
రజనీతో రొమాన్స్‌కు ఎదురుచూస్తున్నా!
కోలీవుడ్ ఎవర్‌గ్రీన్ సూపర్‌స్టార్ అంటే రజనీకాంత్‌నే జయాపజయాలకు అతీతమైన స్థానం ఆయనది. ఆరు పదులు దాటిన ఈ స్టైల్‌కింగ్‌తో నటించడానికి కుర్ర హీరోయిన్లు ఎగబడతారు. అలా మిల్కీ బ్యూటీ హన్సిక కూడా ఆయనతో నటించడానికి ఎదురు చూస్తున్నారట. కోలీవుడ్‌లో సక్సెస్‌ఫుల్ హీరోయిన్‌గా విరాజిల్లుతున్న హన్సిక నటించిన రోమియో జూలియట్‌కు శుక్రవారం తెరపైకి వచ్చింది. విజయ్‌తో నటిస్తున్న పులి చిత్రం త్వరలో రిలీజ్‌కు సిద్ధం అవుతోంది. ఈ సందర్భంగా ఈ ఉత్తరాది బ్యూటీతో చిన్న భేటీ....
ప్రశ్న: పులి చిత్రం ఎలా ఉంటుంది?
జవాబు: చిత్రం చాలా బాగా వస్తోంది. ఇందులో నేను రాణిగా నటించాను. ఆ గెటప్‌లో తయారవ్వడానికే సుమారు మూడున్నర గంటలు పట్టేది. ఈ కష్టం అంతా పులి చిత్ర విజయంతో మరచిపోతాననే నమ్మకం ఉంది.
ప్రశ్న: విజయ్‌తో రెండవసారి నటించిన అనుభవం గురించి?
జవాబు: నేను విజయ్‌ను చూసినప్పుడల్లా రోజురోజుకు వయసు తగ్గినట్టు కుర్రాడైపోతున్నారు. ఏమి తింటున్నారు? ఆ రహస్యం ఏమిటనే అడుగుతుంటాను. వేలాయుధం తరువాత విజయ్‌తో నటిస్తున్న రెండవ చిత్రం పులి. ఈ చిత్ర షూటింగ్‌లో ఆయన నుంచి చాలా నేర్చుకున్నాను.
ప్రశ్న : అందాల బొమ్మ, హార్రర్ చిత్రాల్లో దెయ్యాం, పట్టపురాణి ఇలా వరుసగా వైవిధ్యబరిత పాత్రల్లో నటిస్తున్నారు. ఎలా ఫీలవుతున్నారు?
జవాబు: నిజంగా చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దర్శకుడు సుందర్ సి తన చిత్రాల్లో విభిన్న పాత్రలు పోషించే అవకాశాలను కల్పిస్తున్నారు. అందుకే ఆయన చిత్రాలంటే కథ కూడా అడగకుండా ఒప్పేసుకుంటాను.
ప్రశ్న: హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రాలు కమర్షియల్‌గా విజయం సాధించడం లేదనే కామెంట్‌పై మీ స్పందన?
జవాబు: అందులో వాస్తవం లేదు. అలాగైతే అరణ్మణై చిత్రం హీరోయిన్ ఓరియంటెడ్ చిత్రం కాదా? ఆ చిత్రంలో మహిళల పాత్రలే బలమైనవి. నా పాత్ర 20 నిమిషాలు ఉన్నా దాని ప్రభావం చిత్రం అంతా ఉంటుంది. అదే విధంగా నటి జ్యోతిక నటించిన 36 వయదినిలే చిత్రం మంచి విజయాన్ని సాధించింది.
ప్రశ్న: చిత్ర పరిశ్రమలో మీకు సన్నిహిత మిత్రులెవరు?
జవాబు: సుందర్ సి, కుష్భులు నాకు చాలా సన్నిహిత మిత్రులు. అలాంటి వారు ఇంకా చాలామంది ఉన్నారు.
ప్రశ్న: మరో ముగ్గురు పిల్లలను దత్తత తీసుకోనున్నారట?
జవాబు: ముగ్గురిని కాదు. ఐదుగురిని ఇప్పటికే దత్తత తీసుకున్నాను. ఇలాంటి విషయాలు బయటకు రాకూడదన్నది నా భావన. కారణం నటీమణులు ప్రచారం కోసమే ఇలాంటివి చేస్తున్నారని అనుకుంటారనే భయమే. అయినా ఈ విషయాలు ఎలాగోలా బయటకొచ్చేస్తున్నాయి. నేను మాత్రం నా ఆత్మ సంతృప్తి, సంతోషం కోసమే చేస్తున్నాను. ఇంకా ఈ అంశం గురించి మాట్లాడదలచుకోలేదు.
ప్రశ్న: రజనీకాంత్‌తో నటించే అవకాశం వస్తే అంగీకరిస్తారా?
జవాబు: అలాంటి అవకాశం వస్తే ఎవరైనా ఒదులుకుంటారా? నేను అంతే. రజనీకాంత్ సరసన నటించే అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను.