ఆన్‌లైన్ అర్జీ
నెట్ ద్వారా ఫిర్యాదు చేసుకునే అవకాశం
ప్రతి సమస్యకూ ప్రత్యేక నంబర్ కేటాయింపు
అధికారుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ కృషి
ఇక నుంచి గ్రీవెన్స్ మరింత సరళతరం కానుంది. కార్యాలయాలకు వెళ్లకుండా ఇంటర్నెట్ ద్వారా ఇంటి నుంచే ఫిర్యాదు చేసుకోవచ్చు. సమస్య పరిష్కార స్థితిని పరిశీలించుకోవచ్చు. నేరుగా, ఆన్ లైన్ ద్వారా అందిన ప్రతి అర్జీని కంప్యూటరీకరించి 15 రోజుల్లో సమస్యకు సంబంధించిన ప్రగతిపై సెల్‌కు మెసేజ్ పంపించనున్నారు. ఇప్పటికే జిల్లా కేంద్రంతోపాటు మధిర, కల్లూరులో గ్రీవెన్స్ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
ఖమ్మం సహకారనగర్ : ఇప్పటివరకు ఏదైనా ఫిర్యాదు చేయాలంటే జిల్లా కేంద్రమైన ఖమ్మానికి రావాలి. ప్రజావాణిని ప్రజలకు మరింత చేరువ చేయాలని జిల్లా అధికార యంత్రాంగం సంకల్పించింది. ప్రజలకు వ్యయప్రయాసాలు తగ్గించాలనే భావనతో జిల్లా కలెక్టర్ మొదటి, నాలుగో సోమవారం ఖమ్మంలో, 2వ సోమవారం కల్లూరు, 3వ సోమవారం మధిరలో ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వారం వరకు ప్రజలు వేచి చూడకుండా ఉండటంతో పాటు ఖమ్మంలో జరిగే ప్రజావాణికి రాకుండా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసుకునే వెసులుబాటు కల్పించారు. ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్ కలిగిన వారు ఇంట్లో ఉండైనా శాఖల వారీగా ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉంది. ఈ మేరకు ప్రజలు cpframr.tr.in.ac.in సైట్‌లోకి వెళ్లి మన జిల్లా, ఫిర్యాదుకు సంబంధించిన శాఖ వివరాలతో పాటు ఫిర్యాదు చేసే వివరాలు నింపి సబ్‌మిట్ చేస్తే ఆ ఫిర్యాదుకు ఓ ప్రత్యేక నంబర్‌వస్తుంది. ఉద్యోగుల్లో జవాబుదారీతనం పెంచేందుకు కలెక్టర్ ఈ సంస్కరణలు చేపట్టారు. ఈ క్రమంలో కలెక్టరేట్, జిల్లా పరిషత్‌కు వచ్చే వారికి ప్రజావాణిపై అధికారులు విస్తృత ప్రచారం నిర్వహిస్తున్నారు.
అన్ని శాఖలకూ అనుసంధానం
జిల్లాలో ప్రస్తుతం ఉన్న అన్ని శాఖలకు ప్రజావాణిని అనుసంధానం చేశారు. ప్రజావాణిలో ఫిర్యాదు చేసిన ప్రతి ఒక్కటి ఆయా శాఖలకు ప్రజావాణి సిబ్బంది పంపిస్తుంటారు. ఆ శాఖాధికారులు ఆ సమస్యలను పరిష్కరిస్తారు. ప్రస్తుతం సమస్య పరిష్కారానికి సంబంధించిన అంశాలను కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో లేదంటే ఆయా శాఖల కార్యాలయాల్లో మాత్రమే చూసుకునే వీలుంది. ఫిర్యాదుకు కేటాయించి నంబర్ ద్వారా సమస్య పరిష్కార ప్రగతిని బాధితులు కార్యాలయాలకు రాకుండానే ఇంటర్నెట్ ద్వారా తెలుసుకోవచ్చు. పైన తెలిపిన సైట్‌లోకి వెళ్లి కేటాయించిన నంబర్‌ను ఎంటర్ చేస్తే సమస్య పరిష్కారం ఏ దశలో ఉందో చూపిస్తుంది.
త్వరలో ఎస్‌ఎంఎస్ అలర్ట్
ప్రజావాణిలో నేరుగా లేదా ఆన్ లైన్ లో ఫిర్యాదు చేసే వారికి ఎస్‌ఎంఎస్ పంపనున్నారు. ఫిర్యాదు పరిష్కారమయ్యాక మరో ఎస్‌ఎంఎస్, పరిష్కారం కాకపోయినా ఫిర్యాదుదారుడికి సమాచారాన్ని అందించేందుకు ఎస్‌ఎంఎస్ పంపనున్నారు. ఎస్‌ఎంఎస్ అలర్ట్‌పై బీఎస్‌ఎన్ఎల్ అధికారులకు లేఖ రాసినట్లు అధికారవర్గాలు తెలిపాయి.