
సీబీఐ విచారణకు పట్టు
సాక్షి, చెన్నై : మౌళి వాకంలో నిర్మాణంలో ఉన్న బహుళ అంతస్తుల భవనం ఇటీవల కుప్పకూలిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఉత్తరాంధ్రకు చెందిన వారితో పాటు తమిళనాడు, ఒడిశ్సాలకు చెందిన 61 మంది విగత జీవులయ్యారు. దక్షిణ భారతాన్ని కుదిపేసిన ఈ ఘటనపై విచారణకు ప్రత్యేక సిట్‌ను రాష్ట్ర ప్రభుత్వం రంగంలోకి దించింది. రిటైర్డ్ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో కమిటీని వేశారు. ఓ వైపు సిట్, మరో వైపు రఘుపతి కమిషన్‌లు తమ విచారణను వేగవంతం చేశాయి. ఈ విచారణలను కంటి తుడుపు చర్యేనని, వాస్తవాలు వెలుగులోకి రావాలంటే సీబీఐతో విచారణ చేపట్టాల్సిందేనని ప్రతి పక్షాలు పట్టుబడుతూ వస్తున్నాయి.
ఈ విషయమై డీఎంకే నేతృత్వంలో రాజ్ భనవ్‌కు భారీ ర్యాలీ చేపట్టారు. మద్రాసు హైకోర్టులో సామాజిక కార్యకర్త ట్రాఫిక్ రామస్వామి తదితరులు పిటిషన్లు వేశారు. ఈ పరిస్థితుల్లో డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ శనివారం మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేశారు. రఘుపతి కమిటీని రద్దు చేయాలని, సీబీఐతో విచారణ చేపట్టాలని విన్నవించారు. పిటిషన్ : మౌళివాకం ఘటనను తన పిటిషన్‌లో స్టాలిన్ వివరించారు. ఈ ఘటనపై విచారణ న్యాయబద్ధంగా జరగాల్సి ఉందని సూచించారు. కంటి తడుపు చర్యగా, మొక్కుబడిగా విచారణ సాగుతున్నట్టు అనుమానాలు కలుగుతున్నాయని పేర్కొన్నారు. రిటైర్డ్ న్యాయమూర్తి రఘుపతి నేతృత్వంలో ప్రత్యేక కమిటీ వేశారని వివరించారు.
రఘుపతి ఇప్పటికే పలు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్నారని గుర్తుచేశారు. కొత్త సచివాలయ నిర్మాణ కేసు విచారణ గుండా చట్టం నమోదు పరిశీలన కమిటీ, వినియోగదారుల ఫోరంకు ఆయన బాధ్యతలు నిర్వర్తిస్తున్నారని పేర్కొన్నారు. మూడు బాధ్యతల్ని నిర్వర్తిస్తున్న వ్యక్తికి అదనంగా అతి పెద్ద ఘటనకు సంబంధించిన విచారణ బాధ్యతలు అప్పగించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఆయన ఎలా తన బాధ్యతల్ని పూర్తి స్థాయిలో చేపట్ట గలరని, మౌళి వాకం ఘటన విచారణకు ఎలా..? న్యాయం చేయగలరని తన పిటిషన్‌లో పేర్కొన్నారు. ఆ కమిటీని రద్దుచేసి, ఈ ఘటనపై సమగ్ర విచారణను సీబీఐకు అప్పగించే విధంగా ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. కేసును ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రత్యేక కమిటీ, పోలీసు బృందంతో విచారణ చేపట్టించాలని విజ్ఞప్తి చేశారు. లేని పక్షంలో వాస్తవాలు వెలుగులోకివచ్చే అవకాశంలేదని ఆందోళన వ్యక్తం చేశారు.