అసెంబ్లీలో డీఎండీకే ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై విచారణ వేగవంతమైంది. ఏడుగురు డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌కు వివరణ ఇచ్చుకున్నారు.
అసెంబ్లీలో డీఎండీకే ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరుపై విచారణ వేగవంతమైంది. ఏడుగురు డీఎండీకే ఎమ్మెల్యేలు అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్‌కు వివరణ ఇచ్చుకున్నారు. కాగా, ఇద్దరు ఎమ్మెల్యేలపై పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైన దృష్ట్యా, ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ లభించింది.
సాక్షి, చెన్నై: అసెంబ్లీ వేదికగా డీఎండీకే ఎమ్మెల్యేలు, అధికార పక్షం సభ్యులు గత వారం ఢీ కొట్టిన విషయం తెలిసిందే. ఈ వివాదాన్ని స్పీకర్ ధనపాల్ తీవ్రంగా పరిగణించారు. ఈ సమావేశాలకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అలాగే, ఈ వ్యవహారాన్ని అసెంబ్లీ క్రమ శిక్షణా సంఘానికి సిఫారసు చేశారు. డెప్యూటీ స్పీకర్ పొల్లాచ్చి వీ.జయరామన్ ఆధ్వర్యంలో క్రమశిక్షణా సంఘం విచారణ ఆరంభించింది. వివాదం చోటుచేసుకున్న రోజున అసెంబ్లీలో జరిగిన ఘటనల వీడియో క్లిప్పింగ్‌లను పరిశీలించారు. డీఎండీకే విప్ చంద్రకుమార్, ఎమ్మెల్యేలు మోహన్‌రాజ్, దినకరన్, సీహెచ్.శేఖర్, పార్థిబన్, వెంకటేషన్‌తో పాటుగా మరో ఎమ్మెల్యేకు నోటీసులు జారీ చేశారు.
అసెంబ్లీలో వివాదం, మార్షల్‌పై దాడికి సంబంధించి వివరణ ఇవ్వాలని ఆ నోటీసు ద్వారా ఆదేశించారు. దీంతో ఆ ఎమ్మెల్యేలు శుక్రవారం అసెంబ్లీ కార్యదర్శి జమాలుద్దీన్ ఎదుట హాజరయ్యారు. తొలుత వేర్వేరుగా తమ వివరణల్ని ఇచ్చుకున్నారు. అనంతరం ఆ ఎమ్మెల్యేలందరూ కలసి తమ వాదనను జమాలుద్దీన్ ముందు ఉంచారు. వారి వాదనల్ని విన్న జమాలుద్దీన్ క్రమ శిక్షణా సంఘానికి పంపించారు. ఆ సంఘం తీసుకునే నిర్ణయం మేరకు తదుపరి క్రమ శిక్షణ వేటు డీఎండీకే ఎమ్మెల్యేలపై పడేనా లేదా, క్షమించేనా..? అన్నది వేచి చూడాల్సిందే.
ఇద్దరికి బెయిల్
మార్షల్‌పై దాడి వ్యవహారంలో డీఎండీకే ఎమ్మెల్యే మోహన్ రాజులపై ఎలాంటి కేసుల్లేవు అని ప్రభుత్వం కోర్టులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్‌ను న్యాయ స్థానం తోసి పుచ్చింది. మోహన్ రాజులుపై కేసుల్లేనప్పుడు తమ మీద కూడా ఉండదన్న ధీమా మరో ఇద్దరు ఎమ్మెల్యే శేఖర్, దినకరన్‌లలో నెలకొన్నాయి. ఈ ఇద్దరిపై మాత్రమే సచివాలయం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైనట్టు తేలింది. అరెస్టుల నుంచి తప్పించుకునేందుకు ఆ ఇద్దరూ కోర్టును ఆశ్రయించారు. ఫిర్యాదులు నమోదైన దృష్ట్యా, ఆ ఇద్దరికి ముందస్తు బెయిల్ లభించినట్టు అయింది.