హైదరాబాద్ : భారీ వర్షాలతో తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులకు వరద నీరు పోటెత్తింది. కర్నూలు జిల్లాలోని శ్రీశైలం జలాశయానికి వరద ఉధృతి కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ప్రస్తుతం 882.30 అడుగులకు వరద నీరు వచ్చి చేరింది. ప్రస్తుతం ప్రాజెక్టులో 200.658 టీఎంసీల నీటి నిల్వ ఉన్నట్లు ప్రాజెక్టు అధికారులు బుధవారం వెల్లడించారు.
ఇన్ ఫ్లో 1,05,358 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 83,712 క్యూసెక్కులుగా ఉంది. తూర్పుగోదావరి జిల్లాలోని దవళేశ్వరం ప్రాజెక్టులో కూడా వరద ఉధృతి కొనసాగుతుంది. ధవళేశ్వరం బ్యారేజీ వద్ద 7.8 అడుగులకు నీటి మట్టం చేరింది. 4.87 లక్షల క్యూసెక్కుల నీరు సముద్రంలో విడుదల చేశారు.
నల్గొండ జిల్లా:
నాగార్జున సాగర్కు వరద ఉధృతి కొనసాగుతుంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా... ప్రస్తుతం 524 అడుగులకు చేరుకుంది. ప్రాజెక్టులో ఇన్ ఫ్లో 78,100 క్యూసెక్కులు.... ఔట్ ఫ్లో 900 క్యూసెక్కులు ఉంది.
మెదక్ జిల్లా :
సింగూరు ప్రాజెక్టుకు వరద కొనసాగుతుంది. పూర్తి స్థాయి నీటిమట్టం 1717 అడుగులు కాగా... ప్రస్తుతం నీరు 1716 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో 65 వేల క్యూసెక్కలు ఉండగా.. ఔట్ ఫ్లో 45 వేల క్యూసెక్కులు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ 29.99 టీఎంసీలు... ప్రస్తుతం 28.10 టీఎంసీలు ఉంది.
నిజామాబాద్ జిల్లా:
నిజాంసాగర్ ప్రాజెక్టుకు వరద పోటెత్తింది. పూర్తి స్థాయి నీటి మట్టం 1405 అడుగులు ఉండగా... ప్రస్తుతం 1403 అడుగులకు చేరుకుంది. ఇన్ ఫ్లో లక్షా 5 వేల క్యూసెక్కులు ఉండగా.. ఔట్ ఫ్లో 87 వేల క్యూసెక్కులు ఉంది. అదే జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి తగ్గింది. దీంతో 42 గేట్లను అధికారులు మూసివేశారు. పూర్తి స్థాయి నీటిమట్టం1091 అడుగులు కాగా... ప్రస్తుతం 1090 అడుగులు ఉంది. ఇన్ఫ్లో లక్షా 86 వేల క్యూసెక్కులు ఉండగా... వరద కాల్వకు 15 వేల క్యూసెక్కులు ఉంది. కాకతీయ కాల్వకు 3 వేల క్యూసెక్కులు విడుదల చేశారు.
కరీంనగర్ : శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టుకు వరద నీరు పోటెత్తింది. పూర్తిస్థాయి నీటిమట్టం 148 మీటర్లు ఉండగా.. ప్రస్తుతం 146.70 మీటర్లు ఉంది. ప్రాజెక్టులో ఇన్ఫ్లో 2,81,318 క్యూసెక్కులు ఉండగా... ఔట్ ఫ్లో 2,70,805 క్యూసెక్కులు ఉంది.