డీఎండీకే అధినేత విజయకాంత్ వెయ్యి మంది పేదలకు రూ.పది వేలు చొప్పున రూ.కోటి విలువ గల వస్తువులను శనివారం పంపిణీ చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తన జన్మదిన వేడుకను
సాక్షి, చెన్నై : డీఎండీకే అధినేత విజయకాంత్ వెయ్యి మంది పేదలకు రూ.పది వేలు చొప్పున రూ.కోటి విలువ గల వస్తువులను శనివారం పంపిణీ చేశారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా తన జన్మదిన వేడుకను గత కొన్నేళ్లుగా జరుపుకుంటూ వస్తుంటే, ప్రజాకర్షణ లక్ష్యంగా అధికార పక్షం పథకాలను హామీలకే పరిమితం చేస్తున్నదని మండిపడ్డారు. సినీ నటుడిగా ఉన్న సమయంలోనూ, రాజకీయ పార్టీ అధినేతగా అవతరించినప్పుడూ తన పుట్టినరోజును పేదరిక నిర్మూలన దినోత్సవం పేరుతో విజయకాంత్ జరుపుకుంటూ వస్తున్నారు. ఆగస్టు 25న 62వ వసంతంలోకి ఆయన అడుగు పెట్టనున్నారు. ఇందులో భాగంగా శనివారం కోయంబేడులోని డీఎండీకే పార్టీ కార్యాలయం ఆవరణలో ఈ వస్తువుల పంపిణీ కార్యక్రమం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా వెయ్యి మంది పేదలిను ఎంపిక చేసి, తలా పది వేలు చొప్పున కోటి రూపాయలు విలువగల వస్తువులను విజయకాంత్ పంపిణీ చేశారు. ఎంజీయార్ బధిర పాఠశాలకు రూ.50 వేలు విరాళంగా అందజేశారు. ఈ వేడుకలో విజయకాంత్ సతీమణి ప్రేమలత, యువజన నేత ఎల్‌కే సుదీష్, పార్టీ నాయకులు పార్థసారథి, సివి చంద్రకుమార్, ఇళంగోవన్, యువరాజ, రాజన్, సెంతామరై కన్నన్, కామరాజ్, పార్టీ ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ వేడుక అనంతరం విజయకాంత్ ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.
ప్రజాధనం దుర్వినియోగం
తన జన్మదినం రోజున పేదలకు ఇతోధికంగా సాయం అందించే లక్ష్యంతోనే వేడుకలు జరుపుకుంటూ వస్తున్నానని విజయకాంత్ గుర్తు చేశారు. అయితే, అధికార పక్షం కేవలం ప్రజాకర్షణే లక్ష్యంగా పథకాలను ప్రకటించి, అమల్లో విఫలమవుతోందని ఆరోపించారు. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారేగానీ, సంక్షేమ పథకాలు నిజమైన లబ్ధిదారులకు చేరలేదని ధ్వజమెత్తారు. ప్రజాధనం దుర్వినియోగమైనట్లు కాగ్ స్పష్టం చేస్తోందని ఆరోపించారు. ప్రజల్ని ఆకర్షించే విధంగా సరికొత్త నినాదాన్ని అందుకుని పథకాలను ప్రకటిస్తున్నారని, ఇవన్నీ అమలయ్యేది అనుమానమేనన్నారు. ఎన్నికల హామీలనే సక్రమంగా అమలు చేయకుండా, చేసినట్టుగా జిమ్మిక్కులు చేయడం విడ్డూరంగా ఉందని మండి పడ్డారు. ఈ ప్రభుత్వ విధానాలతో ప్రజలు అష్టకష్టాలకు గురవుతున్నారని పేర్కొన్నారు. హత్యలు, దోపిడీల పర్వంతో రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.