లింగాపై స్టే కుదరదు
లింగా చిత్రాన్ని ఈ నెల 12న విడుదల చేసే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. అదే సమయంలో ఆ చిత్రంపై ఫిర్యాదుల పరంపర కొనసాగుతూనే ఉంది. తాజాగా మరో ఫిర్యాదు చెన్నై హైకోర్టులో విచారణకు వచ్చింది. బాలాజీ స్టూడియో ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లింగా చిత్రానికి వ్యతిరేకంగా హైకోర్టులో ఒక పిటీషన్ దాఖలు చేసింది. అందులో ఆ సంస్థ నిర్వాహకులు పేర్కొంటూ తాము తెలుగులో చిరంజీవి, సోనాలిబింద్రే నటించిన ఇంద్ర చిత్రం తమిళ రీమేక్ హక్కులు పొందామని వెల్లడించారు. ఈ చిత్ర కథ రజనీకాంత్ నటించిన లింగా చిత్ర కథ ఒకేలా ఉన్నాయని తెలిపారు. ఇంద్ర ఇతివృత్తంతోనే లింగా చిత్రాన్ని రూపొందించారని పేర్కొన్నారు. లింగా చిత్రం విడుదలైతే తాము తీవ్రంగా నష్టపోతామని కాబట్టి ఆ చిత్ర విడుదలపై తాత్కాలిక నిషేధం విధించాలని కోరారు.
అదే విధంగా ఒక లా కమిషన్ ఏర్పాటు చేసి లింగా చిత్రాన్ని ఇంద్ర చిత్రాన్ని చూసి కథ గురించి నిర్ణయం వెల్లడించేలా ఆదేశించాలని కోరారు. ఈ కేసు మంగళవారం న్యాయమూర్తి ఆర్.సుబ్బయ్య సమక్షంలో విచారణకు వచ్చింది. ఈ కేసులో లింగా చిత్ర దర్శకుడు కె ఎస్ రవికుమార్ ఒక పిటిషన్ దాఖలు చేశారు. అందులో ఆయన పేర్కొంటూ లింగా చిత్రానికి తాను దర్శకుడిని మాత్రమేనని వివరించారు. అయినా లింగా చిత్ర కథకు, తెలుగు చిత్రం ఇంద్ర కథకు సంబంధం లేదన్నారు. భారతదేశం లోని డ్యామ్‌ల ఇతివృత్తాన్ని తీసుకుని కథ, కథనాలను తయారు చేసుకునే హక్కు అందరికీ ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాకుండా పిటిషన్‌దారుడి ఉద్దేశం చూస్తుంటే లింగా చిత్రానికి సంబంధించిన వారందరినీ బెదిరించేలా ఉందని ఆరోపించారు. ఇరుతరపు వాదనలు విన్న న్యాయమూర్తి లింగా చిత్రంపై తాత్కాలిక నిషేధం విధంచడం కుదరదని వెల్లడిస్తూ కేసు విచారణ ఈ నెల 12కు వాయిదా వేశారు.