ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోకి శివసేన చేరడం ఖాయమని తెలియడంతో..
సాక్షి, ముంబై: ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వంలోకి శివసేన చేరడం ఖాయమని తెలియడంతో మంత్రి పదవులు ఆశిస్తున్న ఆ పార్టీ నేతలంతా బాంద్రాలోని మాతోశ్రీ బంగ్లాకు పెద్ద సంఖ్యలో తరలిరావడం మొదలైంది. రాష్ట్ర నలుమూల నుంచి ఎమ్మెల్యేలందరూ తమ మద్దతుదార్లను వెంటబెట్టుకుని మాతోశ్రీకి వస్తున్నారు. బుధవారం ఉదయం, పగలు, రాత్రి ఇలా అడ్డుఅదుపు లేకుండా మాతోశ్రీకి ఎమ్మెల్యేలు తమ అనుచరగణాలతో తరలిరావడంతో ఉద్ధవ్ ఠాక్రేకు కంటిమీద కునుకు లేకుండా పోయింది.
గురువారం కూడా ఇదే తంతు కొనసాగింది. చివరకు ఈ రాకపోకలలో విసుగెత్తిన ఉద్ధవ్ బంగ్లా బయట ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు. అక్కడ విధులు నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి తన అనుమతి లేనిదే లోపలికి ఎవరినీ అనుమతించకూడదని ఆదేశించారు. దీంతో భద్రతా సిబ్బంది లోపలికి ఎవరిని అనుమతించకపోవడంతో ఎమ్మెల్యేలు వారితో వాగ్వాదానికి దిగుతున్నారు. అనేక మంది ఎమ్మెల్యేలు తమ వాహనాలను బంగ్లాకు దూరంగా పార్కింగ్‌చేసి ఉద్ధవ్ పిలుపుకోసం గేటువద్ద వడిగాపులు కాయాల్సిన దుస్థితి ఏర్పడింది. రోడ్డుపై వారి మద్దతుదారులు పెద్ద సంఖ్యలో గుమిగూడడంతో ట్రాఫిక్ జాం సమస్య తలెత్తింది. దీంతో ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించాలంటే తలప్రాణం తోకకు వస్తోంది. ఏం చేయాలో తెలియక పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. ఒక పక్క ప్రజాప్రతినిధుల వాహనాలు, మరోపక్క వారి అనుయాయులు ఇలా రోజంతా రోడ్డుపై నిలబడడంతో పోలీసులు వారిని ఏమీ అనలేకపోతున్నారు.
కేవలం నిర్ధేశించిన వ్యక్తులను మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. ఇదిలాఉండగా, శివసేన నాయకత్వం ఉప ముఖ్యమంత్రి, హోం శాఖ లాంటి కీలక పదవులు రాబట్టుకోవడంలో విఫలం కావడంతో కార్యకర్తలు ఇప్పటికే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు తమ నియోజక వర్గం ఎమ్మెల్యేలను మాతోశ్రీ బంగ్లాలోకి అనుమతించకపోవడంతో వారు మరింత అసహనానికి గురవుతున్నారు. అసెంబ్లీ హాలు ప్రాంగణంలో శుక్రవారం శివసేన, బీజేపీ ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేయడం ఖాయమని తేలిపోయింది. దీంతో పైరవీలు చేయడానికి గురువారం ఆఖరు రోజు కావడంతో సాధ్యమైనంత త్వరగా ఉద్ధవ్‌తో భేటీ కావాలని ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు ఉద్ధవ్‌తో సత్సంబంధాలున్న నాయకులు, సన్నిహితులతో మంతనాలు జరుపుతున్నారు.