
ఎట్టకేలకు ఓకే!
► నేటి అన్నాడీఎంకే సర్వసభ్య సమావేశానికి లైన్‌క్లియర్
► బెంగళూరు, మద్రాసు హై కోర్టుల భిన్నమైన తీర్పులతో సందిగ్ధత
► మద్రాసు హైకోర్టు ద్విసభ్య బెంచ్ తీర్పుతో మార్గం సుగమం
► ప్రభుత్వాన్ని కూల్చివేస్తామని ప్రకటించిన దినకరన్
ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి మంగళవారం తలపెట్టిన అన్నాడీఎంకేసర్వసభ్య సమావేశానికి ఎట్టకేలకు లైన్ క్లియర్ అయ్యింది. మద్రాసు,బెంగళూరు కోర్టులు భిన్నమైన తీర్పును చెప్పడంతో కొన్నిగంటలపాటూ నెలకొన్న సందిగ్ధతపై సోమవారం రాత్రి 9.30 గంటలకు స్పష్టత చేకూరింది.
సాక్షి ప్రతినిధి, చెన్నై: పార్టీ, ప్రభుత్వాలకు తలనొప్పిగా తయారైన టీటీవీ దినకరన్‌ను వదిలించుకోవాలని సీఎం ఎడపాడి తీర్మానించుకున్నారు. ఈనెల 12వ తేదీన పార్టీ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించి శశికళ స్థానంలో కొత్త ప్రధాన కార్యదర్శిని ఎన్నుకుంటే ఒకే దెబ్బకు రెండు పిట్టల్లా దినకరన్ కూడా దెబ్బతీయవచ్చని ఎడపాడి అంచనావేశారు. సర్వసభ్య సమావేశానికి అవసరమైన 3,200 మంది కార్యవర్గ సభ్యుల బలాన్ని కూడగట్టారు.
ఇదిలా ఉండగా పార్టీ సమావేశం జరపకుండా స్టే విధించాలని కోరుతూ దినకరన్ వర్గ పెరంబూరు ఎమ్మెల్యే వెట్రివేల్ మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ న్యాయమూర్తి సీవీ కార్తికేయన్ ముందుకు సోమవారం విచారణకు వచ్చింది. పార్టీ సమావేశం ఏర్పాటుకు ఉప ప్రధాన కార్యదర్శి హోదాలో ఉన్న దినకరన్‌కు మాత్రమే అధికారం ఉందని వెట్రివేల్ తరపు న్యాయవాది టీవీ రామానుజం వాదించారు. న్యాయమూర్తి స్పందిస్తూ వెట్రివేల్ తన పిటిషన్‌ను ఎమ్మెల్యే హోదాలో వేయలేదని, పైగా దినకరన్‌ను కూడా ఇందులో చేర్చారని అన్నారు.
అంతేగాక ప్రత్యేక పరిస్థితుల్లో ఈ పిటిషన్ వేసినట్లు కూడా ఆయన అంగీకరించినందున ఇటువంటి చర్యలను కోర్టు ఉపేక్షించదని చెప్పారు. ‘‘ఇష్టమైతే మీరు పార్టీ సమావేశంలో పాల్గొనవచ్చు, లేకుంటే మధ్యలోనే లేచివెళ్లిపోయి భోజనం చేయవచ్చు, అదీ ఇష్టకాకుంటే హాయిగా ఇంటిలోనే కూర్చుండిపోవచ్చు..’’ అంటూ చమత్కారంగా మాట్లాడిన న్యాయమూర్తి స్టే కోరుతూ వేసిన పిటిషన్‌ను కొట్టివేశారు. అంతేగాక అవగాహన లేని పిటిషన్ వేసి కోర్టు సమయం వృధా చేశారన్న విమర్శతో వెట్రివేల్‌కు రూ.1లక్షల జరిమానా విధించారు.
అయితే ఈతీర్పుపై మద్రాసు హైకోర్టులోనే ప్రధాన న్యాయమూర్తి బెంచ్‌కు వెట్రివేల్ అప్పీలు చేసుకున్నారు. అప్పీలు పిటిషన్‌ను స్వీకరించిన హైకోర్టు రాత్రి 7.15 తీర్పు చెబుతానని వెల్లడించింది. మరో 24 గంటల్లో సర్వసభ్య సమావేశం జరుగనుండగా బెంగళూరు కోర్టు స్టే ఇస్తూ సోమవారం రాత్రి ఇచ్చిన తీర్పుతో ఎడపాడి వర్గీయుల్లో మరో బాంబు పేలింది. వెట్రివేల్ అప్పీలు పిటిషన్‌పై ఎటువంటి తీర్పు వెలువడుతుందో అనే ఉత్కంఠ బయలుదేరింది.
గంటకోసారి మారుతున్న పరిణామాలపై సీఎం ఎడపాడి, డిప్యూటీ సీఎం పన్నీర్‌సెల్వం సోమవారం రాత్రి తన వర్గంతో సమావేశమయ్యారు. అయితే అన్నాడీఎంకే (అమ్మ) వర్గం, అన్నాడీఎంకే పురట్చి తలైవి అమ్మ వర్గం కలిసి చెన్నైలో నిర్వహించే సర్వసభ్య సమావేశానికి స్టే విధించే అధికారం బెంగళూరు కోర్టుకు లేదని ఎడపాడి వర్గ పార్లమెంటు సభ్యులు అన్వర్‌రాజా వాదన లేవనెత్తారు. నిర్ణయించిన ప్రకారం మంగళవారం సర్వసభ్య సమావేశం జరిగితీరుతుందని ఆయన స్పష్టం చేశారు.
ఎట్టకేలకు ఎడపాడికి అనుకూలం
సోమవారం రాత్రి 9.30 గంటలకు మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పు ఎట్టకేలకూ ఎడపాడికి అనుకూలంగా వెలువడింది. ఏకసభ్య బెంచ్ న్యాయమూర్తి ఇచ్చిన తీర్పును కొట్టివేయలేమని, స్టే మంజూరు కుదరదని న్యాయమూర్తులు రాజీవ్ అక్తర్, అబ్దుల్ ఖుద్దూస్ స్పష్టం చేశారు. అయితే అప్పీల్ పిటిషన్‌లోని అంశాలపై సమగ్ర విచారణ కోసం ఈనెల 24వ తేదీకి కేసును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించడంతో ఎడపాడి వర్గం ఊపిరి పీల్చుకుంది.
మారుస్తా.. లేకుంటే కూలుస్తా : దినకరన్
తమ వల్ల సీఎం అయిన ఎడపాడిని ఆ పదవి నుంచి దింపివేసి మంచి ముఖ్యమంత్రిని ఎన్నుకుంటామని, వీలుకాని పక్షంలో ప్రభుత్వాన్ని కూల్చివేస్తానని టీటీవీ దినకరన్ వ్యాఖ్యానించారు. మదురైలో సోమవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, మీకే ద్రోహం చేసిన వారిని మాకు ఏం మేలు చేస్తారని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ధర్మ యుద్ధమని డిప్యూటీ సీఎం పదవిని తీసుకున్నారు పన్నీర్‌సెల్వం, ఆయనకు పదవి లేకుంటే ఊపిరి ఆడదని ఎద్దేవా చేశారు. గతంలో తమ వల్ల ప్రభుత్వానికి ముప్పులేదని చెబుతూ వచ్చిన దినకరన్ నేడు స్పష్టంగా కూల్చివేస్తామని ప్రకటించారు.