తొలి జాబితా
Published Mon, Mar 10 2014 11:56 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
చెన్నై, సాక్షి ప్రతినిధి:డీఎంకే అధినేత కరుణానిధి లోక్‌సభ అభ్యర్థుల తొలి జాబితాను సోమవారం విడుదల చేశారు. మిత్రపక్షాలతో కలుపుకుని 40 స్థానాలకు గాను 35 స్థానాలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు. డీఎంకే కేంద్ర కార్యాలయమైన అన్నా అరివాళయంలో పార్టీ ప్రధాన కార్యదర్శి అన్బళగన్, కోశాధికారి స్టాలిన్, ఎంపీ కనిమొళి తదితరులు వెంటరాగా మధ్యాహ్నం మీడియా సమక్షంలో జాబితాలోని పేర్లను స్వయంగా చదవి వినిపిం చారు. గత ఎన్నికల్లో పార్టీ తరపున పోటీచేసి గెలుపొందిన 8 మంది సిట్టింగ్ ఎంపీలకు మళ్లీ టిక్కెట్ ఇచ్చారు. టీఆర్ బాలు (తంజావూరు), టీకేఎస్ ఇళంగోవన్ (దక్షిణ చెన్నై), దయానిధి మారన్ (సెంట్రల్ చెన్నై), జగద్రక్షన్ (శ్రీపెరంబదూరు), తామరై సెల్వన్ (ధర్మపురి), ఏ రాజా (నీలగిరి), ఏకేఎస్ విజయన్ (నాగపట్నం), గాంధీ సెల్వన్ (నామక్కల్) సిట్టింగ్ ఎంపీలు మరోసారి అవకాశం దక్కించుకున్నారు. మిగిలిన 27 మంది కొత్తవారే. మిత్రపక్షాలకు ఐదు స్థానాలు కేటాయించారు. పుదుచ్చేరీ నుంచి నాజిమ్ పోటీ చేస్తున్నారు.
అభ్యర్థుల్లో 13 మంది న్యాయవాదులు, ముగ్గురు డాక్టర్లు, ఒక ప్రొఫెసర్ ఉన్నారు. ఇద్దరు మహిళలకు అవకాశం ఇచ్చారు. కరుణానిధి మీడియాతో మాట్లాడుతూ, ఇదే తుది జాబితా కాదని, ప్రకటించిన అభ్యర్లు పేర్లలో మార్పులు, చేర్పులకు అవకాశం ఉందని అన్నారు. అందరూ విజయావకాశాలు మెండుగా ఉన్నవారేనని చెప్పారు. తమ పార్టీ ఎల్లప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగానే అభ్యర్థులను ఎంపిక చేస్తుందని అన్నారు. కేవలం ఇద్దరు మహిళలకే పోటీకి అవకాశం ఇచ్చారేమిటని ప్రశ్నించగా, ఁఒక మహిళ చెలరేగిపోతోంది చాలదారూ. అంటూ సీఎం జయలలితపై పరోక్షంగా చెణుకులు విసిరారు. కాంగ్రెస్‌తో పొత్తు ఇక లేనట్లే అని చెప్పి వెంటనే ఏమో చెప్పలేం అంటూ వ్యాఖ్యానించారు. వామపక్షాల నేతలతో తాము ప్రత్యక్షంగా చర్చలు జరపలేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్, వామపక్షాలతో ఇక పొత్తు లేనట్లేనా అనే ప్రశ్నకు నో కామెంట్ అని బదులిచ్చారు. ఈనెల 11న పార్టీ మేనిఫెస్టోను వెల్లడించనున్నామని తెలిపారు.
సీపీఐ సమాలోచనలు
డీఎంకేతో పొత్తుపెట్టుకుంటే ఎలా ఉంటుందనే అంశంపై సీపీఐ అగ్రనేతలు సోమవారం చెన్నైలో సమాలోచనలు జరిపారు. సీపీఐ జాతీయ కార్యదర్శి సురవరం సుధాకరరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి టీ పాండియన్ తదితరులు సుదీర్ఘంగా చర్చలు జరిపారు. జాతీయ స్థాయిలో వామపక్ష పార్టీలన్నీ ఒంటరిగానే పోటీ చేస్తాయని సీపీఎం జాతీయ కార్యదర్శి ప్రకాష్ కారత్ నాగపట్నంలో ఆదివారం ప్రకటించిన 24 గంటల్లోపే సీపీఐ జాతీయ కార్యదర్శి ఇందుకు విభిన్నంగా ఆలోచనలు చేయడం గమనార్హం.
14 నుంచి స్టాలిన్ ప్రచారం
డీఎంకే అధినేత కరుణానిధి తనయుడు, పార్టీ కోశాధికారి స్టాలిన్ ఈనెల 14వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటన చేయనున్నారు. నాగర్‌కోవిల్ నుంచి తన ఎన్నికల ప్రచారాన్ని ఓపెన్‌టాప్ జీపులో సాగించనున్నారు.
Advertisement
Advertisement