చెన్నై : చెన్నై విమానాశ్రయంలో శనివారం ఉదయం, శుక్రవారం రాత్రి జరిపిన తనిఖీల్లో అధికారులు రూ.50 లక్షల బంగారం స్వాధీనం చేసుకుని ఇద్దరిని అరెస్టు చేశారు. అబుదాబి నుంచి శనివారం చెన్నై విమానాశ్రయానికి ఒక విమానం వచ్చింది. ఈ విమానం నుంచి దిగిన ప్రయాణికులను కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా కేరళకు చెందిన సమీర్ అనే వ్యక్తికి చెందిన సూట్‌కేసులో కిలో బంగారు కడ్డీలు ఉన్నట్టు గుర్తించారు.
ఈ బంగారం విలువ రూ.30 లక్షలు చేస్తుంది. దీంతో బంగారాన్ని స్వాధీనం చేసుకుని సమీర్‌ను అరెస్టు చేశారు. అలాగే కౌలాలంపూర్ నుంచి శుక్రవారం అర్ధరాత్రి చెన్నై విమానాశ్రయానికి వచ్చిన విమానంలో దిగిన ప్రయాణికులు, కస్టమ్స్ అధికారులు తనిఖీ చేస్తుండగా రామన్ (30) అనే వ్యక్తికి చెందిన బ్యాగులో 600 గ్రాములు కలిగిన ఆరు బంగారు బిస్కెట్లను అక్రమంగా తీసుకొస్తున్నట్టు తెలిసింది. దీంతో అధికారులు ఆరు బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకుని రామన్‌ను అరెస్టు చేశారు. స్వాధీనం చేసుకున్న బంగారం విలువ రూ.18 లక్షలు చేస్తుంది.