
ఆరోగ్యంగా కరుణ
► నేతల పరామర్శలు
► రాహుల్ కూడా
► స్టాలిన్ ఇంట్లో రాహుల్, కరుణానిధి ఇంటివద్ద సీతారాం ఏచూరి, డి.రాజా
డీఎంకే అధినేత ఎం కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని, సంపూర్ణ ఆరోగ్య వంతుడిగా త్వరలో కేడర్ ముందుకు వస్తారని వివిధ పార్టీల నేతలు వ్యాఖ్యానించారు. గోపాలపురం ఇంట్లో కరుణానిధిని రాహుల్, సీతారాం ఏచూరి, సుధాకర్‌రెడ్డి, డి.రాజా వేర్వేరుగా ఆదివారం పరామర్శించారు.
సాక్షి, చెన్నై : డీఎంకే అధినేత ఎం.కరుణానిధి ఆరోగ్య సమస్యలు, వయోభారంతో కొంతకాలంగా గోపాలపురం ఇంటికే పరిమితమయ్యారు. 94వ జన్మదిన వేడుక, రాజకీయ వజ్రోత్సవ వేడుకకు ఆయన హాజరవుతారని కేడర్ ఎదురు చూశారు. అయితే, వైద్యుల సూచన మేరకు ఆయన దూరం కాక తప్పలేదు. శనివారం రాత్రి చెన్నై వేదికగా జరిగిన వజ్రోత్సవ వేడుక జాతీయ స్థాయిలో ప్రతి పక్షాలన్నీ ఏకం చేయడానికి ఒక వేదికగా మారిందన్న ప్రచారం ఊపందుకుంది.
ఇక, డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ జాతీయ రాజకీయాల్లో తమ అధినేత కరుణానిధి తరహాలో చక్రం తిప్పేం దుకు సిద్ధం అయ్యారన్న విషయం ఈ వేదిక మీద స్పష్టమైంది. ఈ వేడుకకు హాజరైన నేతలు కరుణానిధిని పరామర్శించేందుకు నిర్ణయించారు. దీంతో ఆయా నేతలు ఆదివారం ఉదయం గోపాలపురానికి చేరుకున్నారు. వీరికి డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్, ఎంపీ కనిమొళి ఆహ్వానం పలికారు. ముందుగా కరుణానిధిని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ పరామర్శించారు. ఈ సమయంలో రాహుల్ చేతిని తన చేతిలోకి తీసుకుని కరుణానిధి ఆప్యాయంగా పలకరించడం విశేషం.ఆరో గ్య పరిస్థితుల గురించి వైద్యుల్ని అడిగి తెలుసుకున్నారు. స్టాలిన్‌తో ముచ్చటించారు. ఈసందర్భంగా మీడియాతో మాట్లాడుతూ కరుణానిధి ఆరో గ్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు.
సంపూర్ణ ఆర్యోగంతో అందరి ముం దుకు ఆయన త్వరలో తప్పకుండా వస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇక, రాజకీయాల గురించి ప్రస్తావిస్తూ, కశ్మీర్ అల్లర్లను కేంద్రం రాజకీయం చేస్తున్నదని, రాజకీయ ఆదాయం లక్ష్యంగా వ్యవహరిస్తున్నదని మండిపడ్డారు. ఈ సమస్యను పరిష్కరించడంలో విఫలం అయ్యారని విమర్శించారు. తదుపరి కరుణానిధిని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయకార్యదర్శి సుధాకర్‌రెడ్డి, ఎంపీ డి రాజా వేర్వేరుగా పరామర్శించారు. ఈసందర్భంగా సీతారాం ఏచూరి మీడియాతో మాట్లాడుతూ కరుణానిధి ఆరోగ్యంగా ఉన్నారని వ్యాఖ్యానించారు. రాష్ట్రపతి అభ్యర్థి విషయంగా సంధించిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ, ప్రతి పక్షాలన్నీ ఏకం అయ్యాయని గుర్తు చేశారు. 17 పార్టీలు ఇటీవల సమావేశమైనట్టు, అందరికీ ఆమోద యోగ్యమైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉందన్నారు.