తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి | Focus on the issue of water | Sakshi
Sakshi News home page

తాగునీటి సమస్యపై దృష్టి పెట్టండి

Published Sun, May 4 2014 3:33 AM | Last Updated on Mon, Oct 8 2018 3:17 PM

జిల్లాలో ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని, ఈ సమస్య పరిష్కారంలో రాజకీయాలు చేయకుండా...

బళ్లారి టౌన్, న్యూస్‌లైన్ : జిల్లాలో ఏ గ్రామంలోనూ తాగునీటి సమస్య తలెత్తకుండా అధికారులు దృష్టి సారించాలని, ఈ సమస్య పరిష్కారంలో రాజకీయాలు చేయకుండా ప్రత్యేక దృష్టి సారించి ఎప్పటికప్పుడు సమస్య పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ ఆదేశించారు. ఆయన శనివారం స్థానిక జిల్లా పంచాయతీ నజీర్ సభాంగణంలో తాగునీటి సమస్యపై ప్రత్యేకంగా అధికారులకు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ తాగునీటి సమస్య నెలకొన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.

తాగునీటి సరఫరా కోసం చేపట్టిన పనుల్లో ఎలాంటి జాప్యం, రాజకీయాలు చేయకుండా ఎక్కడ లోపాలున్నది అధికారులు పరిశీలించి వెంటనే చర్యలు చేపట్టాలని సూచించారు. పనుల్లో జాప్యం ఉన్న చోట తాత్కాలికంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. తాగునీటిని అందించడంలో నెలకొన్న విద్యుత్ సమస్యపై జెస్కాం అధికారులు కూడా ముందు జాగ్రత్త వహించాలన్నారు. ఎక్కడైనా ట్రాన్స్‌ఫార్మర్లు కాలిపోతే వెంటనే స్పందించాలని సూచించారు.

తాగునీటి సమస్య ఉద్భవించి ప్రజలు హాహాకారాలు చేస్తే దానికి అధికారులే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. బళ్లారిలో కూడా వారానికి రెండు సార్లు నీరు అందించేలా సిటీ కార్పొరేషన్, జలమండలి అధికారులు చర్యలు చేపట్టాలన్నారు. ఇప్పటికే అల్లీపురం, మోకా రిజర్వాయర్లకు నూతన పైప్‌లైన్ ద్వారా నీటిని సేకరించే ప్రక్రియ జరుగుతున్నందున నీటి సమస్య లేకుండా చూసుకోవాలన్నారు.

అధికారుల నిర్లక్ష్యం వల్ల ప్రజా ప్రతినిధులు ప్రజలచే చీవాట్లు తినాల్సి వస్తుందని గ్రహించాలన్నారు. నగరంలోని ఏ ప్రాంతంలోనూ విద్యుత్ కోత లేకుండా జెస్కాం అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టాలన్నారు. అనధికారికంగా ఎప్పుడూ కోత విధించరాదన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ సీఈఓ సలావుద్దీన్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
 
జూన్ నుంచి జనసంపర్క సమావేశాలు : జిల్లాలోని ఆయా గ్రామాల్లో నెలకొన్న సమస్యల గురించి ప్రజలు విన్నవించుకునేందుకు జూన్ నెల నుంచి ఆయా గ్రామ పంచాయతీ స్థాయిలో జనసంపర్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా ఇన్‌చార్జి మంత్రి పీటీ పరమేశ్వర్ నాయక్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతినిత్యం రెండు మూడు గ్రామాల్లో ఈ జనసంపర్క సమావేశాలు చేపడతామన్నారు.

జిల్లాలో ఫ్లోరైడ్ శాతం ఎక్కువగా ఉన్న 219 గ్రామాలలో మొదటి దశలో 102 గ్రామాలలో రక్షిత మంచినీటి సరఫరా కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. తాలూకాలోని జానెకుంటె, మారుతీ క్యాంపు, తిరుమలనగర్‌లలో రూ.2కు 20 లీటర్ల రక్షిత మంచినీటిని అందించే ప్రయోగాత్మక కార్యక్రమాన్ని చేపట్టామని, దీన్ని అన్ని గ్రామాలకు విస్తరించే ఆలోచన ఉన్నట్లు తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement