భక్తి శ్రద్ధలతో రంజాన్
సాక్షి, చెన్నై: అల్లా ఆజ్ఞలను పాటించడం ముస్లింలకు తప్పనిసరి విధి. ఈ విశ్వాసాలు, ఆజ్ఞాపనులను ఈమాన్ అని, ఇస్లాం అని అంటారు. మహ్మద్ ప్రవక్త సూక్తుల మేరకు ఇస్లాంకు సంబంధించి ఐదు సూత్రాలను ప్రతి ముస్లిం ఆచరించాల్సిందే. ఆ దిశగా అల్లా తప్ప మరెవరూ ఆరాధ్యులు కారని, అల్లా దాసుడు మహ్మద్ ప్రవక్తను విశ్వసించే రీతిలో నెల రోజుల పాటుగా రాష్ట్రంలోని ముస్లింలు కఠోర ఉపవాస దీక్షలను చేశారు. ఐదు పూటల నమాజులు, రాత్రుల్లో తరాబిహ్, సహజ్జుద్ నమాజులతో అల్లా ఆశీస్సులను అందుకునేందుకు ఆరాధనల్లో మునిగారు. ముస్లింలు అత్యధికంగా నివసించే ప్రాంతాల్లో నెలరోజుల పాటు ఆధ్యాత్మిక సందడి కనిపించింది.
ప్రార్థనలు: రోజా వ్రతాన్ని ఆచరించిన ముస్లింలు మంగళవారం పవిత్ర పండుగ రంజాన్‌ను అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు. చెన్నైలోని ట్రిపిక్లేన్, మన్నడి, తండయార్ పేట, పూందమల్లి, అన్నానగర్, పురసైవాక్కం, పడప్పై, తాంబరం, అరుంబాక్కం, మణ్ణివాక్కం, అన్నా సాలై, ఎంఎండీఏ, ఆవడి, వండలూరు, నీలాంకరై, కోవలం పరిసరాల్లోని పెద్ద మసీదుల్లో ఉదయం ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. సబర్బన్ పరిధిలోని చిన్న చిన్న మసీదుల్లోను, ఎంపిక చేసిన ప్రత్యేక ఈద్గా స్థలాల్లో ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనల నిమిత్తం ఉదయాన్నే ముస్లింలు పవిత్ర స్నానం ఆచరించి కొత్త బట్టలను ధరించి, అత్తర్ల సొగసులతో జట్టులు జట్టులుగా మసీదుల వైపు నడిచారు. దారి పొడవునా అల్లాహ్ అక్బర్.... అల్లాహ్ అక్బర్, లా ఇల్లాహ ఇల్లల్లాహు అన్న పదాలను పటిస్తూ నడిచారు.
మసీదుల్లో ఇమాములు, హజరత్‌ల నేతృత్వంలో ప్రత్యేక ప్రార్థనలు భక్తి భావాన్ని పెంపొందించే రీతిలో సాగాయి. నెల రోజుల తమ దీక్షకు అల్లా ఆశీస్సులను అందుకునే విధంగా ప్రత్యేక ప్రార్థనలు జరిగాయి. ఇస్లాం మత విశిష్టతను రంజాన్ పర్వదిన ప్రాముఖ్యతను వివరిస్తూ ప్రసంగాలు చేశారు. అనంతరం ముస్లింలు ఒకరికొకరు ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలుపుకున్నారు. పేదలకు తమ వంతు సాయాన్ని అందచేశారు. ఆయా ప్రాంతాల్లో రాజకీయ నాయకులు, ముస్లింలకు తమ శుభాకాంక్షలు తెలియచేశారు. మహిళల కోసం మసీదులు, ఈద్గా స్థలాల్లో విశేష ఏర్పాట్లు చేశారు. దీంతో పెద్ద ఎత్తున మహిళలు ప్రత్యేక ప్రార్థనకు తరలిరావడం విశేషం. అలాగే ఆయా మసీదుల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పరిసరాల్లో పోలీసు యంత్రాంగం గట్టి భద్రతా చర్యలు తీసుకుంది.
విందుల సందడి : ప్రత్యేక ప్రార్థన ముగియగానే విందుల సందడి ముస్లింలు అత్యధికంగా ఉండే ప్రాంతాల్లో నెలకొన్నాయి. ఖీర్ పాయసం, కేసరి వంటి తీపి పదార్థాలను పంచుకున్నారు. మధ్యాహ్నం బిర్యానీల విందు సాగింది. ఆప్తులు, కుటుంబీకులు, సన్నిహితులు, మిత్రులతో కలసి విందు భోజనాలతో ముస్లింలు పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.
నిరుపేదలను ఆదరించాలి
పోటో: 23 : భక్తి శ్రద్ధలతో మసీదులో నమాజ్ చేస్తున్న ముస్లిం సోదరులు
పోటో: 24 : నమాజ్ చేస్తున్న చిన్నారులు
వేలూరు: వేలూరు, తిరువణ్ణామలై జిల్లాలో రంజాన్ పండుగను భక్తి శ్ర ద్ధలతో నిర్వహించారు. ఈ పండుగకు ముస్లింలు 40 రోజుల పాటు ఉపవాసం ఉండి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. వేలూరు ఆర్‌ఎన్ పాళ్యం పెద్ద మసీదు, ఓటై ఈద్డా మైదానాల్లో ముస్లింలు అధిక సంఖ్యలో చేరుకొని ప్రత్యేక ప్రార్థలు జరిపారు. చిన్నా పెద్దా తేడా లేకుండా ఒకరికొకరు ఆలింగనం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ ప్రార్థనలో ముస్లిం మత పెద్దలు మసీదుకు చేరుకొని ముస్లింలు ఇతరులకు సాయం చేసినప్పుడే నిజమైన రంజాన్ పండుగ జరుపుకున్నవారం అవుతామన్నారు. సాటి మానవుడిని గౌరవించాలని, నిరుపేదలను ఆదరించాలని, సోదర భావం కలిగి ఉండాలని తెలిపి ప్రార్థనలు చేశారు. అదే విధంగా అంబూరులోని ఈద్గా మైదానం, గుడియాత్తం చిత్తూరు రోడ్డులోని మసీదు, వాణియంబాడిలోని మసీదుల్లో ముస్లిం సోదరులతో నిండిపోయింది. ఆంబూరు ప్రాంతంలోని పెద్ద మసీదు వీధుల్లో ట్రాఫిక్ స్తంభించి పోకుండా పోలీసులు రాకపోకలను మళ్లించారు. అదే విధంగా జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్పీ విజయకుమార్ ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువణ్ణామలై జిల్లాలోని మసీదులన్నీ కిటకిటలాడింది.