ప్రేమకోసమై వలలో పడితే.. | if in trap of love | Sakshi
Sakshi News home page

ప్రేమకోసమై వలలో పడితే..

Published Tue, Oct 6 2015 3:55 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM

ప్రేమకోసమై వలలో పడితే.. - Sakshi

ప్రేమకోసమై వలలో పడితే..

డబ్బు కోసం ఓ తల్లి తన కుమార్తెనే ఎరవేసి ప్రేమపేరుతో వలవిసిరింది. ‘ప్రేమకోసమై వలలో పడితే పాపం పసివాడు..’

చెన్నై, సాక్షి ప్రతినిధి : డబ్బు కోసం ఓ తల్లి తన కుమార్తెనే ఎరవేసి ప్రేమపేరుతో వలవిసిరింది. ‘ప్రేమకోసమై వలలో పడితే పాపం పసివాడు..’ అనే చందంగా ఓ యువకుడు కిడ్నాప్‌నకు గురై అదృష్టవశాత్తు సురక్షితంగా బయటపడ్డాడు. పరారైన ప్రేమికురాలి కోసం పోలీసులు గాలిస్తున్నారు. సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

 చెన్నై పోయస్‌గార్డెన్‌కు చెందిన రవిసుందరం హోల్‌సేల్ వ్యాపారి కుమారుడు అభిషేక్ (19) చెన్నై సమీపంలోని ఒక ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం వరకు చదివాడు. చదువుపై అభిషేక్ అంతగా ఆసక్తి చూపకపోవడంతో తండ్రి ఇటీవల తన వ్యాపారంలోనే ఉంచేశాడు. స్నేహితుని పుట్టినరోజు సంబరాలకు వెళ్లివస్తానని గత శనివారం బైక్‌పై ఇంటి నుంచి వెళ్లిన అభిషేక్ ఆపై తిరిగి ఇంటికి రాలేదు.
 
  ‘రూ.5 కోట్లు చెల్లించి అభిషేక్‌ను తీసుకెళ్లు, పోలీస్‌కు సమాచారం ఇచ్చావంటే కొడుకుని ప్రాణాలతో చూడవు’ అంటూ ఆదివారం ఉదయం అభిషేఖ్ తల్లిని అతని సెల్‌ఫోన్ ద్వారానే అగంతకులు బెదిరించారు. కొడుకును కిడ్నాప్ చేశారని తెలుసుకున్న తండ్రి రవిసుందరం  నగర పోలీస్ కమిషనర్ జార్జ్‌కు ఫిర్యాదు చేశాడు. కిడ్నాప్ ఉదంతాన్ని ఛేదించేందుకు ఐదుగురితో కూడిన పోలీస్ బృందం రంగంలోకి దిగింది. ఆదివారం అంతా ఫోన్ చేయని అగంతకులు సోమవారం తెల్లవారుజాము 2 గంటలకు ఫోన్‌చేసి డబ్బుతో కాశిమేడుకు రావాలని చెప్పారు. రవిసుందరం కాశీమేడుకు వెళ్లగా అగంతకులు ఆవడికి రావాలని అన్నారు. ఆవడికి వెళ్లితే ఇక్కడ కాదు తేనాంపేటకు రావాలని చెప్పారు.
 
 తేనాంపేట సిగ్నల్ వద్ద అగంతకులు రవిసుందరాన్ని కలుసుకుని ‘డబ్బును మీ వెనుక వచ్చేవారు తీసుకుంటారు, కుమారుడిని విడిచిపెడుతున్నాం’ అన్నారు. నా కుమారుడిని ప్రత్యక్షంగా చూస్తేనే డబ్బు ఇస్తానని రవిసుందరం వాదించాడు. వీరి మధ్య సంభాషణ సాగుతుండగానే రవిసుందరం కార్ల వెనుక అగంతకులతో అనుసరిస్తున్న కారును పోలీసులు పట్టుకున్నారు. ఆ కారులో సద్దాంహుస్సేన్ (27), అహ్మద్ బతక్ (25) ఉన్నారు. వీరిద్దరినీ పోలీసులు తమదైన శైలిలో విచారించగా, చెన్నై విమానాశ్రయం వద్ద అభిషేక్‌తో మరికొందరు నిందితులు ఉన్నట్లు తెలుసుకున్నారు. పోలీసుల బృందం విమానాశ్రయానికి వెళ్లగా వీరి రాకను గమనించిన అగంతకులు అక్కడి నుంచి పారిపోయారు. పోలీసులు సైతం వారివెంటపడడంతో భీతిల్లిన కిడ్నాపర్లు పల్లవరం పాన్స్‌కంపెనీ సమీపంలో అభిషేక్‌తో సహాకారును వదిలిపెట్టి పారిపోయారు. పారిపోయిన నిందితుల్లో రిజ్వాన్ (26) అనే మరోవ్యక్తిని పట్టుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు. మొత్తం వ్యవహారంలో రవిసుందరం కారు డ్రైవరు, సహాయకులుగా పోలీసులే వ్యవహరించారు.  
 
 ప్రేమపేరుతో పథకం ప్రకారం వల
 ఆర్థిక ఇబ్బందులను అధిగమించేందుకు ప్రేమపేరుతో తన కుమార్తెనే ఎరవేసి కిడ్నాప్‌నకు పాల్పడి కటకటాలపాలైంది ఆ తల్లి. చెన్నై సమీపం ఊరపాక్కంకు చెందిన ఖుర్షిత్ (40) అనే మహిళ భర్తను విడిచిపెట్టి వేరుగా ఉంటోంది. ఈమె కుమార్తె గిండీలోని ఒక ప్రయివేటు ఇంజినీరింగ్ కాలేజీలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. భర్తలేక పోవడంతో ఖుర్షిత్ ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటోంది. రవిసుందరం ఇంటికి వాటర్‌క్యాన్ సరఫరా చేసే శంకర్ అనే వ్యక్తి ఇచ్చిన సలహాతో అభిషేక్ కిడ్నాప్ పథకం పన్నింది.ఖుర్షిత్ తన కుమార్తె భానుకు అభిషేక్ సెల్‌ఫోన్ నెంబరు అందజేసి మిస్డ్‌కాల్ ఇమ్మంది. తల్లి సలహాతో నెలరోజులుగా మాటలతోనే అతనిలో ప్రేమను రగిల్చిన భాను ఎలాగైనా నేరుగా చూడాలనే తపన స్థాయికి అభిషేక్‌ను తీసుకువచ్చింది. శనివారం మోటార్‌బైక్‌పై అభిషేక్ భానును కలుసుకున్నాడు. ఇద్దరూ కలిసి ఒక కారులో సరదాగా ప్రయాణిస్తుండగా ముందుగా వేసుకున్న పథకం ప్రకారం వారి కారును మరోకారులో వెంబడించి కిడ్నాప్‌నకు పాల్పడ్డారు. విమానాశ్రయం వద్ద డబ్బుముట్టగానే అభిషేక్‌ను విడిచిపెట్టాలని భావించారు. అయితే ఇంతలో కథ అడ్డం తిరిగింది. కిడ్నాప్ కథను సుఖాంతం చేసిన పోలీసులు ఖుర్షిత్‌ను అరెస్ట్ చేయగా, ప్రేమవల విసిరిన కుమార్తె భాను పరారైంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement