కరుణకు కేంద్రం ఝలక్
సాక్షి ప్రతినిధి, చెన్నై : కాంగ్రెస్‌తో భాయ్ భాయ్‌గా మెలుగుతున్న డీఎంకే అధినేత కరుణానిధికి కేంద్రప్రభుత్వం ఝలక్ ఇచ్చింది. అసెంబ్లీలో ఇదివరకు ప్రతిపక్ష నేతగా ఉన్న ఆయనకు బ్లాక్ కమెండోస్ భద్రతను ఉపసంహరించుకుంది. దేశంలోని అత్యంత ప్రముఖ నేతలకు కేంద్ర ప్రభుత్వం బ్లాక్ కమెండోస్ భదత్రను కల్పించడం అనవాయితీగా వస్తోంది. ఇలాంటి భద్రతా చర్యల్లో నాలుగు కేటగిరిలు ఉన్నాయి. జెడ్ ప్లస్, జెడ్, వై, ఎక్స్ పేర్లతో నేతలకు భద్రత కల్పిస్తున్నారు.
ప్రధాని, మాజీ ప్రధానులకు, వారి కుటుంబ సభ్యులకు జెడ్ ప్లస్ భద్రతను కల్పిస్తారు. ఇతరులకు అప్పటి పరిస్థితులను బట్టి జెడ్ ప్లస్ కేటాయిస్తారు. ప్రస్తుతం దేశంలో మాజీ ఉప ప్రధాని ఎల్‌కే అద్వానీ వారి కుటుంబసభ్యులకు మరి కొంతమందితో కలుపుకుని మొత్తం 15 మంది నేతలకు బ్లాక్ కమెండోస్‌తో కూడిన జెడ్ ప్లస్ భద్రతను కల్పించారు. డీఎంకే అధ్యక్షులుగా, ముఖ్యమంత్రిగా కరుణానిధికి బ్లాక్ కమెండోస్ భద్రత కల్పించారు. ఆ తరువాత ప్రధాన ప్రతిపక్ష నేతగా ఈ భద్రతా కొనసాగుతోంది. కాగా, దేశంలోని పలువురు నేతలకు జెడ్‌ప్లస్ భద్రతను ఉపసంహరిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకోగా ఆ జాబితాలో డీఎంకే అధినేత, మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి పేరు చోటుచేసుకుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకే అధికారాన్ని చేజిక్కించుకోగా మిత్రపక్ష డీఎండీకేకు డీఎంకే కంటే ఎక్కువ సీట్లు రావడంతో విజయకాంత్ ప్రతిపక్ష నేతగా మారారు.
అయితే గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేకు ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కింది. అయితే డీఎంకే ఆరంభం నుండి అసెంబ్లీలో అధికార పక్షం లేదా ప్రతిపక్ష హోదాను అందుకున్న కరుణానిధి ఈసారి ఆ హోదా నుండి తప్పుకున్నారు. వృద్ధ్దాప్యం లేదా భావివారసుడు అనే కారణంతో స్టాలిన్‌కు ప్రతిపక్షనేత హోదాను కరుణ కట్టబెట్టారు. అసెంబ్లీకి వచ్చినా రాకున్నా ఇటీవలి వరకు కరుణానిధినే ప్రతిపక్ష నేతగా చలామణి కాగా స్టాలిన్ ప్రవేశంతో బ్లాక్ కమెండోస్ భద్రత కూడా చేజారిపోయింది. రాష్ట్రంలోనే సీనియర్ నేతైన కరుణానిధికి బ్లాక్ కమెండోస్ భద్రతను ఉపసంహరించడం వెనుక రాజకీయం ఉందేమోనని కాంగ్రెస్, డీఎంకేలు కారణాలు వెతుకుతున్నాయి.
అసెంబ్లీలో సీటేదీ : సీఎంను ప్రశ్నించిన కరుణ
అసెంబ్లీ హాజరయ్యేందుకు అనువుగా అక్కడ సీటేదని డీఎంకే అధ్యక్షులు కరుణానిధి ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. అన్నాడీఎంకే పాలన, కచ్చదీవుల అప్పగింత, స్వాధీనం తదితర అంశాలపై ఇటీవల జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో వాడివేడిగా చర్చ సాగింది. ప్రతిపక్ష నేతగా స్టాలిన్ సహా తదితర డీఎంకే సభ్యులు అధికార పార్టీ విమర్శలను సాధ్యమైన మేరకు అడ్డుకున్నారు.
అదే సమయంలో కరుణానిధి అనేక పత్రికా ప్రకటనలతో జయలలితను నిలదీశారు. ఇందుకు తీవ్రంగా స్పందించిన జయలలిత...బైట నుంచి ప్రకటనలు గుప్పించడం కాదు, అసెంబ్లీలో మాట్లాడాలని సీఎం సవాలు విసిరారు. జయ సవాల్‌కు స్పందించిన కరుణానిధి, చక్రాల కుర్చీతో లోనికి వచ్చేందుకు అసెంబ్లీలో వసతి ఏదీ అని ఆమెను ప్రశ్నించారు. ప్రతిపక్ష నేత కాదన్న కారణంగా వెనుక వరుసలో సీటు కేటాయించడం ద్వారా అసెంబ్లీకి రాకుండా చేశారని ఆయన విమర్శించారు.