న్యూఢిల్లీ: షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్‌లను ఒకేసారి కొంటే లక్ష రూపాయాలు... కేవలం షారుఖ్ మాత్రమే కావాలన్నా లేదంటే కేవలం సల్మాన్ మాత్రమే కావాలన్నా రూ. 60,000! .... మున్నాభాయ్ చెబుతున్న మాటలను వింటున్న అక్కడివారు కాసింత తగ్గించమని కోరుతున్నారు. యాభైవేల రూపాయలిస్తాం.. షారుఖ్‌ను మాకిచ్చేయండని అడుగుతున్నారు. మరికొందరు ఎక్కావన్ హజార్(51,000) ఇస్తాం మాకు సల్మాన్‌ను ఇవ్వండని బతిమాలుతున్నారు. అయితే మున్నాభాయ్ మాత్రం రూపాయి తగ్గేది లేదని చెబుతున్నాడు.
... మున్నాభాయ్ ఒక్కడే కాదు జామా మసీదు చుట్టుపక్కల చాలామంది వ్యాపారులు ‘బాలీవుడ్ స్టార్ల’ను అమ్మకానికి పెట్టారు. అక్షయ్‌కుమార్, రణ్‌బీర్ కపూర్, కరీనా, కత్రినా, ప్రియాంక, దీపికా కూడా అమ్మకానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఈ పేర్లు విని కొనుక్కునేందుకు జామామసీదుకు పరిగెడితే మీరంతా పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే షారుఖ్, సల్మాన్, అక్షయ్, రణ్‌బీర్ ఇవన్నీ వ్యాపారులు విక్రయానికి సిద్ధంగా ఉంచిన మేకల పేర్లు.
బక్రీద్ కోసమే...
జామామసీదు చుట్టుపక్కల ఉన్న పరిసరాలన్నీ మేకలతో నిండిపోయాయి. బక్రీద్ కోసం వీటిని అమ్మకానికి సిద్ధంగా ఉంచారు. మీనాబజార్, బక్రా మండీ తదితర ప్రాంతాల్లో దాదాపు వారం రోజుల నుంచి ఈ సందడి కనిపిస్తోంది. లక్షల సంఖ్యలో మేకలు ఇప్పటికే అమ్ముడు పోయాయి కూడా. ఉత్తరప్రదేశ్, మేవత్, మొరాదాబాద్, పంజాబ్, రాజస్థాన్ తదితర ప్రాంతాల నుంచి మేకలను తీసుకొచ్చి ఇక్కడ విక్రయానికి ఉంచారు. దాదాపు పదిరోజుల కిందటే వీటిని ఇక్కడికి తీసుకొచ్చినా బక్రీద్ సమీపించాక విక్రయిస్తే ధర ఎక్కువగా పలుకుతుందనే ఉద్దేశంతో వ్యాపారులు వాటిని కొన్నిరోజులపాటు బక్రా మండీలో ఉంచారు. సోమవారం బక్రీద్ కావడంతో శని, ఆదివారాల నుంచి అసలు సిసలైన మేకలను బయటకు తెస్తున్నారు.
ఆకట్టుకుంటున్న అమ్మకాలు...
తమ మేకలకు మంచి ధర పలికేందుకు ఇక్కడి వ్యాపారులు రకరకాల వ్యాపార చిట్కాలు ఉపయోగిస్తున్నారు. కొన్నింటికి సినిమా స్టార్ల పేర్లను పెడితే మరికొన్నింటికి పండ్లలోని రకాల పేర్లను పెడుతున్నారు. తోతాపరీ, మల్గోబా పేర్లతో వాటిని పిలుస్తూ కొనుగోలుదారులను ఆకట్టుకుంటున్నారు. ఎనిమిది దంతాల పంజాబీ మేక లక్షన్నర పలుకుతుండగా ఇండోర్ నుంచి తీసుకొచ్చిన నాలుగు మేకల గుంపు మొత్తాన్ని రూ. 2 లక్షలకు అమ్మకానికి పెట్టాడు. ఇక అజ్మీర్ నుంచి తీసుకొచ్చిన మేక ఏకంగా మూడున్నర లక్షలు పలికింది. అందుకు కారణం ఈ మేక బరువు 100 కిలోలకు పైగా ఉండడమే. చూడ్డానికి బలిష్టంగా, ఆకట్టుకునేలా ఉండడంతో కొనుగోలుదారులు కూడా ఎంతైనా చెల్లించేందుకు వెనుకాడడంలేదు. రోజుకు కిలో తెల్ల శనగలు, ఓ లీటర్ పాలు, రకరకాల కూరగాయలు, ఆకుకూరలను తినిపిస్తామని, ఎటువంటి రసాయనాలు కలవని ఆహార పదార్థాలను తినిపించడం వల్లే ఆరోగ్యంగా, బలిష్టంగా ఉంటాయని అమ్మకందారులు చెబుతున్నారు.
మార్కెట్‌కు కొత్తకళ...
అందమైన రంగురంగుల మేకలు మార్కెట్‌కు తరలిరావడంతో జామా మసీదు ప్రాంతానికి కొత్త కళ వచ్చింది. మేకలను విక్రయించేందుకు ఏర్పాటు చేసిన షామియానాలతో ఈ ప్రాంతమంతా సందడిసందడిగా కనిపిస్తోంది. రాత్రిపూట షామియానాల్లో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలతో పండుగ వాతావరణం కనిపిస్తోంది. చిన్న చిన్న గుడారాలు, అందులో రంగురంగు విద్యుత్ దీపాలు చూస్తుంటే ఏదో జాతర జరుగుతోందా? అన్న అనుభూతి కలుగుతోంది.
షారుఖ్, సల్మాన్ @ 1,00,000
Published Sun, Oct 5 2014 10:13 PM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement
Advertisement