
సీబీఐ 'గుబులు'!
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టులో డీఎంకే పిటిషన్.
► అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వ్యవహారంపై హైకోర్టులో డీఎంకే పిటిషన్
► అది నకిలీ వీడియో : ఎమ్మెల్యే శరవణన్
► ఎమ్మెల్యేల్లో సర్వత్రా ఉత్కంఠ
► 16న విచారణ
అన్నాడీఎంకే ప్రభుత్వం విశ్వాస పరీక్ష సమయంలో అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కోట్లరూపాయలు ఎరవేసిందనే ఆరోపణలపై సీబీఐ, అవినీతి నిరోధకశాఖల చేత విచారణకు ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్ వేసింది. ఈ పిటిషన్ ఈనెల 16వ తేదీన విచారణకు రానుంది. ఏం ముంచుకొస్తుందోనని ఎమ్మెల్యేల్లో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: మద్రాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇందిరా బెనర్జీ, న్యాయమూర్తి సుందర్‌లతో కూడిన మొదటి డివిజన్ బెంచ్ ముందు డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్ తరఫున సీనియర్ న్యాయవాది షణ్ముగ సుందరం మంగళవారం హాజౖరయ్యా రు. ఈ సందర్భంగా న్యాయవాది మాట్లాడుతూ, తమిళనాడు చట్టసభలో ఫిబ్రవరి 18వ తేదీన నిర్వహించిన ప్రభుత్వ విశ్వాసపరీక్షలో అవకతవకలు జరిగినట్లుగా గతంలో హైకోర్టులో పిటిషన్ వేశామని అన్నారు. ఈ పిటిషన్ జూలై 18వ తేదీన విచారణకు రానుందని తెలిపారు.
అయితే ఆనాటి విశ్వాసపరీక్ష సమయంలో తమకు అనుకూలంగా ఓటువేయాల్సిందిగా కోరుతూ అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి శశికళ, మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఎమ్మెల్యేలకు రూ.2 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు సొమ్ము చెల్లించినట్లు బహిర్గతమైందని ఆయన అన్నారు. ఈ అక్రమాలు ఒక ప్రయివేటు చానల్‌లో ప్రసారం కావడం ద్వారా నిర్ధా్దరణైనట్లు భావిస్తున్నామని చెప్పారు. దీంతో అన్నాడీఎంకే ప్రభుత్వ, ఎమ్మెల్యేల అక్రమాలపై సీబీఐ, ఆదాయపు పన్నుశాఖచే విచారణకు ఆదేశించాల్సిందిగా డీఎంకే న్యాయవాది విజ్ఞప్తి చేశారు. ఈ పిటిషన్ శుక్రవారం నాడు విచారణకు రానుంది.
అన్నాడీఎంకే ఎమ్మెల్యేల్లో ఆందోళన
దివంగత ముఖ్యమంత్రి జయలలిత తర్వాత పార్టీ పగ్గాలు చేపట్టిన శశికళ ప్రభుత్వాధినేతగా కూడా మారాలనే ప్రయత్నంలో ఉండగా ఆస్తుల కేసులో జైలు పాలయ్యారు. అయినా ప్రభుత్వం తమ చేతుల నుంచి చేజారకూడదని ఎడపాడిని శాసనసభాపక్ష నేతగా చేశారు. మరోవైపు మాజీ సీఎం పన్నీర్‌సెల్వం ఎమ్మెల్యేలను తనవైపు ఆకర్షించే ప్రయత్నం చేశారు. తమ గూటి ఎమ్మెల్యేలు పన్నీర్‌వైపునకు వెళ్లకుండా కూవత్తూరులోని ఒక ఫాంహౌస్‌లో శశికళ క్యాంప్ ఏర్పాటు చేశారు. ఎమ్మెల్యేల బలం అధికంగా ఉన్న ఎడపాడిని గవర్నర్ విద్యాసాగర్‌రావు ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించి నెలరోజుల్లోగా అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాలని ఆదేశించారు.
అయితే ఎడపాడి రెండు రోజుల్లోనే అసెంబ్లీ విశ్వాస పరీక్షకు సిద్దమై 122 మంది ఎమ్మెల్యేల మద్దతుతో విజేతగా నిలిచారు. అయితే శశికళ, పన్నీర్‌సెల్వం ఇద్దరూ ఎమ్మెల్యేలకు కోట్లాది రూపాయలను ఎరవేసినట్లు పన్నీర్‌వర్గ ఎమ్మెల్యే శరవణన్ ఒక చానల్‌కు ఇచ్చిన ఇంటర్వూ్యలో కుండబద్దలు కొట్టడం అన్నాడీఎంకేలో దుమారం రేపింది. సీబీఐ విచారణకు ఆదేశించాలని మద్రాసు హైకోర్టులో డీఎంకే పిటిషన్ వేయడంతో అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు భయంతో ‘భుజాలు’తడుముకుంటున్నారు. అయితే సదరు ఎమ్మెల్యే శరవణన్ ఇంతలోనే అది నకిలీ వీడియో అని ఖం డించారు.
వీడియో ప్రసారం చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటానని అన్నారు. కూవత్తూరులో ఎమ్మెల్యేలకు నగదు పంపిణీ జరగలేదని ఎమ్మెల్యేలు వెట్రివేల్ కనకరాజ్ తెలిపారు. ఈ వివాదం కొనసాగుతుండగా అదేరకమైన ఆరోపణలతో శరవణన్ మాట్లాడిన మరో వీడియో మంగళవారం విడుదలైనట్లు తెలు స్తోంది. అన్నాడీఎంకేలోని ఎడపాడి, పన్నీర్‌వర్గం ఏకం కావడం ఖాయమని మరోవర్గం నేత దినకరన్ మంగళవారం మీడియా ముందు వ్యాఖ్యానించారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల వల్ల రాష్ట్రం పరువుపోయిందని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, నటి కుష్బు విమర్శించారు.