కేజ్రీవాల్ సర్కారు విన్నపంపై 26న విచారణ
న్యూఢిల్లీ: అవినీతి ఆరోపణలకు సంబంధించి మాజీ ముఖ్యమంత్రి షీలాదీక్షిత్‌పై కేసు నమోదు కాకుండా అడ్డుకునేందుకు గత కాంగ్రెస్ ప్రభుత్వం దాఖలుచేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకోవాలని కోరుతూ కేజ్రీవాల్ ప్రభుత్వం చేసిన విన్నపంపై ఈ నెల 26వ తేదీన విచారణ జరగనుంది. ఈ కేసుపై వాదించేందుకు అదనపు సొలిసిటర్ జనరల్ అందుబాటులో లేరని ప్రభుత్వం కోర్టు దృష్టికి తీసుకురావడంతో జస్టిస్ వీపీ వైష్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ తేదీని 26గా ఖరారుచేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ దాఖలుచేసిన విన్నపాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ ఆప్ ప్రభుత్వం ఈ నెల 14వ తేదీన ఓ పిటిషన్‌ను దాఖలు చేసిన సంగతి విదితమే.
కాగా అవినీతికి వ్యతిరేకంగా ప్రవేశపెట్టిన జన్‌లోక్‌పాల్ బిల్లుకు సభలో ఆమోదం లభించకపోవడంతో ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని మంత్రిమండలి రాజీనామా చేశారు. ఇదిలాఉంచితే షీలాదీక్షిత్ అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్నందువల్ల ఆమెపై విచారణ జరపరాదంటూ గత కాంగ్రెస్ ప్రభుత్వం కోరిందని, అందుకు లెఫ్టినెంట్ గవర్నర్ కూడా ఆమోదం తెలిపారని, అయితే ప్రస్తుతం ఆమె ముఖ్యమంత్రి పదవిలో లేదని తన విన్నపంలో అధికారం నుంచి ఇటీవల తప్పుకున్న ఆప్ ప్రభుత్వం కోరింది. అధికారంలో లేనందువల్ల ఆమె తరఫున పోరాటం జరిపేందుకు ఈ పిటిషన్‌కు జోక్యం చేసుకునే హక్కు ఎంతమాత్రం లేదని పేర్కొంది.