ఇంజనీరింగ్‌‘ర్యాండం’ విడుదల | Engineering admission random numbers to be released | Sakshi
Sakshi News home page

ఇంజనీరింగ్‌‘ర్యాండం’ విడుదల

Published Thu, Jun 12 2014 12:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:38 AM

ఇంజనీరింగ్‌‘ర్యాండం’ విడుదల

ఇంజనీరింగ్‌‘ర్యాండం’ విడుదల

సాక్షి, చెన్నై: ఇంజనీరింగ్ కోర్సులకు దరఖాస్తులు చేసుకున్న వారికి ర్యాండం నంబర్లను అన్నావర్సి టీ ప్రకటించింది. పది అంకెలతో కూడిన ఈ నం బర్లను బుధవారం ఉన్నత విద్యా శాఖ మంత్రి పళనియప్పన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడిచే  ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశ నిమిత్తం అన్నావర్సిటీ దరఖాస్తులను ఆహ్వానించింది. ప్రభుత్వ కోటా కు చెందిన 2,05,463  సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ఏర్పాట్లు వేగవంతం చేశారు.జనరల్ కోటా కింద 1,68,760సీట్లు ఉన్నాయి. టెక్నికల్ కోటా కింద 4927, క్రీడా కోటా కింద 4852, వికలాంగుల కోటా కింద 485, మాజీ సైనికోద్యోగుల కోటా కింద 2518 సీట్లకు దరఖాస్తులు వచ్చి చేరాయి. ఈ దరఖాస్తులకు ర్యాండం నంబర్లను కేటాయించి కౌన్సెలింగ్‌కు ఆహ్వానించేందుకు సర్వం సిద్ధం చేశారు. పది అంకెలతో కూడిన ర్యాండం నెంబర్లను బుధవారం విడుదల చేశారు.
 
 కేటాయింపు: అన్నావర్సిటీ ఆవరణలో జరిగిన కార్యక్రమంలో ఈ నంబర్లను ఉన్నత విద్యా శాఖ మంత్రి పళనియప్పన్ విడుదల చేశారు. ఈ ఏడాది 1624619511 నుంచి ర్యాండం నెంబర్లు ప్రారంభం అయ్యాయి.  వచ్చిన దరఖాస్తుల్లోని మార్కులు, పుట్టిన తేదీ, పేర్లు తదితర అంశాల వారీగా ఈ నంబర్లను కేటాయించారు. ఎలాంటి గందరగోళానికి ఆస్కారం ఇవ్వని రీతిలో ఈ నంబర్లను కేటాయించారు. వీటి ఆధారంగా విద్యార్థులు కౌన్సెలింగ్‌కు హాజరు కావాల్సి ఉంటుంది. తమ నంబర్లను అన్నా వర్సిటీ వెబ్ సైట్ ద్వారా విద్యార్థులు తెలుసుకోవచ్చు.
 
 ఇక ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ ర్యాంకుల జాబితాను ఈనెల 16వ తేదీ విడుదల చేయనున్నారు. ఇందుకు సంబంధించిన పనులను వేగవంతం చేశారు. ఈ ఏడాది ప్లస్‌టూలో 200కు 200 మార్కులు సాధించిన విద్యార్థుల సంఖ్య కోకొల్లలు. ఈ దృష్ట్యా, తొలి ర్యాంకు జాబితాలో అత్యధిక శాతం విద్యార్థులు ఉండే అవకాశం ఉంది. రెండు, మూడు ర్యాంకుల జాబితాలోని కటాఫ్ మార్కులు 199.75, 199.50 ఆధారంగా ఆ జాబితాలోను విద్యార్థుల సంఖ్య చాంతాడంత ఉండే అవకాశం ఉంది. జనరల్ కోటా కౌన్సెలింగ్ ఈనెల 27న ప్రారంభం కాబోతున్నా, ఈనెల 17 నుంచి క్రీడా తదితర కోటా సీట్ల కేటాయింపుల పర్వం ఆరంభం కానుంది. ఈ ఏడాది ప్రభుత్వ కోటా సీట్ల కన్నా తక్కువగా దరఖాస్తులు వచ్చిన దృష్ట్యా, అందరికీ సీట్లు గ్యారంటీ. అయితే, ప్రధాన కళాశాలలు, కోర్సుల ఎంపిక లక్ష్యంగా విద్యార్ధులు రెడీ అవుతున్నారు.
 
