సమ్మెకు దిగిన డాక్టర్లు
- రాష్ట్రవ్యాప్తంగా వైద్య సేవలకు అంతరాయం
- పది డిమాండ్లను ప్రభుత్వానికి విన్నవించిన ఎంఏఆర్‌డీ
- డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధం: వినోద్ తావ్డే
ముంబై: తమ డిమాండ్లు నెరవేర్చాలంటూ రాష్ట్రవ్యాప్తంగా డాక్టర్లు గురువారం నుంచి సమ్మెకు దిగారు. సుమారు 4000 మంది డాక్టర్లు సమ్మెకు దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సేవలకు అంతరాయం ఏర్పడింది. మహారాష్ట్ర అసోసియేషన్ ఆఫ్ రెసిడెంట్ డాక్టర్స్ (ఎంఏఆర్‌డీ) అధ్యక్షుడు డాక్టర్ సాగర్ ముండడ ఈ సందర్భంగా మాట్లాడుతూ.. డాక్టర్ల భద్రతకు సంబంధించి చర్యలు తీసుకోవాలని ఐదేళ్లుగా విన్నవిస్తున్నా ప్రభుత్వం స్పందించడం లేదన్నారు.
పేషెంట్ చనిపోతే డాక్టర్లపై దాడికి దిగుతున్నారని చెప్పారు. తాము చదివిన స్పెషలైజేషన్‌కు సంబంధించిన శాఖలోనే ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామన్నారు. మానసిక రుగ్మతల శాస్త్రంలో ఎండీ చేసినవారికి దానికి సంబంధించిన శాఖలోనే పని చేసేందుకు ప్రభుత్వం చర్య తీసుకోవాలని కోరారు. ఒక శాఖలో స్పెషలైజేషన్ చేసి మరో శాఖలో పని చేస్తే అది రోగుల ప్రాణాలతో చెలగాటం ఆడటమే అన్నారు. తమ పది డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చాలని కోరారు.
సమ్మె విరమించండి: తావ్డే
డాక్టర్ల డిమాండ్లు నెరవేర్చడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, డాక్టర్లు సమ్మె విరమించాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వినోద్ తావ్డే కోరారు. డాక్టర్లు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకొని పరిష్కరించడానికి తాను ఎంఏఆర్‌డీ ప్రతినిధులతో చర్చించానని తావ్డే చెప్పారు. భేటీలో ముఖ్యంగా డాక్టర్ల భద్రత, సీసీటీవీ కెమెరాల ఏర్పాటు, డాక్టర్లకు కల్పిస్తున్న ఏర్పాట్లపై చర్చించామన్నారు. సమ్మె వల్ల ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటారని కాబట్టి సమ్మె విరమించాల్సిందిగా డాక ్టర్లను కోరాన్నారు.
రాత పూర్వక హామీ ఇవ్వలేదు: సాగర్
ప్రభుత్వం తమకు వ్రాతపూర్వక హామీ ఇవ్వలేదని భేటీ అనంతరం ఎంఏఆర్‌డీ అధ్యక్షుడు సాగర్ వెల్లడించారు. బుధవారం సమావేశానికి ముందు వినోద్ తావ్డేతో జూన్ 12 సమావేశమయ్యామని.. ఆ సమయంలో కూడా ప్రభుత్వం తమ డిమాండ్లు నెరవేర్చడానికి సిద్ధంగా ఉందని తావ్డే చెప్పారని అన్నారు. ప్రతిసారి ప్రభుత్వం ఇవే మాటలు చెబుతోందన్నారు కానీ డిమాండ్లు నెరవేరడంలేదని.. అందుకే సమ్మెకు దిగాలని నిర్ణయించామన్నారు. డిమాండ్ల పరిష్కారానికి ఎలాంటి కాలపరిమితిని ప్రభుత్వం చెప్పలేదన్నారు.