సాక్షి, ముంబై: బస్సు ప్రమాదాలను తగ్గించేందుకు ఎంఎస్‌ఆర్టీసీ చర్యలు తీసుకుంటోంది. ఈ మేరకు మరింత మెరుగైన బస్సులను అందుబాటులోకి తీసుకురావడమేకాక వాటిలో అన్ని బస్సుల్లోనూ గ్లోబల్ పొజిషన్ సిస్టం (జీపీఎస్)ను ఏర్పాటుచేయడానికి రవాణాశాఖ యోచిస్తోంది. ఇప్పుడున్న బస్సుల స్థానంలో అల్యూమినియమ్, మైల్డ్ స్టీల్, గాల్వనైజ్ స్టీల్‌ల కలయికతో రూపొందించిన బస్సులను వినియోగించనున్నారు. ఎంఎస్‌ఆర్టీసీకి సంబంధించి గత ఆరేళ్లలో 9,910 బస్సు ప్రమాదాలు జరిగాయి. నగర శివారు ప్రాంతాల వరకు సేవలందిస్తున్న బస్సులే ఎక్కువగా ప్రమాదాలకు గురవుతున్నాయి. ఈ పరిస్థితిని మెరుగుపరిచేందుకు రవాణా శాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.
కొత్త బస్సులను ప్రవేశపెట్టడమే కాక వాటిలో జీపీఎస్‌ను కూడా ఏర్పాటు చేయనున్నారు. బస్సుల్లో జీపీఎస్ వ్యవస్థను ఏర్పాటుచేయడం ద్వారా అవి ప్రయాణ సమయంలో ప్రమాదానికి లోనైన స్థలం వివరాలు వెంటనే తెలుసుకోవచ్చని ఒక అధికారి తెలిపారు. అయితే అన్ని బస్సుల్లో ఈ వ్యవస్థను అమర్చేందుకు చాలా సమయం పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. అలాగే, ప్రమాదాల నివారణకు డ్రైవర్లకు కూడా మరింత మెరుగైన శిక్షణ ఇవ్వనున్నట్లు ఆ అధికారి తెలిపారు. తాము ఇంతకుముందే 142 మంది డ్రైవర్లను శిక్షణ నిమిత్తం పంపించామని చెప్పారు.
నిటారుగా, వక్రంగా ఉన్న రోడ్లపై వాహనాలను ఎలా నడపాలన్న అంశంపై వారికి శిక్షణ అందిస్తున్నామన్నారు. వాహనాలను మితిమీరిన వేగంతో కాకుండా నెమ్మదిగా, ఇతర వాహనాలను ఓవర్‌టేక్ చేయకుండా నడపాలని డ్రైవర్లను సూచనలు, సలహాలు ఇస్తున్నామని చెప్పారు. ఓవర్ టేక్ చేసే సమయంలో వాహన గేర్‌ను మార్చడం ద్వారా ఇంధనం వృథా అవుతుంది కాబట్టి సాధ్యమైనంతమేరకు ఓవర్‌టేక్ చేద్దామనే ఆలోచనను వదిలేయాలని డ్రైవర్లకు చెబుతున్నామన్నారు.
ఎస్టీ బస్సు ప్రమాదాలు..
ఇదిలా వుండగా 2010-11 మధ్య కాలంలో 3,400 ఎస్టీ బస్సు ప్రమాదాలు జరుగగా, ఇందులో 445 మంది మరణించారు. 2,211 మంది తీవ్రంగా, 744 మందికి స్వల్పంగా గాయాలయ్యాయి. 2011-12 మధ్య కాలంలో 3,435 బస్సు ప్రమాదాలు జరుగగా, 445 మంది మరణించారు. 2,274 మందికి తీవ్రంగా గాయపడగా, 716 మంది స్వల్పంగా గాయాలతో బయటపడ్డారు. 2012-13 మధ్య కాలంలో 3,075 ఎస్టీ బస్సు ప్రమాదాలు జరగ్గా 369 మంది మరణించారు. 2,110 మంది తీవ్రంగా, 596 మంది స్పల్పంగా గాయపడ్డారు.
ఆర్టీసీ బస్సులో జీపీఎస్
Published Sat, Jan 4 2014 10:50 PM | Last Updated on Sat, Sep 29 2018 5:26 PM
Advertisement
Advertisement