చెన్నై, సాక్షి ప్రతినిధి:తమిళనాడు ప్రభుత్వం ద్వారా అందుతున్న వైద్యసేవలు భేషుగ్గా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వైద్యశాఖామంత్రి కామినేని శ్రీనివాస్ కొనియాడారు. ఈ రాష్ట్రంలోని వైద్యసేవలను ఏపీలో ప్రవేశపెట్టేందుకు ప్రయత్నిస్తామని ఆయన చెప్పారు. ప్రభుత్వ ఆసుపత్రుల పరిశీలన కోసం మంగళవారం చెన్నైకి వచ్చిన కామినేని నగరంలోని ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ, రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రి (జీహెచ్)లను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వపరంగా ఇంతటి ఉన్నత స్థాయిలో వైద్యసేవలు అందించడం సాధ్యమా అని ఆశ్చర్యపడే రీతిలో తమిళనాడు ఆసుపత్రులు పనిచేస్తున్నాయని చెప్పారు.
ఆసుపత్రుల్లో పారిశుధ్యం కూడా చక్కగా ఉందని అన్నారు. వైద్యసేవల పరంగా గుజరాత్‌లో కూడా సందర్శించానని, అక్కడి మెడికల్ కాలేజీల పనితీరు గొప్పగా ఉందని చెప్పారు. మంచి ఏరాష్ట్రంలో ఉన్నా ఏపీలో అమలుచేసేందుకు సిద్దంగా ఉన్నామని, పొరుగు రాష్ట్రాల నుండి అనుకరణలో తమకు ఎటువంటి భేషజాలు లేవని అన్నారు. తెలంగాణ విభజన వల్ల ఆరోగ్యశాఖాపరంగా ఏపీ తీవ్రస్థాయిలో వెనుకబడి పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాజీవ్ ఆరోగ్యశ్రీ వల్ల పేదలకు కార్పొరేట్ వైద్యం అందుబాటులోకి వచ్చినా ప్రాధమిక ఆరోగ్యకేంద్రాలు (పీహెచ్‌సీ) నిర్లక్ష్యానికి గురైనాయని విమర్శించారు. అన్నిరకాల వైద్యసేవలు హైదరాబాద్‌లో కేంద్రీకృతమై అవస్థలు పడాల్సి వస్తోందని చెప్పారు. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ఏపీలో అనేక సంస్కరణలను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు. గత ఏడాది బడ్జెట్‌లో వైద్యశాఖకు రూ.4,400 కోట్లు కేటాయించగా, ఈఏడాది రూ.5,700 కోట్లకు పెంచామని చెప్పారు. చంద్రబాబు నాయుడు ఒక ముఖ్యమంత్రిగా కాక వ్యక్తిగా ఆరోగ్యశాఖ కోసం పాటుపడుతున్నారని అన్నారు.
చెన్నైలో కామినేని ః
మంగళవారం ఉదయం చెన్నైకి చేరుకున్న ఏపీ వైద్యమంత్రి కామినేని శ్రీనివాస్ ఉదయం 11.30 గంటలకు తమిళనాడు గవర్నర్ కే రోశయ్యను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అనంతరం సాయంత్రం 4.30 గంటలకు తమిళనాడు ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలోని అనేక విభాగాలను సందర్శించారు. రోగుల వార్డు, పౌష్టికాహార తయారీ విభాగం, అత్యాధునిక యంత్రాల పనితీరు, ఒక రోగికి శస్త్రచికిత్స జరుగుతున్న దృశ్యాన్ని తిలకించారు. తమిళనాడు ప్రభుత్వ పరంగా జరుగుతున్న వైద్యసేవలు, సిబ్బంది, భవన సదుపాయ వివరాలను పవర్‌పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా తెలుసుకున్నారు. అక్కడి నుండి సెంట్రల్ ఎదురుగా ఉన్న రాజీవ్‌గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో మరో అరగంటపాటు గడిపారు. తమిళనాడు వైద్యశాఖా మంత్రి సి విజయభాస్కర్, వైద్యకార్యదర్శి జే రాధాకృష్ణన్ తదితర వైద్యాధికారులు మంత్రి కామినేనికి స్వాగతం పలికి ఆయన వెంట పర్యటించారు.
తమిళనాడు భేష్
Published Wed, May 6 2015 2:16 AM | Last Updated on Tue, Oct 9 2018 7:52 PM
Advertisement
Advertisement