తిరువళ్లూరు, న్యూస్‌లైన్: డీఎండికే గుర్తుపై పోటీ చేసి అత్యధిక మెజారిటీతో గెలుపు సాధించిన తిరుత్తణి ఎమ్మెల్యే, డీఎండీకే పార్టీ తిరువళ్లూరు జిల్లా కార్యదర్శి అన్నాడీఎంకేలో చేరడంపై ఆగ్రహం చెందిన కార్యకర్తలు మనవాలనగర్‌లోని ఆయన ఇంటిపై, కార్యాలయంపై రాళ్లు చెప్పులతో దాడికి దిగడంతో ఉద్రిక్తత నెలకొంది. ఆందోళనకారులను పోలీసులు అదుపు చేయలేక నానాఇబ్బంది పడ్డారు. తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం గురువారం ఉదయం చెన్నైలో ముఖమంత్రి జయలలిత సమక్షంలో పార్ట్టీలో చేరారు. విషయం తెలుసుకున్న డీఎండీకే కార్యకర్తలు దాదాపు వంద మంది మనవాలనగర్‌కు చేరుకున్నారు. మొదట అరుణ్‌సుబ్రమణ్యంకు చెందిన కళాశాల, వ్యక్తిగత కార్యాలయంపై ఉన్న డీఎండీకే బ్యానర్లను చించేశారు.
బాణసంచా కాల్చి సంబరాలు: డీఎండీకే పార్టీకి రాజీనామా చేసిన అరుణ్‌సుబ్రమణ్యంతో పార్టీకి పట్టిన శని వదలిందని పేర్కొంటూ భారీగా బాణసంచా కాల్చి స్వీట్లు పంచి పెట్టి సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ర్యాలీగా రెండవ విడత అరుణ్ సుబ్రమణ్యం ఇంటి వద్దకు బయలుదేరగా, పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు, డీఎండీకే కార్యకర్తలకు తీవ్రస్థాయిలో వాగ్వాదం నెలకొంది. అయితే అప్పటికే పరిస్థితి చేయి దాటి పోవడంతో ఆగ్రహించిన కార్యకర్తలు అయన ఇంటిపైకి రాళ్లు, చెప్పులు విసిరి ఆందోళన చేపట్టారు. పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారకముందే పోలీసులు ఆందోళనకారులను లాక్కెళ్లి దూరంగా పడేశారు. అనంతరం దిష్టిబొమ్మలను తయారు చేసి దహనం చేయడంతో పాటు చెప్పులతో కొట్టి ఊరేగించారు.
మొదటి ఎమ్మెల్యే అవుట్: రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో డీఎండీకే, అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని 40 స్థానాలకు పోటీ చేసింది. వీటిలో 24 మంది ఎమ్మెల్యేలుగా విజయం సాధించగా, తిరువళ్లూరు జిల్లా తిరుత్తణి నుంచి అరుణ్‌సుబ్రమణ్యం, గుమ్మిడిపూండి ఎమ్మెల్యే శేఖర్ దాదాపు 30 వేల ఓట్లతో విజయం సాధించారు. డీఎండీకే ఎమ్మెల్యేలు ప్రమాణం చేసిన సమయంలో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ ప్రకారం తిరుత్తణి ఎమ్మెల్యే అరుణ్‌సుబ్రమణ్యం ప్రమాణం చేసి పార్టీ మొదటి ఎమ్మెల్యేగా ఘనతనూ సాధించారు. అయితే ప్రమాణం చేసిన మొదటి ఎమ్మె ల్యే పార్టీని వీడడం కార్యకర్తల్లో అసంతృప్తి నింపింది.
ఫలించిన ఒత్తిడి: డీఎండీకేకు గుడ్‌బై చెప్పి అన్నాడీఎంకేలో చేరిన అరుణ్‌సుబ్రమణ్యంపై ఆయన వియ్యంకుడు, అన్నాడీఎంకే పార్టీ కీలక నేత ఢిల్లీ మాజీ ప్రతినిధి నరసింహన్ ఒత్తిడి ఫలించిందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానించారు.
గతంలో కేబినెట్ హోదాలో వున్న నరసింహన్ పదవిని ఇటీవల ముఖ్యమంత్రి తొలగించారు. ఇందుకు ప్రదాన కారణం అరుణ్‌సుబ్రమణ్యం పార్ట్టీలో చేరుతాననీ గతంలో ఇచ్చిన హామీ మేరకు నడుచుకోకపోవడమేనని అన్నాడీఎంకే వర్గాలు వెల్లడించాయి. అరుణ్‌సుబ్రమణ్యం అన్నాడీఎంకేలో చేరకపోవడం, ఢిల్లీ ప్రతినిధి నరసింహన్ పదవి పోవడం లాంటి సంఘటనతో నరసింహన్ అరుణ్‌సుబ్రమణ్యంపై ఒత్తిడి పెంచి అన్నాడీఎంకేలో చేరేలా చేశారని డీఎండీకే వర్గాలు వ్యాఖ్యానించాయి. బీజేపీతో పొత్తు కోసం చర్చలు జరుపుతున్న సమయంలో పార్టీ ఎమ్మెల్యే పిరాయించడంతో ఇటు పార్టీ కార్యకర్తలలోనూ, అటుహైకమాండ్‌కు తలనొప్పిగా మారినట్టు పలువురు వ్యాఖ్యానించారు. డీఎండీకే కార్యదర్శి పదవికి రాజీనామా చేసిన నేపథ్యంలో తిరుత్తణికి చెందిన సీనియర్ నేత కృష్ణమూర్తికి పదవి దక్కే అవకాశం వుండగా, పదవి కోసం పలువురు పోటీ పడుతుండడంతో పోటాపోటీ నెలకొంది.
డీఎండీకే ఎమ్మెల్యే ఇంటిపై దాడి
Published Fri, Feb 28 2014 1:20 AM | Last Updated on Sat, Sep 2 2017 4:10 AM
Advertisement