తమ లక్ష్యం కోటిన్నర సభ్యత్వం
బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్‌షా
సాక్షి, ముంబై: మహారాష్ట్రలో ఒకటిన్నర కోట్ల మందికి పార్టీ సభ్యత్వం ఇవ్వాలన్నది తమ లక్ష్యమని బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా పేర్కొన్నారు. ముంబైలో ఒక రోజు పర్యటనపై వచ్చిన ఆయన శుక్రవారం బీజేపీ నాయకులతో వివిధ అంశాలపై చర్చలు జరిపారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం సక్రమంగా జరిగేలా చూడాలని నాయకులకు సూచించినట్లు చెప్పారు. కోటిన్నర మందిని పార్టీలో చేర్పించాలని వారికి ఆదేశించినట్లు పేర్కొన్నారు. దీంతోపాటు బీజేపీ మహారాష్ట్ర విభాగానికి ఎవరిని అధ్యక్షులుగా నియమించాలన్న దానిపై కూడా చర్చలు జరిపినట్టు చెప్పారు. బీజేపీ జాతీయ అధ్యక్షుని హోదాలో ఉన్న అమిత్‌షా మోదీ ప్రభుత్వం వచ్చిన అనంతరం గత ఆరు నెలల్లో తీసుకున్న కీలక నిర్ణయాలను పార్టీ కార్యకర్తలకు వివరించారు.
ఎన్నికల సమయంలో హామి ఇచ్చినట్టుగానే ధరలను తగ్గించేందుకు కృషి చేస్తున్నామన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు పెట్రోల్, డిజిల్ ధరలు తొమ్మిది సార్లు తగ్గాయన్నారు. కేంద్ర ప్రభుత్వం దేశాభివృద్ధి కోసం చేపట్టిన ప్రణాళికలు, జన్‌ధన్ యోజన, స్వచ్ఛతా అభియాన్‌కు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందని చెప్పారు. మరో నాలుగేళ్లలో 2019 నాటికి ఇంటింటికి విద్యుత్ సరఫరా చేయనున్నట్టు ఆయన చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు గురించి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది సభ్యులను నమోదు చేయనున్నట్టు అమిత్ షా తెలిపారు.
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా రావ్‌సాహెబ్ దానవే..?
మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షులెవరనే విషయంపై మాత్రం ఇంకా సస్పెన్స్ వీడలేదు. ఈ విషయంపై అడిగిన ప్రశ్నలకు అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పకుండా దాటవేశారు. కేంద్ర మంత్రి రావ్‌సాహెబ్ దానవే పేరుకు అందరి నుంచి ఆమోదం లభించిందని అనధికార వర్గాల సమాచారం. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా దాదాపు ఆయన పేరు ఖరారు అయినట్టు వినికిడి.