ముంబయి తరహాలో చెన్నైకి ముప్పు?
► భారీ స్థాయిలో ముందుజాగ్రత్త చర్యలు
► వచ్చేనెల 10 నాటికి 38 శాఖలు అప్రమత్తం
► అప్పుడే చెప్పలేమంటున్న వాతావరణశాఖ
రెండేళ్ల క్రితం చెన్నైని ముంచెత్తిన వరదనీటి చేదు అనుభవాన్ని తమిళనాడు ప్రజలు ఇంకా మర్చిపోలేదు. భారీ వర్షాల కారణంగా ముంబయి మహానగరం ఇటీవల నీట మునిగిన దృశ్యాలు రాష్ట్ర ప్రజల మదిలో ఇంకా నిలిచే ఉన్నాయి. అదే తరహా ముప్పు చెన్నైకి పొంచి ఉందనే ప్రచారం ప్రజలను భయాందోళనలకు గురిచేస్తోంది. ఎటువంటి అవాంతరం ఎదురైనా ఎదుర్కొనేందుకు చెన్నై కార్పొరేషన్ సమాయత్తంఅవుతుండగా, అప్పుడే ఏమీ చెప్పలేమని వాతావరణ శాఖ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: 2015 డిసెంబరు 1, 2 తేదీలు తమిళనాడు ప్రజలు, ముఖ్యంగా చెన్నై జనాలు ప్రాణభయంతో వణికిపోయిన రోజులు. ఊపిరి ఉన్నంతవరకు అటువంటి భయంకరమైన అనుభవం ఎదురుకాకూడదని ప్రజలు ప్రార్థించిన కాళరాత్రులు అవి. అయితే అంతటి తీవ్రత కాకున్నా భారీ వర్షాలు చెన్నైని మరోసారి ముంచెత్తే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
ఈ ప్రచారానికి ఊతమిస్తూ చెన్నై కార్పొరేషన్ సైతం సహాయ చర్యలపై సన్నాహాలు చేస్తోంది. ఈ ఏడాది అక్టోబరులో రాష్ట్రంలో ఈశాన్య రుతుపవనాలు ప్రవేశిస్తున్న కారణంగా ప్రజా పనులు, రహదారులు, చెన్నై తాగునీరు, జాతీయ విపత్తుల నివారణ, పోలీస్, అగ్నిమాపక, మత్స్య, విద్యుత్, సమాచార తదితర 38 శాఖల అధికారులతో కమిషనర్ కార్తికేయన్ ఇటీవల సమగ్ర సమీక్ష నిర్వహించారు. శాఖలవారీగా జరిపిన ఈ సమావేశంలో సలహాలు, ఆదేశాలు ఇచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి.
ప్రజా పనులశాఖకు సంబంధించి వీరాంగల్ ఓడై, మనపాక్కం, కాల్వాయ్, కూవమ్, అడయారు చెరువు, అడయారు చెరువు అనుబంధ కాల్వల్లో ఇంకా పూడిక తీయని సంగతిని గుర్తించి వచ్చేనెల పదో తేదీలోగా పూర్తిచేయాలి. రహదారుల శాఖ పరిధిలో ఔట్‌లేని పారుదల కాల్వలను గుర్తించి వేగంగా పనులను పూర్తిచేయాలి. అలాగే కాల్వల్లో పూడికితీసి వాహనాల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా చూడాలి. గ్రేటర్ చెన్నై ట్రాన్స్‌పోర్టు కార్పొరేషన్ పరిధిలోని పాతబడిన బస్సుల్లో పగుళ్లు, రంధ్రాలకు మరమ్మతులు చేసి వర్షాలు, వరదలు సంభవించినా ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలి.
