నాకు ఆ ఆలోచన లేదు
ఇప్పట్లో పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదంటోంది కాజల్ అగర్వాల్. అయితే ఈ అమ్మడిపై పలు రకాల వార్తలు ప్రచారం అవుతున్నాయి. చెల్లెలికి పెళ్లి అయిపోవడంతో తాను ఆ ముచ్చటకి తొందరపడుతోందని, ప్రస్తుతం వరుడివేటలో ఉన్నట్లు అలాగే పారితోషికం విషయంలో చాలా డిమాండ్ చేస్తున్నట్లు పలు వార్తలు మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. ఇలాంటి ప్రశ్నలను కాజల్ ముందుంచితే...
ఏ భాషా చిత్రాలకు ప్రాముఖ్యత నిస్తున్నారు?
తమిళం, తెలుగు భాషలకే ప్రాధాన్యతనిస్తున్నాను. ఈ రెండు భాషల్లో నటించడం వలన ఆత్మ సంతృప్తి పొందుతున్నాను. ప్రస్తుతం తమిళం, తెలుగు భాషల్లో నాలుగు చిత్రాలు చేస్తున్నాను. వీటితో పాటు ఒక హిందీ చిత్రం చేస్తున్నాను. మగధీర చిత్రం తరువాత తెలుగులో బలం పుంజుకున్నాను. ఆ చిత్రంతోనే నా మార్కెట్ అధికరించింది.
తమిళ చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట?
అందులో నిజం లేదు. నేను నటించిన చిత్రాలన్నింటినీ నావిగానే భావిస్తాను. వాటి ప్రచార బాధ్యత నాపై ఉంటుంది. అలాంటి బాధ్యతలను నేనెప్పుడూ కావాలని విస్మరించలేదు. కొన్ని సమయాల్లో ఇతర చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉండి ప్రచారాల్లో పాల్గొన ఉండకపోవచ్చు. దీనిని సాకుగా చూపి కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారు.
తెలుగులో శ్రుతిహాసన్ నాయకిగా నటించిన ఎవడు చిత్రంలో గెస్ట్ పాత్ర పోషించడానికి కారణం?
నిజానికి ఎవడు చిత్రంలో నేనే కథానాయకిగా నటించాల్సింది. నా కాల్‌షీట్స్ సర్దుబాటు కాకపోవడంతో శ్రుతిహాసన్ నటించారు. ఇక ఆ చిత్రంలో గెస్ట్ రోల్ పోషించడానికి కారణం ఆ చిత్ర దర్శకుడు వంశీ నాకు మంచి మిత్రుడు. అదే విధంగా రామ్‌చరణ్ కుటుంబంతో నాకు సత్సంబంధాలున్నాయి. అందువలనే గెస్ట్ రోల్ చేయమంటే కాదనలేకపోయాను.
పారితోషికం కూడా భారీ మొత్తంలో డిమాండ్ చేస్తున్నారనే ప్రచారంగురించి?
నిజం చెప్పాలంటే నాకు పారితోషికం ఒక పెద్ద విషయం కాదు. కథ, పాత్రల పైనే దృష్టి సారిస్తున్నాను. కథ నచ్చితే వెంటనే ఒప్పుకుంటున్నాను. ఇక పారితోషికం అంటారా? నా శ్రమకు తగ్గ పారితోషికం నిర్మాతలే ఇస్తున్నారు. నేనెవర్నీ అధిక పారితోషికం డిమాండ్ చేయడం లేదు. ఉదాహరణకు నాకు ఐదు కోట్లు పారితోషికం ఇమ్మంటే ఎవరైనా ఇస్తారా? నా మార్కెట్‌కు తగ్గ పారితోషికం నిర్మాతలు ఇస్తున్నారు.
మీ సక్సెస్‌కు ఎవరు కారణం?
ఖచ్చితంగా ప్రేక్షకులే. వారు నన్ను ఆరాధిస్తున్నారు. అభిమానుల ఆదరాభిమానాలను ఎప్పటికీ మరువలేను. నా ఈ స్థాయికి వారే కారణం.
సినిమా ద్వారా మీరు నేర్చుకుంది?
ఒక్కో చిత్రం ఒక్కో అనుభవం. అలా చాలా విషయాలు నేర్చుకున్నాను. ఇంకా చెప్పాలంటే నా తెలివిని మెరుగు పరచుకున్నాను.
సినిమా జీవితం సంతృప్తి నిచ్చిందా?
చాలా సంతృప్తిగా వున్నాను. ఇప్పటి వరకు నేను నటించిన చిత్రాలన్నీ బాగానే ఆడాయి. మంచి కథలు, వైవిధ్యభరిత పాత్రలు అమరాయి. ప్రతి చిత్రానికి అంకిత భావంతో పని చేశాననే తృప్తి ఉంది.
సమాజసేవపై ఆసక్తి వుందా?
ఆసక్తి మెండుగా ఉంది. సాధ్యమైనంత వరకు ఇతరులకు సాయం చేస్తున్నాను. సేవా సంస్థల కార్యక్రమాల్లో పాల్గొంటున్నాను. అలాంటి స్వచ్ఛంద సేవా సంస్థలకు, నిధులు సేకరించే కార్యక్రమాలు చేపట్టాలనే ఆసక్తి ఉంది. అయితే ప్రస్తుతం అందుకు సమయం చాలడం లేదు. భవిష్యత్తులో తప్పకుండా చేస్తాను.