దోమలపై దండ(గ)యాత్ర | failure mosquitoes control | Sakshi
Sakshi News home page

దోమలపై దండ(గ)యాత్ర

Published Wed, Oct 5 2016 4:24 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM

దోమలపై దండయాత్ర ర్యాలీ ప్రారంభిస్తున్న జిల్లా అధికారులు(ఫైల్‌)

దోమలపై దండయాత్ర ర్యాలీ ప్రారంభిస్తున్న జిల్లా అధికారులు(ఫైల్‌)

 లక్ష్యం చేరని దోమలపై దండయాత్ర
 ప్రకటనలకే పరిమితమైన పాలకులు
 ర్యాలీలతో మమా అనిపించిన అధికారులు
 పారిశుద్ధ్యం మెరుగుపడక రోగాలబారిన పడుతున్న జనం
 
సాక్షి, చిత్తూరు: ప్రభుత్వం దోమలపై ప్రకటించిన దండయాత్ర దండగయాత్రగా మారిందని, పాలకులు, అధికారుల నిర్లక్ష్యం వల్ల అది లక్ష్యం చేరలేదనే ఆరోపణలు పెద్దఎత్తున వినిపిస్తున్నాయి. ఫలితంగా జిల్లావ్యాప్తంగా క్షేత్రస్థాయిలో పారిశుద్ధ్యం ఏమాత్రం మెరుగుపడలేదు. ఈ కార్యక్రమంలో భాగంగా కనీసం అన్ని గ్రామాల్లో మురుగు కాల్వలను కూడా శుభ్రం చేయలేక పోయారంటేనే అధికారులు ఏ స్థాయిలో వైఫల్యం చెందారో అర్థం చేసుకోవచ్చు. కేవలం అవగాహన ర్యాలీలకే పరిమితం కావడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ప్రజలు వాపోతున్నారు. దీనికితోడు 14 ఆర్థికసంఘం నిధులు కూడా పంచాయతీ ఖాతాలకు చేరకపోవడంతో పరిసరాల పరిశుభ్రత ఎక్కడవేసిన గొంగలి అక్కడే అన్న చందంగా మారింది.  

దోమలపై దండయాత్ర కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. దీంతో జిల్లాలోని 1350కి పైగా గ్రామాలు, 6 మున్సిపాలిటీలు దోమలకు నిలయంగా మారాయి. కాలువలు, డ్రెయిన్లు, గుంతలు, ఖాళీస్థలాలు చెత్తాచెదారంతో నిండి దోమలకు ఆవాసాలుగా మారుతున్నాయి. దోమలపై దండయాత్రకు కార్యక్షేత్రానికి వెళ్లాల్సిన అధికారులు కేవలం ర్యాలీలకే పరిమితమయ్యారు.

ప్రణాళిక ఏదీ..
సెప్టెంబర్‌ 24న ప్రభుత్వం ‘దోమలపై దండయాత్ర’ కార్యక్రమాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. తిరుపతిలో జిల్లా ఇంచార్జి మంత్రి నారాయణ ఆరోజు కాలువ కూడా శుభ్రం చేశారు. అనంతరం ఈ కార్యక్రమంపై ప్రత్యేక ప్రణాళికలేవీ లేక దండగయాత్రలా మారింది. ఎక్కడెక్కడ ఎలాంటి పనులు చేయాలనే సూచనలు ప్రభుత్వం నుంచి లేకపోవడంతో అధికారులు కూడా నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. మొదటి రెండు రోజులు దోమల నివారణపై ప్రభుత్వం భారీ ఎత్తున ప్రచారం చేసింది. పుస్తకాలు, కరపత్రాలు పంచింది. తర్వాత చివరికి రాతలు, కోతలు తప్పితే కార్యక్షేత్రంలో దిగి దోమలను తరిమేసే పనులేవీ చేయకపోవడంతో కార్యక్రమం లక్ష్యాన్ని చేరుకోలేదు. 

నిధులేవీ..
గ్రామాలు మురికి కూపాలుగా మారుతున్నాయి. వీటిని శుభ్రంగా ఉంచితేనే దోమలను పూర్తిస్థాయిలో నిర్మూలించడానికి వీలవుతుంది. దీనికి సర్పంచ్‌లు, వైద్యశాఖ, పంచాయతీ సెక్రటరీలు కలిసి కట్టుగా పని చేయాల్సి ఉంటుంది. అయితే వీరందరూ ఎవరికివారే యమునా తీరే అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. ముఖ్యంగా నెలల తరబడి ప్రభుత్వం నుంచి బిల్లులు మంజూరు కాకపోవడంతో సర్పంచ్‌లు ఈ కార్యక్రమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు. గ్రామాల్లోని మురుగు కాలువలు, నీరునిల్వ ఉన్న గుంతల్లో కనీసం బ్లీచింగ్‌ కూడా చల్లించడం లేదు. 14వ ఆర్థిక సంఘం నిధులు వినియోగించుకోవచ్చని ప్రభుత్వం నుంచి ఆదేశాలందినా.. ఆ నిధులు పంచాయతీ ఖాతాల్లోకి జమకాకపోవడంతో దోమలపై దండయాత్ర కార్యక్రమానికి ఆదిలోనే హంసపాదు ఎదురైంది.  

ఒక్క సమీక్షాలేదు..
జిల్లాలోని ప్రతి గ్రామం నుంచి దోమలను తరమి కొడతామని చెప్పిన జిల్లా ఉన్నతాధికారి సిద్ధార్థ్‌జైన్‌.. కార్యక్రమం ప్రారంభమై వారం రోజులు గడచినా దీనిపై ఒక్క సమీక్ష కూడా నిర్వహించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా  సమీక్షించి తగిన చర్యలు తీసుకుంటే కొంతమేరకైనా కార్యక్రమ ఉద్దేశం నెరవేరుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement