నిర్భయ అత్యాచారం కేసు ఉరిశిక్షపై స్టే కొనసాగింపు
Published Mon, Apr 7 2014 10:29 PM | Last Updated on Sun, Sep 2 2018 5:20 PM
న్యూఢిల్లీ: సంచలనం సృష్టించిన గత డిసెంబర్ 16 నాటి నిర్భయ సామూహిక అత్యాచారం కేసు దోషుల్లోకి ఇద్దరికి ఉరిశిక్ష విధింపుపై విధించిన స్టేను సుప్రీంకోర్టు ఈ నెల 14 వరకు పొడగించింది. ఈ కేసులో ముకేశ్, పవన్‌గుప్తాకు ఉరి విధించడంపై మార్చి 15న సుప్రీంకోర్టు స్టే విధించింది. అది 31 తేదీన ముగియగా, దానిని ఈ నెల ఏడు వరకు పొడగించింది. తాజాగా మరో వారం గడువు ఇచ్చింది. నిర్భయ చికిత్స పొందిన సింగపూర్ ఆస్పత్రి వైద్యులు ఇచ్చిన పోస్టుమార్టం నివేదికను ఈలోపు సమర్పించాలని న్యాయమూర్తులు బీఎస్ చౌహాన్, జె.చలమేశ్వర్‌తో కూడిన బెంచ్ దోషుల న్యాయవాది శర్మను ఆదేశించింది. ఈ కేసులో దిగువకోర్టు తీర్పు ప్రతులను సమర్పించాలని మార్చి 31నే ఆదేశించింది. వీరితోపాటు ఈ కేసులో అక్షయ్ ఠాకూర్, వినయ్ శర్మకు ఢిల్లీ హైకోర్టు ఉరిశిక్ష విధించడం తెలిసిందే.
ఇది అత్యంత అరుదైన, క్రూరమైన నేరం కాబట్టే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించింది. 2012 డిసెంబర్ 16న దక్షిణఢిల్లీలో కదులుతున్న బస్సులో మైనర్ సహా ఆరుగురు నిర్భయపై సామూహికంగా అత్యాచారం చేయడం తెలిసిందే. తీవ్రగాయాలపాలైన బాధితురాలు చికిత్స పొందుతూ అదే నెల 29న సింగపూర్ ఆస్పత్రిలో మరణించింది. ఈ కేసులో కీలక నిందితుడైన రామ్‌సింగ్ 2012 మార్చి 11న తీహార్‌జైల్లో ఆత్మహత్య చేసుకున్నాడు. ఇక ఆరో నిందితుడైన మైనర్ యువకుడికి బాలల న్యాయస్థానం మూడేళ్ల శిక్ష విధించింది. మైనరే అయినా, ఇతడికి కూడా ఉరిశిక్ష విధించాలంటూ దాఖలైన పిటిషన్‌ను న్యాయస్థానం కొట్టివేసింది.
Advertisement
Advertisement