డీఎంకేలోకి యువరాజ్
సాక్షి, చెన్నై: తమ దారికి డీఎండీకే అధినేత విజయకాంత్ రాని దృష్ట్యా, ఇక ఆపరేషన్ ఆకర్ష్‌తో ఆ పార్టీ వర్గాల్ని తమ వైపునకు తిప్పుకునే పనిలో డీఎంకే సిద్ధమైంది. ఇందుకు తగ్గ వ్యూహల అమలులో డీఎంకే దళపతి ఎంకే స్టాలిన్ నిమగ్నమయ్యారు. ఉత్తర చెన్నై జిల్లా పార్టీ కార్యదర్శి యువరాజ్, సేలం యూనియన్ నేత షణ్ముగం తమ బుట్టలో పడడంతో, ఇక వారి ద్వారా పావుల్ని కదిపే పనిలో పడ్డారు. డీఎండీకే అధినేత విజయకాంత్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే ప్రయత్నిం చిన విషయం తెలిసిందే. అ యితే, ఆయన దూరం కావడంతో ఇక, ఆ పార్టీ కేడర్‌ను తమ వైపునకు తిప్పుకునేందుకు డీఎంకే సిద్ధమైంది.
విజయకాంత్‌ను సీఎం అభ్యర్థిగా ప్రజా కూటమి ప్రకటించినా, ఆయన నిర్ణయాన్ని తప్పుబట్టే వాళ్లే ఆ పార్టీలో ఎక్కువ. డీఎంకేతో కలసి నడుద్దామని విజయకాంత్ మీద మెజారిటీ శాతం జిల్లాల కార్యదర్శులు ఒత్తిడి కూడా తె చ్చారు. అయితే, తమ అభిప్రాయాల్ని విజ యకాంత్ ఖాతరు చేయకపోవడంతో వారం తా తీవ్ర అసంతృప్తితో ఉన్నారని చెప్పవచ్చు. వీరందర్నీ గురి పెట్టి, ప్రస్తుతం ఆపరేషన్ ఆకర్ష్‌కు డీఎంకే దళపతి స్టాలిన్ సిద్ధమయ్యారు. ఇందులో భాగంగా ఉత్తర చెన్నై జిల్లా డీఎండీ కే కార్యదర్శి, విజయకాంత్ సన్నిహితుడు యువరాజ్‌ను తమ వైపునకు తిప్పుకోవడంలో సఫలీకృతులయ్యారు.
బుధవారం గోపాలపురంలో అడుగు పెట్టిన యువరాజ్ అధినేత కరుణానిధి సమక్షంలో డీఎంకే తీర్థం పుచ్చుకున్నారు. అలాగే, సేలం యూనియన్ నేత షణ్ముగం నేతృత్వంలో వందకు పైగా ఆ జిల్లాలోని నాయకులు డీఎంకేలోకి చేరడం గమనార్హం. డీఎంకేలో తమ కోసం తలుపులు తెరవడంతో లోనికి అడుగులు పెట్టేందుకు పెద్ద సంఖ్యలో డీఎండీకే జిల్లాల కార్యదర్శులు ఉరకలు తీయడానికి సిద్ధమవుతున్నారని యువరాజ్ ప్రకటించారు. తన లాంటి వారెందరో డీఎంకేతో కలసి అడుగులు వేద్దామని సూచించినా, తమకు విలువ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
జయలలిత పతనం లక్ష్యం అంటున్న విజయకాంత్, అందుకు తగ్గ నిర్ణయం తీసుకోకుండా పెద్ద తప్పు చేశారని , ఈ ఎన్నికల ద్వారా ఆయనకు తీవ్ర కష్టాలు, నష్టాలు తప్పదని హెచ్చరించడం గమనార్హం. కాగా, విజయకాంత్‌ను నమ్ముకుని పార్టీ కోసం కోట్లు ఖర్చు పెట్టినా, తమకు ఇంత వరకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఇక్కడే ఉండి ఉన్నది రాల్చుకోవడం కన్నా, డిఎంకే తీర్థం పుచ్చుకుని భవిష్యత్తులో ఏదో ఒక పదవినైనా దక్కించుకోవచ్చన్న ఆశాభావంతో జంప్ జిలానీకి జిల్లాల కార్యదర్శులు సిద్ధం అవుతుండడం గమనార్హం. ఇక, ఈ వలసల్ని అడ్డుకునేందుకు విజయకాంత్ తీవ్ర కసరత్తులు చేపట్టాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.
యువరాజ్ బయటకు వెళ్లడంతో తక్షణం ఆ పదవిని ఎగ్మూర్ ఎమ్మెల్యే నల్ల తంబి ద్వారా బర్తీ చేశారు. బరిలోకి ఎస్‌ఎస్‌పీ: రిటైర్డ్ ఐఎఎస్ అధికారిని శివగామి నేతృత్వంలోని సమూహ సమత్తువ మక్కల్ పడై ఉదయ సూర్యుడి చిహ్నంతో ఎన్నికల బరిలో దిగనుంది. ఈ మేరకు కరుణానిధితో శివగామి భేటీ అయ్యారు. ఒక్క సీటును అప్పగించడంతో డీఎంకే చిహ్నం మీదే పోటీకి శివగామి నిర్ణయించారు. మద్య నిషేధం అమలు లక్ష్యంగా డీఎంకే నిర్ణయం తీసుకోవడంతో ఆ పార్టీతో కలసి ఎన్నికల్ని ఎదుర్కొనేందుకు సిద్ధమైనట్టు పేర్కొన్నారు.