బదిలీపై భగ్గు | ias officer rohini sindhuri fired on her transfer | Sakshi
Sakshi News home page

బదిలీపై భగ్గు

Published Wed, Jan 24 2018 8:36 AM | Last Updated on Wed, Jan 24 2018 8:36 AM

ias officer rohini sindhuri fired on her transfer - Sakshi

సాక్షి, బెంగళూరు: ఐఏఎస్‌ అధికారి బదిలీపై ఆగ్రహం రాజుకుంది. హాసన్‌ జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరి బదిలీతో రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్‌ అధికారులకు రాష్ట్ర ప్రభుత్వం బదిలీ భాగ్య కల్పిస్తోందని ప్రతిపక్షాలు, జిల్లాలోని ప్రజాసంఘాలు భగ్గుమన్నాయి. నిజాయతీపరురాలైన అధికారిణిగా పేరుపొందిన రోహిణి బదిలీని జిల్లవాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తమకు అడ్డంకిగా మారిన ఆమెను సాగనంపాలని జిల్లా ఇంచార్జ్‌ మంత్రి మంజుతో పాటు జిల్లా కాంగ్రెస్‌ నేతలు, కార్యకర్తలు ఒత్తిడి చేయడంతోనే కలెక్టర్‌పై సిద్ధరామయ్య ప్రభుత్వం బదిలీ వేటు వేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల శ్రవణ బెళగోళలో మహామస్తకాభిషేక ఏర్పాట్లను పరిశీలనకు వెళ్లిన సీఎం సిద్దరామయ్య కలెక్టర్‌ రోహిణి సింధూరిపై అసహనం వ్యక్తం చేశారు. ఈ కారణాలన్నింటితో రోహిణిని హాసన్‌ జిల్లా నుంచి బదిలీ చేసినట్లు ప్రతిపక్షాలు ఆరోపణలు గుప్పిస్తున్నాయి. హాసన్‌ జిల్లాకు కొత్త కలెక్టర్‌ ఎం.వీ.వెంకటేశ్‌ను నియమిస్తూ, రోహిణిని కర్ణాటక రాష్ట్ర పారిశ్రామిక, కనీససౌకర్యాల అభివృద్ధి సంస్థ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. జిల్లా కలెక్టర్‌గా ఆమె గతేడాది జులైలో బాధ్యతలు చేపట్టారు.

రేపు దేవేగౌడ నిరసన
కలెక్టర్‌ రోహిణి సింధూరిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా ఈ నెల 25న హాసన్‌లో జేడీఎస్‌ జాతీయాధ్యక్షుడు దేవేగౌడ నేతృత్వంలో నిరసనలు చేయనున్నట్లు హాసన్‌ ఎమ్మెల్యే రేవణ్ణ తెలిపారు. ఎన్నికల్లో అక్రమాలను ఆమె అడ్డుకుంటారనే కారణంగా సీఎం సిద్ధరామయ్య ఆమెను బదిలీ చేశారని ఆరోపించారు. ఇందులో మంత్రి మంజు, జిల్లా కాంగ్రెస్‌ నేతల ఒత్తిడి ఉందని విమర్శించారు.

మరికొందరు ఐఏఎస్‌ల బదిలీ
ఐఏఎస్‌ మహిళా అధికారి ఎం.వీ.జయంతిని కేఏటీ అధ్యక్షురాలిగా,వీ. చైత్రాను కార్మికశాఖ కమీషనర్‌గా, కే.రాజేంద్రను రామనగర జిల్లా కలెక్టర్‌గా,ఎం.వీ.వెంకటేశ్‌ను హాసన్‌ జిల్లా కలెక్టర్‌గా,బీ.ఆర్‌.మమతాను ఆహారపౌర సరఫరాల శాఖ కమిషనర్‌గా సర్కారు బదిలీ చేసింది.

మహిళ అయితే బదిలీ చేయొద్దా? : ముఖ్యమంత్రి సిద్ధు
సాక్షి, బెంగళూరు: హసన్‌ జిల్లా కలెక్టర్‌ రోహిణి సింధూరి బదిలీని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య  సమర్థించుకున్నారు. ఒక మహిళా ఐఏఎస్‌ అధికారి బదిలీని చేయకూడదా? అని ఆయన ప్రశ్నించారు. మంగళవారం నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ 121వ జయంతి సందర్భంగా విధానసౌధ ఆవరణలోని నేతాజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ స్వాతంత్య్రం కోసం బోస్‌ చేసిన పోరాటాన్ని స్మరించుకున్నారు. నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ ఆదర్శాలు, సిద్ధాంతాలు, లక్ష్యాలకు అనుగుణంగా తమ ప్రభుత్వం పనిచే స్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా రోహిణి బదిలీపై విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ మహిళలు అయినంతమాత్రాన బదిలీ చేయకూడదా అని ప్రశ్నించారు.

ఈ బదిలీలో ఎవరి ఒత్తిళ్లు కానీ, రాజకీయాలు కానీ లేవని స్పష్టంచేశారు. సాధారణ బదిలీల్లో భాగంగానే రోహిణిని బదిలీ చేశామని, అంతకుమించి ప్రత్యేకత లేదని తెలిపారు. ప్రతిపక్షాలు కావాలనే ఈ విషయంలో రాద్ధాంతం చేస్తున్నాయని విమర్శించారు. మహదాయి నది నీటి వివాదంపై జరుగనున్న బంద్‌ వెనుక ప్రభుత్వ హస్తం ఉందని కూడా విపక్షాలు ఆరోపిస్తున్నాయని గుర్తుచేశారు. కన్నడ సంఘాల నాయకుడు వాటాల్‌ నాగరాజ్‌ ఎప్పటినుంచో మహదాయి అంశంపై పోరాడుతున్నారని, ఆయనకు, ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రత్నప్రభ, నేతాజీ ట్రస్ట్‌ అధ్యక్షుడు జీఆర్‌ శివశంకర్, కార్యదర్శి రాజ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement