వినూత్న ఆచారం
► ఊరి చుట్టూ కంచె !
► 13 నుంచి ఊరమ్మ జాతర
దావణగెరె : జాతర సందర్భంగా మొత్తం ఊరు ఊరే తొమ్మిది రోజుల పాటు తన చుట్టు తానే కంచె వేసుకుంటుంది. నేటి ఆధునిక యుగంలోనూ ఇలాంటి విచిత్రమైన ఆచారంతాలూకాలోని కక్కరగొళ్ల గ్రామంలో మూడేళ్లకొకసారి జరిగే శ్రీఊరమ్మ దేవి జాతర సందర్భంగా ఆచరిస్తారు. జాతర సందర్భంగా మొత్తం గ్రామం చుట్టూ ముళ్లకంపలు వేస్తారు. ఇందుకోసం నాలుగు రోజుల ముందు నుంచే ఏర్పాట్లు జరుగుతాయి. గ్రామం చుట్టూ సుమారు 3 కి.మీ.ల పొడవునా ముళ్లకంపలను ఏర్పాటు చేస్తారు.
ఈ తొమ్మిది రోజుల పాటు మొత్తం ఊరుకి ఒకే ద్వారం ఉంటుంది. అదే ఊరు వాకిలి. ఎవరు వచ్చినా, వెళ్లినా కూడా ఇదే దీని గుండానే రావాలి, వెళ్లాలి. ముళ్లకంపలు వేసిన తర్వాత జాతర ప్రారంభమవుతుంది. ముళ్ల కంపలు వేసిన తర్వాత గ్రామంలోకి వస్తువులను ఎట్టిపరిస్థితుల్లోనూ వెలుపలికి తీసుకెళ్లరాదు. దీనిపై నిఘా ఉంచేందుకు యువకులు, పెద్దల బృందం తొమ్మిది రోజుల పాటు ముఖ్య ద్వారం వద్ద కాపలా కాస్తుంది.
అయితే కళ్లజోడు, బంగారు ఆభరణాలు, రంగు లేని చట్ట సంచి, పెన్సిల్‌తో రాసిన కాగితం, నాణాలు, నోట్లకు మినహాయింపు ఉంది. మిగతా వస్తువులను లోపలకు తెస్తే మళ్లీ వాటిని బయటకు తీసుకెళ్లేందుకు తొమ్మిది రోజుల పాటు వేచి ఉండాల్సిందే. పచ్చి వస్తువులు, పదార్థాలు, దుస్తులు, చేతికి కట్టిన దారం, పసుపు కుంకుమ వంటి వస్తువులను గ్రామం నుంచి బయటకు తీసుకెళ్లరాదు. ఇలాంటి ఎన్నో నియమాలు ఉన్నాయి. వాటిని ఎవరైనా ఉల్లంఘిస్తే జరిమానా చెల్లించక తప్పదు.
ఏర్పాట్లు ప్రారంభం: ఈనెల 13 నుంచి జరిగే జాతరకు ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. గ్రామస్తులంతా కంచె వేయడంలో నిమగ్నమయ్యారు. ఈసారి ‘నమ్మ జాతర–నమ్మ ఆట–2017’ పేరిట వివిధ రకాల క్రీడా పోటీలను ఏర్పాటు చేశారు. ఈ జాతరలో పాల్గొనేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు తరలివస్తారు.