ఆవిన్ పాలపైనే ఆధారపడకుండా ప్రయివేటు సంస్థల ద్వారా పాలను కొనుగోలుచేసి తగిన స్థాయిలో పాల ప్యాకెట్లను నిల్వచేసుకోవాలి. కార్పొరేషన్ కమ్యూనిటీ హాళ్లను శుభ్రం చేసి అవసరమైన ప్రజలను ఉంచేందుకు వీలుగా సిద్ధంగా ఉంచాలి. జాతీయ విపత్తుల నివారణ, త్రివిధ దళాల సిబ్బందిని సమన్వయం చేసుకుంటూ ముంపు ప్రాంతాల్లో ప్రజల రక్షణకు తగిన ముందు జాగ్రత్తలతో ఉండాలి. పోలీస్, అగ్నిమాపక, విద్యుత్‌శాఖలతోపాటూ, తాగునీటి సరఫరా సమాచార విభాగం చెన్నై కార్పొరేషన్‌లోని కంట్రోలు రూముతో అనుసంధానమై ఎప్పటికప్పుడు సహాయక చర్యల్లో పాల్గొనాలి. వదలు సంభవిస్తే లోతట్టులో ఉండే టాన్స్‌ఫార్మర్లు నీటమునగకుండా ఎత్తు పెంచాలి.
సమాచార సంస్థలు తమ టవర్లు ఉన్నచోట్ల కనీసం ఏడు మీటర్ల దూరంలో జనరేటర్లను అమర్చుకుని ఎంతటి భారీ వర్షం వచ్చినా సమాచార వ్యవస్థ దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. మత్య్సశాఖ వారు పెద్ద సంఖ్యలో పడవలను సిద్ధం చేసుకోని, పడవల యజమానులు, మత్స్యకారుల పేర్లతో జాబితాను సిద్ధం చేసుకోవాలి. చెన్నై కార్పొరేషన్ విపత్తుల నివారణ, సహాయక చర్యలపై ముందుగానే ప్రణాళికను సిద్ధం చేసుకుని వాటి నకలును అన్ని శాఖలకు త్వరలో అందజేయడం. రుతుపవనాల తాకిడిని దీటుగా ఎదుర్కొనేందుకు అక్టోబరు 10వ తేదీలోగా పూర్తి చేయాలని కమిషనర్ కార్తికేయన్ ఆదేశించారు.
36 గంటల ముందు మాత్రమే ముప్పు అంచనా
ఇటీవల ముంబయిలో చోటుచేసుకున్నట్లుగా ఈ ఏడాది చెన్నైలో సైతం ఈశాన్య రుతుపవనాల ప్రభావం తీవ్రంగా ఉంటుందని, చెన్నై నగరం ముంపునకు గురవతుందని సామాజిక మాధ్యమాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ విషయమై చెన్నై కార్పొరేషన్ కమిషనర్ ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్న చెన్నై వాతావరణ కేంద్రం అధికారి ఒకరు మాట్లాడుతూ, ఈశాన్య రుతుపవనాలు సగటున 44 సెంటీమీటర్లు వరకు నమోదవుతుందని చెప్పారు. ఈ సగటు వర్షపాతం మాత్రమే ఈ ఏడాది కురిసే అవకాశం ఉన్నట్లు గణాంక వివరాలు తెలుపుతున్నాయని ఆయన అన్నారు.
నవంబరులో భారీ, అతి భారీ వర్షాలు పడుతాయని పెద్దగా నష్టం జరుగకపోవచ్చని తెలిపారు. 36 గంటల ముందుగా మాత్రమే వాతావరణ కేంద్రం కచ్చితమైన అంచనాలు వేయగలదని, రెండు, మూడు నెలల తరువాత వాతావరణంలో ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో చెప్పడం అసాధ్యమని అన్నారు. కాబట్టి సామాజిక మాధ్యమాల ద్వారా ప్రచారంలో ఉన్న వదంతులను ప్రజలు నమ్మరాదని, వాతావరణ కేంద్రం ద్వారా నిర్ధిష్టమైన సమాచారాన్ని వాతావరణ కేంద్రం ఎప్పటికప్పుడు బులిటెన్లు విడుదల చేస్తుందని ఆయన తెలియజేశారు.