బెదిరించి నీచుడి అత్యాచారం..
బ్లాక్‌మెయిల్ చేసి మరొకడి లైంగికదాడి
కారేపల్లి: ఎవరికైనా చెబితే నీ భర్తను చంపుతానని బెదిరించి ఓ కీచకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడు. అంతటితో ఊరుకోకుండా ఈ విషయాన్ని తన స్నేహితుడికి చెప్పాడు. అతడు కూడా అదే తరహాలో బెదిరించడంతో పాటు బ్లాక్ మెయిల్ చేసి లైంగికదాడికి పాల్పడ్డాడు. దీంతో ఆమె విషయాన్ని భర్తకు చెప్పింది. ఈ మేరకు బాధితులు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖమ్మం జిల్లా కారేపల్లి మండల పరిధిలోని చీమలపాడులో సంచారజాతికి చెందిన ఓ మహిళ భర్తతో కలిసి బతుకుదెరువుకు 4 నెలల క్రితం మహారాష్ట్రకు వెళ్లింది. ఏన్కూర్ మండలం రాజలింగాలకు చెందిన వీరి బంధువు నెరసుల నరేశ్ అక్కడే స్థిరపడి ఉన్నాడు.
కాగా, నరేశ్ భర్త లేని సమయంలో ఆ మహిళపై అత్యాచారం చేశాడు. ఎవరికై నా చెప్పితే.. నిన్ను, నీ భర్తను చంపుతానని బెదిరించడంతో ఎవరికీ చెప్పలేదు. నెల తర్వాత భర్తతో కలిసి స్వగ్రామానికి చేరుకుంది. భర్తకూలీ పనులు చేస్తుండగా, భార్య మేకలు కాస్తోంది. ఈ క్రమంలోనే నరేశ్.. వరుసకు సోదరుడయ్యే ముదిగొండకు చెందిన నెరసుల బాబుకు జరిగిన విషయాన్ని చెప్పాడు. 4 రోజుల క్రితం చీమలపాడుకు వచ్చిన బాబు మేకలు కాయడానికి అటవీ ప్రాంతానికి వెళ్లిన బాధితురాలిని అటకాయించాడు. ఆమెను బ్లాక్‌మెయిల్ చేసి అత్యాచారానికి పాల్పడ్డాడు. నరేశ్ తరహాలోనే మరోసారి బెదిరించాడు. ఇంటికి వచ్చిన ఆమె మహారాష్ట్రలో, ఇక్కడ జరిగిన విషయాన్ని భర్తకు చెప్పింది. దీంతో కులపెద్దలను ఆశ్రరుుంచారు. తర్వాత కారేపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు.