సాక్షి, న్యూఢిల్లీ: నీరజ్ బవానా కేసులో అరెస్టు కాకుండా తప్పించుకు తిరుగుతున్న మాజీ ఎమ్మెల్యే రాంబీర్ షౌకీన్ అరెస్టుకు ఢిల్లీలోని ఓ న్యాయస్థానం నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. షౌకీన్‌కు బెయిలుకు వీలులేని వారంటు జారీ చేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్... అదనపు సెషన్స్ న్యాయమూర్తి నీనా భన్సల్ కష్ణ ఎదుట పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తుకు సహకరించవలసిందిగా కోరుతూ షౌకీన్‌కు నోటీసులు జారీచేసినప్పటికీ ఆయన ముందుకు రాలేదని స్పెషల్ సెల్ ఏసీపీ మనీషీ చంద్ర తెలిపారు. షౌకీన్ ఎక్కడున్నది తమకు తెలియదని ఆయన బంధువులు తమతో అంటున్నారని చంద్ర తెలిపారు. ఢిల్లీ పోలీసు స్పెషల్ సెల్ ఇటీవల ప్రముఖ గ్యాంగ్‌స్టర్ నీరజ్ బవానాను అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. నీరజ్ అందించిన సమాచారం ఆధారంగా పోలీసులు బవానా ప్రాంతంలో షౌకీన్‌కు చెందిన ఓ ప్లాటులో పాతిపెట్టిన ఏకే-47 తుపాకీని, ఎస్‌ఎల్‌ఆర్ రైఫిల్‌ను వెలికితీశారు. అయితే షౌకీన్ మాత్రం ఆ ప్లాటుకు తనకూ సంబంధం లేదని, రాజకీయ దురుద్దేశంతో తనపై బురద చ ల్లుతున్నారని చెప్పారు. సీబీఐతో దర్యాప్తు జరిపించాలని కూడా ఆయన డిమాండ్ చేశారు.