 ఎంబీబీఎస్‌కు జాప్యం:ఎంబీబీఎస్ ర్యాండం నం బర్ల విడుదల జాప్యం కానుంది. గురువారం నం బర్ల విడుదలకు తొలుత నిర్ణయించారు. అయితే, దరఖాస్తు చేసుకున్న అత్యధిక శాతం మంది విద్యార్థులు ప్లస్ టూలో రీటోటలింగ్‌కు దరఖా స్తు చేశారు. దీంతో రీటోటలింగ్ మార్కుల జాబి తా వైద్య విద్యశాఖకు అందాల్సి ఉంది. దీంతో ముందుగా నిర్ణయించిన మేరకు ర్యాండం నంబర్లను విడుదల చేయలేని పరిస్థితి. శుక్రవారానికి మార్కుల జాబితా అందనుండడంతో శని వారం ర్యాండం నంబర్లు ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. అయితే, ముందుగా నిర్ణయించిన మేరకు 18వ తేదీ నుంచి కౌన్సెలింగ్ ఆరంభం అవుతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
 
 18న ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల ప్రారంభం: ఈ ఏడాది ఇంజనీరింగ్ సీట్ల మీద విద్యార్థులు పెద్దగా మక్కువ చూపలేదు. ఆర్ట్స్ అండ్ సైన్స్ కోర్సుల మీద దృష్టి పెట్టిన వాళ్లు అధికమే. దీంతో ప్రభుత్వ, ప్రభుత్వ సహకారంతో నడుస్తున్న కళాశాలలు, ప్రైవేటు కళాశాలల్లో సీట్లకు డిమాండ్ ఏర్పడింది. ఇప్పటికే ఆయా కళాశాలల్లో అడ్మిషన్ల పర్వం ముగింపు దశకు చేరింది. బీకాంను ఈ ఏడాది అత్యధిక మంది విద్యార్థులు ఎంపిక చేసుకున్నట్టు సంకేతాలు వెలువడుతున్నాయి. డిగ్రీ కళాశాలల ప్రారంభం తేదీని బుధవారం ప్రకటించారు. ఈనెల 18 నుంచి ఆయా కళాశాలల గేట్లు తెరచుకోనున్నాయి.
 
 బాలాజీకి లక్కు: ఈ ఏడాది కేంద్ర వైద్య విద్యాకౌన్సిల్ మౌళిక వసతుల పేరిట కళాశాలల మీద కొరడా ఝుళిపించే పనిలో పడింది. ఎక్కడ వైద్య కోర్సుల సీట్లు తగ్గుతాయోనన్న ఆందోళన నేపథ్యంలో బాలాజీ వైద్య కళాశాలకు వంద సీట్లు దక్కనున్నాయి. చెన్నైలోని ఈ కళాశాలలో 150 వైద్య కోర్సుల సీట్లు ఉన్నాయి. అదనంగా వంద కేటాయించాలన్న ప్రతిపాదనను ఆ కళాశాల యాజమాన్యం వైద్య విద్యా కౌన్సిల్ దృష్టికి తీసుకెళ్లింది. అయితే,  వసతులు లేవంటూ ఆ సీట్ల కేటాయింపునకు కౌన్సిల్ నిరాకరించింది. దీంతో ఆ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడంతో వైద్య విద్యా కౌన్సిల్ బుధవారం వివరణ ఇచ్చుకుంది.  కళాశాలలో అన్ని రకాల వసతులు  ఉన్నట్టుగా నిరూపితం కావడంతో వైద్య విద్యా కౌన్సిల్ ఉత్తర్వులను, వివరణను మద్రాసు హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి అగ్ని హోత్రి, సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ తిరస్కరించింది. దీంతో ఆ కళాశాలకు అదనంగా వంద సీట్లు  దక్కే అవకాశాలు ఉన్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement