సాక్షి, ముంబై: గిర్గావ్ (చర్నిరోడ్) చౌపాటి వద్ద అరేబియా సముద్రంలో ప్రతిపాదిత అంతర్జాతీయ ఛత్రపతి శివాజీ స్మారకం నిర్మాణానికి మార్గం సుగమమైంది. అందుకు సంబంధించిన సర్క్యులర్‌ను కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి జారీ చేసింది. వచ్చే నెలలో ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ స్మారకానికి భూమిపూజ చేయించాలని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఆధ్వర్యంలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయడంలో సామాన్య పరిపాలన విభాగం నిమగ్నమైంది. అరేబియా సముద్రంలో శివాజీ స్మారకాన్ని నిర్మించాలని 2001లో ప్రతిపాదించారు.
2004లో అప్పటి కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఈ స్మారకాన్ని నిర్మించాలని నిర్ణయం తీసుకుంది. కాని అందుకు వివిధ శాఖల నుంచి అవసరమైన అనుమతులు లభించలేకపోయాయి. 2004, 2009, 2014లో జరిగిన లోక్‌సభ, శాసన సభ ఎన్నికల మేనిఫెస్టోలో కూడా స్మారకం విషయాన్ని పొందుపర్చాయి. కాని గత పదేళ్ల నుంచి కేంద్ర పర్యావరణ శాఖ, సీఆర్‌జెడ్ అనుమతుల వలయంలో చిక్కుకుంది.
కాని గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో, ఇటీవల జరిగిన శాసన సభ ఎన్నికలో అటు కేంద్రంలో ఇటు రాష్ట్రంలో బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి రావడంతో స్మారకం నిర్మాణానికి అవసరమైన అనుమతులన్నీ లభిస్తున్నాయని సాధారణ పరిపాలన విభాగం స్పష్టం చేసింది. రాజ్ భవన్‌కు 1.2 కి.మీ. దూరంలో చర్నిరోడ్ చౌపాటివద్ద తీరం నుంచి మూడు కి.మీ. దూరంలో సముద్రంలో అంతర్జాతీయ స్థాయిలో శివాజీ స్మారకాన్ని నిర్మించనున్నారు. 190 మీటర్ల ఎత్తులో అశ్వాన్ని అధిరోహించిన శివాజీ భారీ విగ్రహం, అక్కడ శివాజీ జీవిత చరిత్రకు సంబంధించిన వివరాలు, మ్యూజియం, ప్రపంచంలోనే అత్యంత పెద్ద మత్స్యాలయం (ఫిష్ ఆక్వేరియం) ఇలా అనేక ప్రత్యేకతలు ఉంటాయి.
శివాజీ స్మారకానికి రూట్ క్లియర్
Published Wed, Jan 7 2015 10:34 PM | Last Updated on Sat, Sep 2 2017 7:21 PM
Advertisement
Advertisement