కీబోర్డుతో గిన్నిస్ రికార్డు
బెంగళూరు(బనశంకరి) : వీణావాణి సంగీత పాఠశాల వార్షికోత్సవం సందర్భంగా 400 మందికి పైగా కీబోర్డ్ వాయించడం ద్వారా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు. ఆదివారం బనశంకరి రెండో స్టేజ్‌లో ఉన్న శ్రీ వీణావాణి సంగీత పాఠశాల 41 వ వార్షికోత్సవం సందర్భంగా 400 మందికి పైగా విద్యార్ధులు ఒకేసారి కీబోర్డు వాయించడం ద్వారా గిన్నిస్ రికార్డుల్లో చేరారు. ఇది లోకాయుక్త న్యాయమూర్తి సంతోష్ హెగ్డే సమక్షంలో సాగింది. 1974 లో విద్వాన్ సంపత్‌కుమార్‌శర్మ నేతృత్వంలో వీణావాణి సంగీత పాఠశాల ఏర్పాటైంది. గత 15 ఏళ్లుగా గిరీశ్‌కుమార్ సారథ్యంలో వివిధ వినూత్న కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అందులో ఆదివారం 400 మందికి పైగా విద్యార్థులతో కీబోర్డు వాయించే కార్యక్రమం ఒకటిగా ఉంది.
ఈ సంస్థ నుంచి ఇప్పటివరకు 12 వేలకు పైగా విద్యార్థులు సంగీత విద్యను అభ్యసించారు. 2011లో 126మంది సంగీత కళాకారులతో ఒకేసారి వాయిద్యగోష్టి నిర్వహించడం ప్రథమంగా గిన్నిస్ రికార్డుల్లోకి చేరారు. అంతేగాక ఈ కార్యక్రమాన్ని అమెరికాలోని కాలిఫోర్నియాలో నిర్వహించిన కార్యక్రమంలో 175 మంది వాయిద్య కళాకారులతో వాయిద్యగోష్టి నిర్వహించడం విశేషం. 2014లో 229 మంది విద్యార్థులతో చెన్నైలో ఈ వాయిద్యగోష్టి నిర్వహించారు. వీణావాణి సంగీత పాఠశాల విద్యార్థులు ఈ మూడు రికార్డులను నెలకొల్పి గిన్నిస్ రికార్డుల్లో గుర్తింపు పొందారు. ఈ కార్యక్రమంలో బాలకృష్ణగురూజీ, ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవీంద్ర ప్రసాద్, ఉదయగరుడాచార్ తదితరులు పాల్గొన్నారు.