డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు కుట్ర
Published Sun, Aug 4 2013 5:44 AM | Last Updated on Fri, Sep 1 2017 9:38 PM
సాక్షి, చెన్నై: డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు తి రునల్వేలి వేదికగా వ్యూహ రచన జరిగినట్టు, ఇంటెలిజెన్స్ దృష్టికి ఈ కుట్ర సమాచారం చేరినట్టు ఓ మీడియాలో వచ్చిన కథనం ఆ పార్టీ వర్గాల్ని కలవరంలో పడేసింది. దీంతో తమకు భద్రత కల్పించాలంటూ డీజీపీ రామానుజంను ఆశ్రయించారు. అసెంబ్లీ ఎన్నికల ద్వారా విజయకాంత్ నేతృత్వంలోని డీఎండీకే సభ్యులు 29 మంది అసెంబ్లీకి ఎన్నికైన విషయం తెలిసిందే. అయితే, ఆ పార్టీలో ఏర్పడ్డ విభేదాల కారణంగా ఏడుగురు ఎమ్మెల్యేలు అన్నాడీఎంకే పక్షాన చేరారు. పార్టీకి రెబల్‌గా వీరు వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో డీఎండీకే ఎమ్మెల్యేల హత్యకు తిరునల్వేలి వేదికగా కుట్ర జరిగి ఉన్నట్టు ఇంటెలిజెన్స్‌కు సమాచారం అందింది.
ఆ జిల్లా ఇంటెలిజెన్స్ అధికారులకు అందిన సమాచారం మేరకు ఓ మీడియాలో కథనం సైతం వెలువడింది. దీంతో ఆ పార్టీ ఎమ్మెల్యేల్లో ఆందోళన బయలు దేరింది. అదే సమయంలో పార్టీ రెబల్ ఎమ్మెల్యే సురేష్‌కుమార్ వెళ్తున్న మోటార్‌సైకిల్‌ను తిరువణ్ణామలై కీల్ నాచ్చుపట్టు వద్ద ఓ వ్యాన్ ఢీకొట్టి వెళ్లి పోవడం అనుమానాలకు దారి తీసింది. దీంతో ఆ పార్టీ వర్గాల్లో ఆందోళన రెట్టింపు అయింది. దీంతో ఆపార్టీ నాయకుడు బాలాజీ నేతృత్వంలో పలువురు డీజీపీ కార్యాలయానికి శనివారం చేరుకున్నారు.
అక్కడి ఫిర్యాదుల విభాగంలో వినతిపత్రం సమర్పించారు. ఎమ్మెల్యేల హత్యకు కుట్ర జరిగినట్టు సమాచారం అందిందన్నారు. ప్రధానంగా చెంగల్పట్టు ఎమ్మెల్యే అనగై మురుగేషన్, తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్ సుబ్రహ్మణ్యం, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే శేఖర్‌లను టార్గెట్ చేసి కుట్ర జరిగి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తిరునల్వేలి వేదికగా ఈ కుట్రకు పథకం రచించబడి ఉందని, ఎమ్మెల్యేలకు భద్రత కల్పించాలని విన్నవించారు.
Advertisement
Advertisement