిగింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న దీప మాట్లాడుతూ.. జయలలిత జీవిత చరిత్ర పుస్తకాన్ని ఆమె పుట్టిన రోజు నుంచి రాయడం ప్రారంభించారని తెలిపారు.
అన్నాడీఎంకేను, ప్రజలను కాపాడాల్సిన బాధ్యత తనకు ఉందన్నారు. జయలలిత మృతిపై విచారణ కమిషన్ ఏర్పాటైందని, ఈ కమిషన్ ద్వారా వాస్తవాలు బయటపడుతాయని తెలిపారు. అంతేకాక ఆమె తనపై వచ్చిన రూ. 1.12 కోట్ల వ్యవహారం ప్రస్తావించారు. దీనిపై మోసం చేసినట్లు ఫిర్యాదులందాయని వాపోయారు.
తనపై ఇది వరకే అనేక ఫిర్యాదులు చేయడమే కాకుండా అసత్యాలను వెల్లడిస్తున్నారని ఆమె అన్నారు. ప్రస్తుతం రూ. 1.12 కోట్లు మోసం చేసినట్లు వచ్చిన ఫిర్యాదు శశికళ కుటంబీకులు చేసిన కుట్రగా జె. దీప తెలిపారు.