- సెలూన్‌లో నరికేసిన ప్రత్యర్థులు
- కేఆర్ పురంలో ఉద్రిక్తత
- అదనపు బలగాలు మొహరింపు మేయర్ ధర్నా
బెంగళూరు, న్యూస్‌లైన్: బెంగళూరు నగరంలో మళ్లీ పాతకక్షలు భగ్గుమన్నాయి. పట్టపగలు రద్దీగా ఉండే ప్రాంతంతో బీజేపీ నాయకుడిని కిరాతకంగా నరికివేశారు. ఇక్కడి కేఆర్ పురంలోని దేవసంద్ర కార్పొరేటర్ మంజుల భర్త శిరిపురం శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ (44) హత్యకు గురయ్యాడు. శ్రీనివాస్ గత బీబీఎంపీ ఎన్నికల్లో ఆయన భార్యకు బీజేపీ టిక్కెట్ ఇప్పించి దేవసంద్ర వార్డు నుంచి కార్పొరేటర్‌గా గెలిపించుకున్నాడు. శ్రీనివాస్ భార్య మంజుల, కుమారుడు సాయి ధనుష్ (14), కుమార్తె మేఘనా (12)తో కలిసి పాత కేఆర్ పురంలోని న్యూ ఎక్స్‌టెన్షన్ రోడ్డులో నివాసం ఉంటున్నాడు. స్థానిక ఎమ్మెల్యే నందీష్‌రెడ్డి (బీజేపీ)కి కుడిభుజం.
బుధవారం ఉదయం 9 గంటల సమయంలో శ్రీనివాస్ సమీపంలోని బాయ్స్ మెన్స్ సెలూన్‌లోకి బయలుదేరాడు. అప్పటికే ఈ విషయాన్ని గమనించిన ప్రత్యర్థులు రోడ్డుపైనే హతమార్చాలని పథకం వేశారు. అయితే రోడ్డు చిన్నది కావడం... అయ్యప్ప నగర, దేవసంద్ర ఏరియా రద్దీగా ఉంటుందని ఆ సమయంలో శ్రీనివాస్ తప్పించుకునే అవకాశం ఉందని వెనుకడుగువేశారు. సెలూన్‌లోకి వచ్చిన వెంటనే దాడి చెయ్యాలని పథకం మార్చుకున్నారు.
శ్రీనివాస్ బాయ్స్ మెన్స్ సెలూన్‌లోకి వెళ్లి కుర్చీలో కుర్చుని షేవింగ్ చేసుకుంటున్న సమయంలో బైక్‌లలో ముసుగులు ధరించిన వచ్చిన ఆరుగురు వ్యక్తులు ఒక్కసారిగా మారణాయుధాలతో దాడి చేశారు. తల, మెడ, ఛాతి తదితర చోట్ల విచక్షణారహితంగా నరికివేశారు. దీంతో శ్రీనివాస్ కూర్చీలోనే కుప్పకూలిపోయాడు. నింది తులు బయటకు వచ్చి కేకలు వేస్తు బైక్‌లలో పరారయ్యారు. ఈ సంఘటనతో చుట్టుపక్కల వారు హడలిపోయారు. సెలూన్ యజమాని రమేష్ పోలీసులు, శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. తీవ్రగాయాలైన శ్రీనివాస్‌ను వెంటనే మణిపాల్ ఆస్పత్రికి తరలించారు.
అయితే అతను అప్పటికే మృతి చెందాడని పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న నగర అడిషనల్ పోలీసు కమిషనర్ కమల్‌పంత్, జాయింట్ పోలీసు కమిషనర్ శరత్‌చంద్ర, డీసీపీ డాక్టర్ పీఎస్. హర్ష, ఏసీపీ సిద్దప్ప సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. నగదు లావాదేవీలు, రియల్ వ్యాపారం, పాతకక్షల కారణంగానే హత్య జరిగి ఉంటుందని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ కుటుంబ సభ్యు లు, సెలూన్ యజమాని తెలిపిన వివరాల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఉద్రిక్త పరిస్థితులు : శ్రీనివాస్ హత్యకు గురి కావడంతో కేఆర్‌పురం, దేవసంద్రతో సహ పరిసర ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. శ్రీనివాస్ అనుచరులు, బీజేపీ నాయకులు, కార్యకర్తలు గుమికూడటంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నందీష్‌రెడ్డి కేఆర్‌పురంలో ధర్నా నిర్వహించారు. హంతకులను అరెస్టు చెయ్యాలని డిమాండ్ చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో స్థానిక పోలీసులతో సహ అదనపు బలగాలను రంగంలోకి దింపారు
మేయర్ ధర్నా : బీజేపీ నాయకుడు, కార్పొరేటర్ మంజుల భర్త శ్రీనివాస్‌ను హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని బీబీఎంపీ మేయర్ కట్టె సత్యనారాయణ ఆధ్వర్యలో పాలికె కేంద్ర కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా కట్టె సత్యనారాయణ మాట్లాడుతూ... రాజకీయంగా శ్రీనివాస్‌ను ఎదుర్కొలేకనే హత్య చేశారని ఆరోపించారు.
బలమైన నాయకుడు : గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న శ్రీనివాస్ కేఆర్‌పురం నగర సభ ఎన్నికలలో పోటీ చేసి గెలుపొందారు. తరువాత 2008లో జరిగిన శాసన సభ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు. స్థానికంగా శ్రీనివాస్ బలమైన నాయకుడు. గతంలో రెండు మూడు సార్లు ఈయనపై దాడి చెయ్యడానికి ప్రయత్నించారు. బలిజ కులస్తుడు అయిన శ్రీనివాస్ స్థానికంగా ఉన్న కుల సంఘాలకు పూర్తి మద్దతు ఇచ్చి ప్రోత్సహించేవాడు. ఇలాంటి నాయకుడిని పక్కా పథకంతో హతమార్చారు.