‘ఏమో గుర్రం ఎగురావచ్చు’
Published Thu, Jan 16 2014 11:46 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి: కాంగ్రెస్‌తో డీఎంకే కటీఫ్ చెప్పిన తరువాత పొత్తుపై అయోమయం ఏర్పడింది. రానున్న లోక్‌సభ ఎన్నికలు పూర్తిగా జాతీయపరమైనవి కాబట్టి ఏదో ఒక జాతీయ పార్టీతో పొత్తుపెట్టుకుంటేనే ప్రాంతీయ పార్టీలకు మనుగడ. కాంగ్రెస్ వెంట తొమ్మిదేళ్లపాటూ కలిసి నడిచిన డీఎంకే, పైకి శ్రీలంక వివాదం లోపల కనిమొళిపై 2జీ కేసు కారణాలతో గత ఏడాది వెనక్కుతగ్గింది. అలాగని పూర్తిగా దూరమైపోకుండా రాజ్యసభ ఎన్నికల్లో కనిమొళి గెలుపునకు కాంగ్రెస్ ఓట్లు కోరి పుచ్చుకుంది. కేంద్ర మంత్రి వర్గం నుంచి డీఎంకే వైదొలగడం మినహా కాంగ్రెస్, డీఎంకే దోస్తీ కొనసాగుతూనే ఉంది. ఇంతలో లోక్‌సభ ఎన్నికలు ముంచుకురాగా డీఎంకే గెలుపుకోసం ఇతర పార్టీలతో పొత్తు అనివార్యం అయింది. డీఎంకేలో నెంబర్ 2గా ఉన్న స్టాలిన్ కాంగ్రెస్‌తో పొత్తుకు ససేమిరా అంటున్నారు. ఇటీవల జరిగిన పార్టీ సమావేశంలో సైతం ఈమేరకు తీర్మానం కూడా చేయించారు.
అయితే కాంగ్రెస్ ఓట్లతో రాజ్యసభ గట్టెక్కిన కరుణ కుమార్తె కనిమొళి పొత్తుకు సుముఖంగా ఉన్నారు. స్టాలిన్ అవునంటే కాదనడమే సూత్రంగా పెట్టుకున్న కరుణ పెద్దకుమారుడు అళగిరి సైతం కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాలంటూ తండ్రిపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీకి భావి సారథిగా భావిస్తున్న తనయుడు స్టాలిన్ కాంగ్రెస్‌తో వద్దని, తన గారాల ముద్దులపట్టి కనిమొళి పొత్తుకావాలని ఒత్తిడితేవడంతో కరుణ పరిస్థితి అడకత్తరలో పోకచెక్కలా మారింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ గులాంనబీ ఆజాద్‌ను కనిమొళి ఇటీవల తన తండ్రి వద్దకు తీసుకెళ్లారు. వారిద్దరి చర్చల్లో స్టాలిన్ లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారంటే కాంగ్రెస్ పట్ల కనిమొళి ఎంత ఉత్సుకత చూపుతున్నారో అర్థమవుతోంది. మర్యాదపూర్వకంగా మాత్రమే తన తండ్రిని ఆజాద్ కలుసుకున్నారని, అంతకు మించి విశేషమేమీ లేదని గురువారం ఒక ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో స్టాలిన్ వ్యాఖ్యానించారు. కాంగ్రెస్, బీజేపీలతో పొత్తుకు అవకాశమే లేదని, ఈ రెండుపార్టీలు లేని మూడో కూటమి ఏర్పడుతోందని చెప్పారు. డీఎంకేను మచ్చిక చేసుకునేందుకు తమిళనాడు కాంగ్రెస్ అధ్యక్షుడిని సైతం మార్చేందుకు అధిష్టానం సిద్ధపడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇటువంటి తరుణంలో డీఎంకే, కాంగ్రెస్‌లు కలిసిపోయే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.
Advertisement
Advertisement