సౌర ఆదాయం
- సౌర విద్యుత్ కొనుగోలుకు ప్రభుత్వం సిద్ధం
- యూనిట్ విద్యుత్ కొనుగోలు ధర గరిష్టంగా రూ.9.56
- ఇళ్లపై సోలార్ ప్యానల్ ఏర్పాటు చేసుకున్న వారికి ప్రాధాన్యత
- రెండు వారాల్లో దరఖాస్తుల స్వీకరణకు శ్రీకారం
- తొలుత బెస్కాం పరిధిలో... తర్వాత రాష్ట్రవ్యాప్తంగా
సాక్షి, బెంగళూరు : సౌర, పవన విద్యుత్ వంటి సంప్రదాయేతర ఇంధన ఉత్పత్తి, వినియోగాన్ని పెంచే చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం మరో అడుగు ముందుకు వేసింది. ప్రస్తుతం చిన్నచిన్న పరిశ్రమలతో పాటు వ్యక్తిగతంగా సోలార్ ప్లాంట్‌లను ఏర్పాటు చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం అనుమతిస్తోంది.
ఈ ప్లాంట్‌లను ఎవరైనా వారివారి ఇంటి పైకప్పులపై ఏర్పాటు చేసుకోవచ్చు. సోలార్ రూఫ్ టాప్ పవర్ జనరేషన్ (ఎస్‌ఆర్‌టీపీజీ)గా పిలిచే ఈ పథకానికి ఆయా ప్రాంతాలను అనుసరించి ప్రభుత్వం సబ్సిడీలను కూడా అందిస్తోంది. అయితే ఇలా ఉత్పత్తి అయిన విద్యుత్‌ను ఇప్పటి వరకూ వ్యక్తిగత, పరిశ్రమల అవసరాలకు మాత్రమే వినియోగించుకోవడానికి అవకాశం ఉండేది.
ఈ నిబంధనలను సడలిస్తూ గ్రిడ్‌లకు అమ్ముకోవడానికి అవకాశం కల్పించనుంది. పెలైట్ ప్రతిపాదికన మొదట బెంగళూరు ఎలెక్ట్రిసిటీ సప్లై కంపెనీ (బెస్కాం) పరిధిలో అమలు చేసి ఫలితాలను అనుసరించి రాష్ట్రంలోని మిగిలిన విద్యుత్ సరఫరా కంపెనీలకు ఈ సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం ఇప్పటికే బెస్కాంలో ఒక్కొక్క బృందంలో ఆరుగురు సభ్యులు గల ప్రమోషన్‌సెల్, టెక్నికల్ సెల్ పేరిట రెండు ప్రత్యేక విభాగాలు ఏర్పాటయ్యాయి.
ఇందులో మొదటి బృందం పథకం ప్రాచుర్యం కోసం కృషి చేయడంతో పాటు దరఖాస్తులను ఎస్‌ఆర్‌టీపీజీకు పంపిస్తుంది. మరో బృందం ఔత్సాహికులకు సాంకేతిక సహకారం అందిస్తుంది. సబ్సిడీయేతర ఎస్‌ఆర్‌టీపీజీ ద్వారా ఉత్పత్తి అయిన ఒక యూనిట్ విద్యుత్‌కు రూ.9.56లను... సబ్సిడీ పద్దతిలో ఏర్పాటైన ఎస్‌ఆర్‌టీపీజీ ద్వారా ఉత్పత్తి అయిన యూనిట్ విద్యుత్‌కు రూ.7.20లను బెస్కాం చెల్లించనుంది.
ఈ విషయమై బెస్కాం ఎండీ పంకజ్‌కుమార్ పాండే మాట్లాడుతూ... మైక్రోజనరేటర్స్‌తోపాటు సాధారణ ప్రజల నుంచి సౌరవిద్యుత్ కొనుగోలుకు కర్ణాటక ఎలెక్ట్రిసిటీ రెగులేటరీ కమిషన్ అనుమతించింది. మరో రెండు వారాల్లో ఔత్సాహికుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తాం. ప్రజల నుంచి ఉత్తమ ప్రతిస్పందన వస్తుందని ఆశిస్తున్నాం.’ అని పేర్కొన్నారు.