‘సీఎం’ సీటు గోల!
సాక్షి, చెన్నై : కరుణానిధి రాజకీయ వారసత్వం కోసం అన్నదమ్ముళ్ల మధ్య నెలకొన్న వివాదం డీఎంకేను సంక్లిష్ట పరిస్థితుల్లోకి నెట్టింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, లోక్‌సభ ఎన్నికల్లో డిపాజిట్ల గల్లంతుకు దారి తీసింది. కోల్పోయిన వైభవాన్ని 2016 ఎన్నికల్లో మళ్లీ చేజిక్కించుకోవడం లక్ష్యంగా అధినేత కరుణానిధి తన వ్యూహాలకు పదును పెట్టారు. పార్టీలో ప్రక్షాళన పర్వానికి శ్రీకారం చుట్టారు. బలోపేతం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. ఈ పరిస్థితుల్లో స్టాలిన్ సీఎం అభ్యర్థిత్వ నినాదం తెర పైకి రావడం కరుణానిధిని ఇరకాటంలో పడేసింది.
సీఎం సీటు గోల : స్టాలిన్‌కు పగ్గాలు అప్పగించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో డీఎంకేలో వస్తోంది. అయితే, డీఎంకే నిర్వాహక కార్యదర్శి కల్యాణ సుందరం కొత్త పల్లవిని అందుకున్నారు. ఇది వరకు డెప్యూటీ సీఎంగా స్టాలిన్ పనిచేసిన దృష్ట్యా, 2016 ఎన్నికల్లో ఆయన పేరును సీఎం అభ్యర్థిత్వానికి ప్రకటించాలన్న ఆయన నినాదం డీఎంకేలో చర్చకు దారి తీసింది. మోడీని పీఎం అభ్యర్థిగా బీజేపీ ప్రకటించిన బాణిలో స్టాలిన్ నినాదం తెరపైకి తెచ్చిన కల్యాణ సుందరం చివరకు పదవిని పోగొట్టుకోవాల్సి వచ్చిం ది. ఆయన్ను పదవి నుంచి తొలగించడం వెనుక మరో కారణం సైతం ఉన్నట్టు డీఎంకేలో చర్చ సాగుతోంది. ఆయన రాసిన లేఖలో కరుణానిధి గారాల పట్టి కనిమొళికి వ్యతిరేకంగా కొన్ని వ్యాఖ్యలు ఉన్న ట్టు సమాచారం. తనకు లేఖ అందేలోపు, మీడియాకు అది లీక్ కావడం కరుణానిధికి ఆగ్రహాన్ని తెప్పించిం దట!. అందుకే ఆయన్ను పదవి నుంచి ఆగమేఘాల మీద తొలగించినట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నారుు.
సోషల్ మీడియాల్లో చర్చ : కల్యాణ సుందరం తెరపైకి తెచ్చిన నినాదం డీఎంకేలో పెద్ద చర్చకు దారి తీస్తోంది. ఆయన్ను పదవి నుంచి తొలగించినా, కొందరు నాయకులు, కార్యకర్తలు మాత్రం సోషల్ మీడియా ద్వారా స్టాలిన్ సీఎం అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతుండడం గమనార్హం. సీఎం అభ్యర్థిత్వ నినాదం కరుణానిధిని ఇరకాటంలో పడేస్తోంది. సోషల్ మీడియాల్లోను, పార్టీ పరంగానూ చర్చనీయాంశంగా మారిన ఈ నినాదానికి ఫుల్‌స్టాప్ పెట్టేందుకు కరుణానిధి రెడీ అవుతున్నారు. ఈ నినాదాన్ని అందుకునే వాళ్లపై కొరడా ఝుళిపించి, స్టాలిన్‌తోనే కళ్లెం వేయించేందుకు సిద్ధం అవుతున్నట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నాయి.
మెగా భయం: స్టాలిన్ అభ్యర్థిత్వ నినాదం మెగా కూటమి ఏర్పాటుకు ఎక్కడ భంగం కలిగిస్తుందోనన్న ఆందోళన కరుణానిధిలో నెలకొన్నట్టు సమాచారం. అసెంబ్లీ ఎన్నికల్లో మెగా కూటమి ఏర్పాటుకు కరుణానిధి వ్యూహ రచన చేసినట్టు తెలుస్తోంది. ఈ సమయంలో స్టాలిన్ సీఎం అభ్యర్థిత్వం కారణంగా కొన్ని పార్టీలు దోస్తీకి ముందుకు రావన్న భావనతో కరుణానిధి, ఎలాగైనా సరే ఈ నినాదానికి ఫుల్‌స్టాప్ పెట్టిం చడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు.