కలి‘విడి’గా హర్షవర్ధన్, గోయల్
Published Thu, Oct 24 2013 10:34 PM | Last Updated on Fri, Mar 29 2019 9:18 PM
సాక్షి, న్యూఢిల్లీ: విధానసభ ఎన్నికల్లో బీజేపీ సీఎం అభ్యర్థిగా డాక్టర్ హర్షవర్ధన్‌ను నియమించిన తర్వాత తొలిసారిగా నిర్విహ ంచిన విలేకరుల సమావేశంలో గోయల్, హర్షవర్ధన్ కలి‘విడి’గా కనిపిం చారు. అంతర్గత కలహాల కారణంగానే సీఎం అభ్యర్థిత్వాన్ని పోగొట్టుకున్నానని భావిస్తున్న గోయల్... మరోసారి తనకు ఆ పేరు రాకుండా చూసుకునే ప్రయత్నం చేస్తున్నారు. హర్షవర్ధన్‌కి గోయల్ సహకరించడని, బీజేపీలో అంతర్గత కుమ్ములాటలు పెరగడం ఖాయమంటూ మీడియాలో వస్తున్న వార్తలను కొట్టిపారేసేందుకు వారిరువురూ ఎంతో సన్నిహితంగా మెలిగారు.
సమావేశం అనంతరం భోజన సమయంలోనూ ఇద్దరూ కలసి మీడియాతో మాట్లాడారు. ఒక దశలో మీడియా అంతా హర్షవర్ధన్ వెంటే తిరుగుతుండడంతో గోయల్...మొదట కాసేపు విజయేంద్రగుప్తాతో కలసి పక్కన కూర్చున్నారు. అనంతరం కొన్నిమీడియా చానళ్లకు కలసి ఇంటర్వ్యూలు ఇచ్చారు. అంతర్గత కలహాలపై మీడియా పదేపదే ప్రశ్నలు సంధించడంతో ఒకింత అసహనానికి గురైన గోయల్... అక్కడి నుంచి వెళ్లిపోయే ప్రయత్నం చేశారు. అధినాయకత్వం ఆదేశాల మేరకు అంతర్గత కలహాలు బయటపడకుండా ఇద్దరు నాయకులు ప్రయత్నిస్తున్నారని ఆ పార్టీ నాయకుడొకరు తెలిపారు.
గోయల్‌పై గడ్కరీ ప్రశంసల జల్లు
సీఎం అభ్యర్థిగా డా.హర్షవర్ధన్ పేరును ప్రకటిస్తూ పార్టీ పార్లమెంటరీ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని బీజేపీ ఢిల్లీ ప్రదేశ్ అధ్యక్షుడు విజయ్‌గోయల్ స్వాగతించడాన్ని పార్టీ ఎన్నికల ఇన్‌చార్జి గడ్కరీ ప్రత్యేకంగా అభినందించారు. క్రమశిక్షణ కలిగిన నాయకుడిగా గోయల్ తన ప్రతిష్టను మరింత పెంచుకున్నారంటూ పొగడ్తలతో ముంచెత్తారు. పార్టీ అధ్యక్షుడిగా విజయ్‌గోయల్ నియమితులైనప్పటి నుంచి పార్టీ బలోపేతానికి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారన్నారు.
తొమ్మిది నెలల్లో పార్టీ శ్రేణులను నగరవాసులకు మరింత చేరువయ్యేలా చేశారని అన్నారు. నగరంలో ఇటీవల నరేంద్రమోడీ నిర్వహించిన విశాల్ ర్యాలీ విజయవంతం కావడంలోనూ విజయ్ గోయల్ పాత్ర ఎంతో ఉందంటూ కితాబిచ్చారు. కాగా ఢిల్లీ విధానసభ ఎన్నికల ఇన్‌చార్జిగా ఉన్న గడ్కరీ.... అటు హర్షవర్ధన్‌ను సమర్థిస్తూనే, గోయల్‌ను పొగడ్తలతో ముంచెత్తుతూ ఎన్నికల్లో పార్టీకి నష్టం కలగకుండా చూసేందుకు తాను నిర్వహించనున్న పాత్రను ఈ సందర్భంగా స్పష్టం వివరిం చారు.
Advertisement
Advertisement