
19న మెడిటెక్‌కు భూమి పూజ
సాక్షి, న్యూఢిల్లీ: విశాఖపట్నంలో ఈ నెల 19న మెడికల్ ఎక్విప్‌మెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్క్(మెడిటెక్)కు భూమి పూజ చేయనున్నట్టు మంత్రి కామినేని శ్రీనివాస్ తెలిపారు. దేశంలో ఇలాంటి పార్క్‌ను ఏర్పాటు చేయనుండడం ఇదే మొదటిసారని ఆయన చెప్పారు. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రులను ఆహ్వానించడానికి కామినేని బుధవారం ఢిల్లీ వచ్చారు.
ఈ సందర్భంగా కేంద్ర మంత్రి సుజనాచౌదరి నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భూమి పూజకు కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అనంత్ కుమార్, సురేష్‌ప్రభు, నిర్మలా సీతారామన్, సుజనా చౌదరీ తదితరులను ఆహ్వానించినట్టు తెలిపారు. పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వ ఫార్మా, కెమికల్ అండ్ ఫర్టిలైజర్ శాఖ రూ. 75 కోట్లు, వాణిజ్య మంత్రిత్వ శాఖ రూ. 50 కోట్లు, ఎలక్ట్రానిక్ అండ్ టెలీ కమ్యూనికేషన్ శాఖ రూ. 50 కోట్ల సాయం అందించనున్నట్టు చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం 275 ఎకరాల స్థలాన్ని కేటాయించిందని, రూ. 50 కోట్లు వెచ్చించి మౌలిక సదుపాయాలు కల్పించనున్నట్టు తెలిపారు. ఈ పార్క్ పూర్తయితే 25 వేల మంది ఉద్యోగావకాశాలు లభిస్తాయన్నారు. మొదటి విడతగా ఏడాదిలోపు 38 సంస్థలు ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయడానికి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నట్టు తెలిపారు. సెప్టెంబర్ చివరి నాటికి నీట్ కౌన్సెలింగ్‌ను కూడా పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. సీట్లు విత్‌డ్రా చేసుకోవడానికి ఒక తేదీని ప్రకటిస్తామని, ఆ తరువాత విత్‌డ్రాకు అనుమతించమని ఆయన స్పష్టం చేశారు.