సాక్షి, న్యూఢిల్లీ: నగరంలో పొగమంచు తీవ్రత పెరిగింది. జాతీయ రాజధాని ప్రాంతంలోనూ దట్టమైన పొగమంచు ఆవరించింది. సోమవారం మొదలైన ఈ పొగమంచు తీవ్రత మంగళవారం మరింత పెరిగింది. దీనివల్ల దృశ్యగోచరత 50 మీటర్ల కన్నా తగ్గిపోవడంతో అనేక రైళ్లు, విమానాలు ఆలస్యంగా నడిచాయి. కొన్ని విమాన సేవలను, రైళ్లను రద్దు చేశారు. దాదాపు 200కిపైగా విమానాలు ఆలస్యంగా నడిచాయి. పొగమంచు కారణంగా దృశ్యగోచరత బాగా తగ్గిపోవడంతో ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఉదయం ఐదు గంటల నుంచి విమాన రాకపోకలను నిలిపివేశారు. దాదాపు ఐదు గంటలపాటు విమానాల రాకపోకలను నిలిపివేయడంతో ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడ్డారు.
విమానాశ్రయంలో ప్రవేశ, నిష్ర్కమణ ద్వారాల వద్ద వంద మంది ప్రయాణికులు గుమిగూడి ఉండడం కనిపించింది. పొగమంచు కారణంగా 224 విమానాలు ఆలస్యంగా నడిచాయి. వీటిలో 179 జాతీయ, 45 అంతర్జాతీయ విమానాలున్నాయి. విమానాలు రన్‌వేపై దిగాలంటే కనీసం 50 మీటర్ల దృశ్యగోచరత ఉండాలి. విమానం రన్‌వేపై నుంచి ఎగరాలంటే విమానం ఆకృతిని బట్టి కనీసం 125 నుంచి 150 మీటర్ల దృశ్యగోచరత ఉండాలి. దీని కన్నా తక్కువగా ఉండటంతో విమాన రాకపోకలను నిలిపివేశామని విమానాశ్రయ అధికారి ఒకరు తెలిపారు. ఉదయాన్నే వివిధ పనుల కోసం, జాగింగ్ కోసం రోడ్డెక్కిన నగరవాసులు పొగమంచు వల్ల తీవ్ర ఇబ్బందులు పడ్డారు. కార్యాలయాలకు బయలుదేరిన ఢిల్లీవాసులు చలితో వణికిపోయారు. వెలుతురు సరిగా కనిపించక వివిధ ప్రాంతాల్లో వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయి ట్రాఫిక్ జామ్‌లు ఏర్పడ్డాయి.
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రమాదం
పొగమంచు వల్ల గ్రేటర్ నోయిడాలో యమునా ఎక్స్‌ప్రెస్‌పై రోడ్డుప్రమాదం జరిగింది. జీరోపాయింట్ , జెవార్ టోల్ ప్ల్లాజాల మధ్య ఓ టూరిస్ట్ బస్సును ట్రక్కు ఢీకొనడంతో నలుగురు మరణించారు. 24 మందికి గాయాలయ్యాయి. గాయపడిన వారిని గ్రేటర్ నోయిడాలోని కైలాష్ ఆసుపత్రిలో చేర్పించారు. పొగమంచు కారణంగా ఎదురుగా వచ్చే వాహనాలు కనిపించలేదని, మద్యం తాగిన డ్రైవర్ బస్సును అతివేగంగా నడిపాడని సమాచారం. ఉమ్రావ్‌కు వెళ్తున్న బస్సు జెవార్ టోల్ ప్లాజాకు వస్తుండగా ట్రక్కు ఢీకొంది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రెండో రోజూ అదే తీరు
Published Tue, Dec 17 2013 11:14 PM | Last Updated on Sat, Sep 2 2017 1:42 AM
Advertisement
Advertisement