
మద్యంపై డీఎంకే ఆగ్రహం
సాక్షి, చెన్నై: రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదాన్ని డీఎంకే సైతం అందుకుంటోందా? అన్న చర్చ బయలు దేరింది. ఇందుకు అద్దం పట్టే రీతిలో రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, టాస్మాక్‌లను ఇష్టారాజ్యంగా ఏర్పాటు చేసేస్తున్నారంటూ డీఎంకే మహిళా విభాగం తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేయడం గమనార్హం. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రధాన ఆదాయ వనరుగా టాస్మాక్ మద్యం దుకాణాలు నిలిచాయి. ప్రతి ఏటా వేల కోట్ల మేరకు ఆదాయం వస్తుండడంతో మద్యానికి వ్యతిరేకంగా డీఎంకే, అన్నాడీఎంకేలు ఇంత వరకు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. ఎందుకంటే, ఈ రెండు పార్టీలు రాష్ర్టంలో మార్చి మార్చి అధికారంలోకి వస్తున్నాయి. అదే సమయంలో రాష్ట్రంలో సంపూర్ణ మద్య నిషేధం నినాదానికి బలం పెరుగుతోంది. పీఎంకే, ఎండీఎంకే, కాంగ్రెస్, డీఎండీకేలు మద్య నిషేధం నినాదంతో ముందుకు సాగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో ఆ నినాదానికి పెరుగుతున్న బలమా? లేదా, రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార పగ్గాలు చేపట్టాలన్న లక్ష్యమా? ఏమోగానీ డీఎంకే సైతం ఆ నినాదాన్ని అందుకుంటుందా? అన్న చర్చ బయలు దేరింది. ఇన్నాళ్లు మద్యంపై ఎలాంటి వ్యాఖ్యలు చేయని ఆ పార్టీ అనుబంధ మహిళా విభాగం కొత్తగా మద్యంపై గళం విప్పడం గమనించాల్సిన విషయం. మద్యానికి వ్యతిరేకమా..: చతికిలబడ్డ డీఎంకే మహిళా విభాగం బలోపేతం లక్ష్యంగా ఆ విభాగానికి కొత్తగా కార్యదర్శి పగ్గాలు చేపట్టిన కనిమొళి తన వ్యూహాలకు పదును పెట్టే పనిలో పడ్డారు. శనివారం అన్నా అరివాలయంలో ఆ విభాగం నేతలతో సమావేశం అయ్యారు. మహిళా విభాగం అధ్యక్షురాలు కాంచన కమలనాథన్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కనిమొళి ప్రసంగించే క్రమంలో బలోపేతం లక్ష్యంగా పలు సలహాలు, సూచనలు ఇచ్చారు.
యువజన విభాగం తరహాలో పార్టీకి మహిళా విభాగం కీలకం కావాలని, ఇందు కోసం చేపట్టదలచిన కార్యక్రమాలను వివరించారు. మహిళా సంఘాల్ని ఏకం చేయడం, మహిళా సమస్యలు, దాడులు, రాష్ర్టంలో సాగుతున్న హింసాత్మక ఘటనలకు వ్యతిరేకంగా ఉద్యమాలు చేపట్టే విధంగా కార్యాచరణను సిద్ధం చేశారు. అనంతరం ప్రత్యేకంగా కొన్ని తీర్మానాలు చేశారు. స్వయం సహాయక మహిళా బృందాల్ని ఎత్తి వేస్తూ తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాలకు హెచ్చరికలు చేశారు. మహిళా స్వయం సహాయక బృందాలకు అండగా తమ విభాగం ఉద్యమించబోతోందని ప్రకటించారు. డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ పుట్టినరోజు వేడుకల్ని ఘనంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. ఇక, మద్యంపై తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు.
రాష్ట్రంలో మద్యం ఏరులై పారుతోందని, మందు బాబుల సంఖ్య పెరుగుతోందని శివాలెత్తారు. డీఎంకే హయాంలో మద్యం దుకాణాల సంఖ్యను తగ్గించామని, అయితే అన్నాడీఎంకే హయాంలో ఆ సంఖ్యను పెంచి ఆదాయం దండుకోవడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని తీవ్రంగా ధ్వజమెత్తారు. డీఎంకే హయంలో ఆ దుకాణాల పని వేళల్ని తగ్గిస్తే, ఇప్పుడు ఆ దుకాణాలు వేకువ జామునే తెరుస్తున్నారని, రాత్రుల్లో ఎప్పుడు మూస్తారో తెలియని పరిస్థితి నెలకొందని మండి పడ్డారు. టాస్మాక్ మద్యం దుకాణాల వ్యవహారంలో అన్నాడీఎంకే ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును తీవ్రంగా ఖండిస్తున్నామని డీఎంకే మహిళా విభాగం తీర్మానం చేయడం గమనించాల్సిన విషయం.