
ప్రధాని మోదీకి నా సెల్యూట్: సీఎం
మోదీతో, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంభించే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల వర్షం కురిపించారు.
న్యూఢిల్లీ: పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లో సర‍్జికల్ దాడులు చేసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీకి దేశంలో అన్ని వర‍్గాల నుంచి మద్దతు వస్తోంది. నిత్యం ఆయన్ను విమర్శించేవారు సైతం ప్రశంసిస్తున్నారు. మోదీతో, కేంద్ర ప్రభుత్వంతో ఘర్షణ వైఖరి అవలంభించే ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ ప్రశంసల వర్షం కురిపించారు. పలు విషయాల్లో మోదీతో తాము విబేధించినా, సర‍్జికల్ దాడుల విషయంలో ఆయన చూపిన మనోబలానికి సెల్యూట్ చేస్తున్నానంటూ కేజ్రీవాల్ అన్నారు. సర్జికల్ దాడులను తాము పూర్తిగా సమర్థిస్తున్నామని చెప్పారు. ఈ విషయంపై పాక్ ఆర్మీ చేస్తున్న దుష్ప్రచారాన్ని ఎండగట్టాలని ప్రధానికి విజ్ఞప్తి చేస్తున్నట్టు కేజ్రీవాల్ పేర్కొన్నారు.
జమ్ము కశ్మీర్లోని ఉడీ సైనిక శిబిరంపై ఉగ్రవాద దాడికి బదులుగా పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత సైన్యం సర్జికల్ దాడులు చేసి పాక్కు గట్టి గుణపాఠం చెప్పిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి పార్టీలకతీతంగా అందరూ సమర్థించారు. రెండేళ్లలో ప్రధాని పదవికి తగ్గట్టు మోదీ చేసిన మొదటి మంచి పని ఇదేనని, ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్వీట్ చేశారు.