డీటీసీ బస్సుల్లో మళ్లీ ‘జీపీఎస్’
Published Thu, Sep 26 2013 1:59 AM | Last Updated on Fri, Sep 1 2017 11:02 PM
న్యూఢిల్లీ: రెండేళ్ల విరామం తర్వాత ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ బస్సుల్లో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్(జీపీఎస్)లను అమర్చారు. ఈ మేరకు డీటీసీకి, జీపీఎస్ వ్యవస్థను నిర్వహించే డీఐఎంటీఎస్ మధ్య ఒప్పందం కుదిరింది. కాగా, జీపీఎస్ పరికరాల అమరిక, డీటీసీ బస్సుల నుంచి డాటా సమీకరణ, నివేదిక మదింపులో ఇబ్బందులపై డీఐఎంటీఎస్‌కు డీటీసీ లేఖ రాసింది. ఈ విషయమై డీటీసీ సీనియర్ అధికారి ఒకరు మాట్లాడుతూ ‘ జీపీఎస్ ఇచ్చే సమాచారం బట్టి నిబంధనలను ఉల్లంఘించిన డ్రైవర్లపై చర్యలు తీసుకునేందుకు అవకాశముంటుంది. ప్రస్తుతం, బస్సుల్లో స్పీడ్ నియంత్రణ ఉల్లంఘనపై సమాచారం అందుతోంది.
జీపీఎస్ ఏర్పాటు వల్ల బస్సులు, వాటి డ్రైవర్ల పరిధిపై మరింత సమాచారం మాకు అందుతుంది..’ అని ఆయన వివరించారు. జీపీఎస్ పరికరాలను అమర్చడం, వాటి నిర్వహణను చేపడుతున్న డీఐఎంటీఎస్‌తో పలు విషయాలపై డీటీసీ చర్చలు జరిపింద ని ఆయన తె లిపారు. ‘సరైన సమాచారం ఇవ్వగలిగితేనే మేం నిబంధనలను ఉల్లంఘిస్తున్న డ్రైవర్లపై తగిన చర్యలు తీసుకోగలం..’ అని అన్నారు. బస్సు వేగం, సమయం, స్థలం ఉల్లంఘనలపై సరైన సమాచారం కావాలని కోరామన్నారు. బస్సు క్యూ షెల్టర్ల వద్ద బస్సులు ఆగుతున్నాయా..లేదా.. వాటికి కేటాయించిన రూట్లలో వెళుతున్నాయా..లేదా అనే విషయాలపై స్పష్టమైన సమాచారం ఇచ్చేలా జీపీఎస్‌లను ఏర్పాటు చేయాలని సంబంధిత సంస్థను కోరినట్లు ఆ అధికారి తెలిపారు. బస్సుల్లో జీపీఎస్ ఏర్పాటుతో మరిన్ని సమస్యలను గుర్తిం చేందుకు అవకాశముంటుందన్నారు. నివేదికలు లేకుండా నిబంధనల ఉల్లంఘనలను గుర్తించడం కష్టమని అధికారులు అంటున్నారు. ఇదిలా ఉండగా ఢిల్లీ ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ బస్సుల్లో 2010లోనే జీపీఎస్ ప్రాజెక్టును ప్రారంభించారు.
మొదటినుంచి నివేదిక తయారీనే ఒక సమస్యగా మారిందన్నారు. డీటీసీ నిబంధనల ప్రకారం బస్సు వేగం 40 కేఎంపీహెచ్ మించకుండా స్పీడ్ నియంత్రణ పరికరాలను అమర్చాలి. అయితే డీటీసీ బస్సుల ప్రమాదాల్లో ఎక్కువ శాతం మితిమీరిన వేగం వల్లే జరుగుతున్నాయని జీపీఎస్ నివేదికలు స్పష్టం చేశాయి. దీన్నిబట్టి చూస్తే బస్సుల్లో వేగ నియంత్రణ పరికరాలను మార్చివేసినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది మార్చిలో డిపోల్లో ఉంచిన కొన్ని డీటీఎస్ బస్సుల నుంచి జీపీఎస్ పరికరాల నివేదికలను దొంగిలించిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement