
చిన్నమ్మ వారసుడొచ్చాడు
చెన్నై: జయలలితకు తామే అసలైన వారసులమని శశికళ, పన్నీరు సెల్వం, దీపా జయకుమార్ పోటీపడుతున్నారు. ఓ వైపు అమ్మ వారసత్వ పోరు కొనసాగుతుండగా.. పార్టీని ఆధీనంలోకి తీసుకోవడంతో పాటు తన విధేయుడు పళనిస్వామిని ముఖ్యమంత్రిని చేసిన చిన్నమ్మ తన వారసుడిని తెరపైకి తెచ్చారు. అన్నా డీఎంకే ఉప ప్రధాన కార్యదర్శిగా నియమితుడైన శశికళ సోదరి కుమారుడు దినకరన్ ఈ రోజు (గురువారం) బాధ్యతలు చేపట్టారు. పార్టీలో ప్రధాన కార్యదర్శి శశికళ తర్వాతి స్థానం, హోదా దినకరన్‌దే. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో శశికళ బెంగళూరు పరప్పణ అగ్రహార జైలులో శిక్ష అనుభవిస్తున్న నేపథ్యంలో దినకరన్ ఆమె తరఫున పార్టీలో చక్రం తిప్పనున్నారు. జైలుకు వెళ్లేముందు శశికళ.. దినకరన్‌ను పార్టీ ఉప ప్రధాన కార్యదర్శిగా నియమించారు.
బాధ్యతలు చేపట్టిన అనంతరం దినకరన్ మాట్లాడుతూ.. జయలలిత తనను పార్టీలోకి ఆహ్వానించారని, కీలక పదవులు కట్టబెట్టారని, అమ్మ వల్ల తాను గతంలో ఎంపీ కూడా అయ్యానని చెప్పారు. ఇటీవల పార్టీని వీడిన మాజీ ముఖ్యమంత్రి పన్నీరు సెల్వం వెంట వెళ్లిన ఎమ్మెల్యేలు, ఎంపీలు పార్టీలోకి తిరిగి వస్తే ఆహ్వానిస్తామన్నారు. అమ్మ ఆశయాలను, పాలనను కొనసాగిస్తామని చెప్పారు. తమిళనాడు ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తామన్నారు.